close

JEE

ఐఐటీ సీటుకు మరొక్క అడుగు

* జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు తుది మెరుగులు

కరోనా సమయంలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌- 2020ను తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయవంతంగా పూర్తిచేశారు. సెప్టెంబరు 27న జరగబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై శ్రద్ధగా దృష్టిసారిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు సాధించాలంటే దీనిలో ర్యాంకు ఆధారమని మర్చిపోకూడదు. తెలుగు విద్యార్థులకు రాబోయే కొద్ది రోజులూ కత్తి మీద సాములాంటిదేే. ఎందుకంటే మధ్యలో టీఎస్‌ ఎంసెట్, ఎపీ ఎంసెట్‌ కూడా ఉన్నాయి. కాబట్టి, సరైన ప్రణాళికతో రాబోయే ఈ రెండు వారాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడున్న వ్యవధిని సరిగా ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా చేస్తే మార్కులను పెంచుకోవచ్చో నిపుణుల సూచనలు..!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌Â- 2020ను ఐఐటీ దిల్లీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2012, 2013ల్లోనూ ఐఐటీ దిల్లీనే నిర్వహించింది. కాబట్టి ఒకసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న 2012, 2013 ప్రశ్నపత్రాలను గమనించుకోవాలి. అడిగిన ప్రశ్నలు, వాటి స్థాయి, వాటి వెనకనున్న ప్రాథమిక అంశాలపై దృష్టిసారించాలి. ఏ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి, ప్రశ్నలు అడిగే విధానంపై దృష్టిసారిస్తే రాబోయే పరీక్షలో అడిగే ప్రశ్నలపై అవగాహన తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటిదాకా ఆ అంశాలపై పట్టు సాధించకపోతే ఇప్పుడు వాటిపై దృష్టిపెట్టే వీలు కలుగుతుంది.

ప్రాధాన్యం
ఈ రెండు వారాల్లో ఒక్కో సబ్జెక్టుకు రోజుకు 3 గంటల సమయమైనా కేటాయించాలి. మూడు సబ్జెక్టులు- మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతి సబ్జెక్టుకూ విడివిడి కటాఫ్‌ మార్కులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే రోజువారీ సన్నద్ధతలోలా ఇప్పుడు కొత్త అంశాలను నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వొద్దు. నేర్చుకున్న అంశాలపై పట్టు సాధించడానికే ప్రాముఖ్యమివ్వాలి.

రుణాత్మక మార్కులు
ప్రధానంగా దృష్టిపెట్టాల్సిన అంశం. ఎక్కువమంది విద్యార్థులు రుణాత్మక మార్కులున్న ప్రశ్నలను అసంపూర్తిగా సాధిస్తూ పరీక్ష సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఫలితంగా మార్కులనూ కోల్పోతుంటారు. ఇలాంటి ప్రశ్నలను సాధించడానికి ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి.

పరీక్ష రోజున..
‘‘ పేపర్‌-1 బాగా రాశారా? మంచిది, పేపర్‌-2ని మరింత బాగా రాయి!’’
‘‘ పేపర్‌-1 బాగా రాయలేదా? ఫర్వాలేదు, పేపర్‌-2ని ఇంకా బాగా రాయి!’’

స్థాయిని బట్టి ఎంపిక
జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. ఒక్కరోజులో రాసే రెండు పరీక్షలు. కాబట్టి, ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటపుడు ఒకటికి రెండుసార్లు ప్రశ్నలస్థాయిని పరీక్షించుకోవాలి. ఆ తరువాతే సరైన సమాధానాన్ని గుర్తించాలి. మొదటి 5 నిమిషాల్లో ముందుగా మూడు సబ్జెక్టుల్లోని ప్రశ్నల స్థాయిని గమనించుకోవాలి. ఇందుకు స్కాన్‌ అండ్‌ అటెమ్ట్‌ విధానాన్ని అనుసరించి, అవగాహన చేసుకుని ముందుకు వెళ్లాలి. ఇప్పటికే విద్యార్థులకు దీనిపై అభిప్రాయం ఉండి ఉంటుంది.

సూచనలు
స్క్రీన్‌పై ప్రశ్న కనిపించిన వెంటనే సమాధానం రాసెయ్యాలన్న ఆత్రుత వద్దు. ముందు పేపర్‌-1లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, వాటిలో వేటికి ఎన్ని మార్కులు కేటాయించారో చూసుకోవాలి. అలాగే వేటికి రుణాత్మక మార్కులున్నాయో వేటికి పాక్షిక మార్కులున్నాయో వేటికి లేవో కూడా చూసుకోవాలి. పేపర్‌-2లోనూ ఇదే పద్ధతిని అనుసరించాలి. దీన్ని బట్టి ముందుగా రుణాత్మక మార్కులు లేని సెక్షన్లపై- మూడు సబ్జెక్టుల్లోని ప్రశ్నలపై దృష్టి సారించి, ఆపై మిగతా వాటివైపు వెళ్లాలి. ఆ ప్రశ్నలను అసలు వదిలేయకుండా జాగ్రత్తపడాలి. తరువాత పాక్షిక మార్కులు నిర్దేశించిన సెక్షన్లు, చివరగా రుణాత్మక మార్కులున్న వాటిపై దృష్టిపెట్టాలి.

సమయ విభజన
ముందు ఏ పేపర్‌ రాయాలి? దేన్ని చివరగా ఎంచుకోవాలి? ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలి? మ్యాథ్స్‌కు గంట చాలా? గంటన్నర కేటాయించాలా? ఫిజిక్స్‌కు గంట సరిపోతుందా?... చాలామంది విద్యార్థులను వేధించే ప్రశ్నలివి. ఎంసెట్‌లో మాదిరిగా మ్యాథ్స్‌కు కనీసం 90 నిమిషాలు, ఫిజిక్స్‌కు 50 నిమిషాలు, కెమిస్ట్రీకి 40 నిమిషాలు.. ఇలా సమయాన్ని ప్రత్యేకంగా చెప్పడం కష్టం. విద్యార్థి తన అవగాహన స్థాయి ప్రకారం దీన్ని నిర్ణయించుకోవాలి. కానీ ప్రతి సబ్జెక్టుకి కనీసం 40 నిమిషాలు కేటాయించాలి. మిగిలిన సమయంలో నచ్చిన సబ్జెక్టుకు 25 నిమిషాలు, ఇంకో 25 నిమిషాలను కష్టమైన ప్రశ్నలకు కేటాయించటం మేలు. చివరి 10 నిమిషాలను మాత్రం మొత్తం ప్రశ్నపత్రాన్ని, రాసిన సమాధానాలను సరిచూసుకోవడానికి ఉపయోగించుకోవాలి.

REST మంత్రం!
R.. రివైజ్‌: సన్నద్ధమైన ప్రతి విషయాన్నీ పునశ్చరణ చేసుకోవాలి.
E .. ఈట్‌: చదవడమే కాదు.. పౌష్టికాహారాన్నీ సరిగా తీసుకోవాలి.
S .. స్లీప్‌: మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. అనవసర ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఉండగలగాలి.
T.. టెస్ట్‌ యువర్‌సెల్ఫ్‌: బలాలు, బలహీనతలపై దృష్టిసారించాలి. అప్పుడే విద్యార్థికి తనపై తనకు అవగాహన, నమ్మకం ఏర్పడతాయి.

ప్రభావం
మిగతా పరీక్షల్లోలా కాకుండా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఒకేరోజు మూడు గంటల వ్యవధిగల రెండు పరీక్షలను ఒకేరోజు రాయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థి శారీరకంగానే కాదు మానసికంగానూ సిద్ధమవడం చాలా అవసరం. చాలామంది విద్యార్థులు ఉదయం నిర్వహించే పేపర్‌-1 సరిగా రాయలేకపోతే దాని ప్రభావాన్ని పేపర్‌-2పై చూపించి మార్కులు కోల్పోతున్నారు.
కానీ ఇక్కడ ఆల్‌ ఇండియా ర్యాంకులో రెండింటి మార్కుల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటార్న విషయాన్ని మర్చిపోవద్దు. ఒకటి కష్టంగా, రెండోది తేలికగా లేదా రెండూ కష్టంగా, రెండూ తేలికగా.. పరీక్ష ఎలాగైనా ఉండొచ్చు. కాబట్టి, ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. పేపర్‌-1 బాగా రాస్తే, పేపర్‌-2 ఇంకా బాగా రాయాలనుకోవాలి. పేపర్‌-1 బాగా రాయకపోతే రెండోది అయినా బాగా రాసేలా ప్రయత్నించాలి. ఇక్కడ ఆత్మస్థైర్యం ఉంటేనే పరీక్షలో విజయం సాధ్యమని గుర్తించాలి.

మాదిరి ప్రశ్నపత్రాలు
మాదిరి ప్రశ్నపత్రాలను వీలును బట్టి రోజూ/ రోజువిడిచి రోజైనా రాస్తుండాలి. వీలైనన్ని ఆన్‌లైన్‌ మాదిరి పరీక్షలను రాయడం చాలామంచిది.

వీటిని గమనించండి!
* బాగా రాస్తామన్న నమ్మకంతో పరీక్ష ముందురోజు చక్కగా నిద్రపోవాలి.
* కొవిడ్‌-19 సెల్ఫ్‌ డిక్లరేషన్‌లో వివరాలు నమోదు చేయడం మర్చిపోవద్దు. దానిపై ఫొటోతోపాటు సంతకం, బొటనవేలి ముద్రనూ వేయాలి.
* గత 14 రోజులుగా తనకు జ్వరం, గొంతు సమస్యలు, దగ్గు, శ్వాస సమస్యలు, ఒంటి నొప్పులు లేవని ఆ డిక్ల్టరేషన్‌లో పేర్కొనాలి. అంతేకాకుండా కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్నారా? లేదా వివరాలూ నమోదు చేయాలి.
* గంట ముందుగానే పరీక్ష హాలుకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
* మొదటి పరీక్ష అనంతరం రెండు పరీక్షలకు కనీసం 2 గంటల వ్యవధి ఉంటుంది. కాబట్టి, బయటినుంచి కాకుండా ఇంటి దగ్గరి నుంచే ఆహారం, నీరు తెచ్చుకోవడం మంచిది.
* ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్, ఇతర నిషిద్ధ వస్తువులను పరీక్ష హాలుకు తీసుకెళ్లవద్దు.
* ప్రతి పేపర్‌కు నిర్దేశించిన మూడు గంటల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
* మీతోపాటు పరిశుభ్రమైన మాస్కులను తీసుకెళ్లాలి.
* ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాన్ని సబ్‌మిట్‌ చేసేముందు ఒకసారి అన్ని ప్రశ్నలూ రాశారో లేదో చూసుకోవాలి.
* ఏ4 సైజు తెల్లకాగితాలను రఫ్‌వర్క్‌ చేసుకోవడానికి తీసుకెళ్లడం మంచిది.
* సందేహాలేమైనా వస్తే ఇన్విజిలేటర్‌ సాయం తీసుకోవచ్చు. మొత్తంగా ఆత్మస్థైర్యంతో పరీక్ష రాయాలి.

Published on 10-09-2020