close

JEE > PREPARATION PLAN

మార్పు మంచికే!

జేఈఈ మెయిన్స్‌.. ఇంజినీరింగ్‌ ప్రవేశానికి జరిగే దేశవ్యాప్త పరీక్ష! ఐఐటీల్లో ప్రవేశానికి తొలిమెట్టు కూడా ఇదే. ఈ విద్యాసంవత్సరం నుంచి రెండుసార్లు నిర్వహించబోతున్నారు. జనవరి 6 నుంచి 20 వరకూ తొలి విడత, ఏప్రిల్‌ 6 నుంచి 20 వరకూ రెండో విడత. ఈ మార్పు గురించి ఆందోళనపడటం అనవసరం. కొత్త పరిస్థితుల్లో ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు ఎలా సంసిద్ధం కావాలి? ప్రిపరేషన్‌ను ప్రయోజనకరంగా ఎలా మల్చుకోవాలి? మార్గదర్శక సూచనలు ఇవిగో!

ఈ ఏడాది నుంచి ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) జేఈఈ మెయిన్‌ నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. 31 ఎన్‌ఐటీలు, 23 ఐఐఐటీలు, 23 సీఎఫ్‌టీఐ (సెంట్రల్లీ ఫండెడ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌)లలో, హరియాణా, నాగాలాండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ సీట్లకూ ఈ పరీక్ష స్కోరు ఉపయోగం. ఐఐటీల్లో ప్రవేశానికి ఈ ఎన్‌టీఏ - జేఈఈ మెయిన్స్‌ అర్హత పరీక్షగా ఉంటుంది. ఇప్పటికే ఎన్‌టీఏ - జేఈఈ మెయిన్స్‌ 2019 పరీక్ష నిర్వహణ విధానం, పరీక్ష తేదీలతో ప్రకటన వెలువడింది. గతంలో పరీక్ష ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ రాసేవారు. కానీ ఇక నుంచీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. దరఖాస్తులు సెప్టెంబరు 1 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

మెయిన్‌- 2019: మార్పులు
ఎ) 2019లో జరిగే జేఈఈ మెయిన్‌ పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) కాబట్టి ప్రతి విద్యార్థీ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలోనే రాయాలి. ఒక విద్యా సంవత్సరంలో 2 సార్లు (జనవరి, ఏప్రిల్‌) పరీక్ష జరుగుతుంది. విద్యార్థి రెండు పరీక్షలైనా రాయవచ్చు. లేదా ఒకసారి అయినా రాయవచ్చు. ఈ రెండింటిలో ఎక్కువ మార్కులు వచ్చిన పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. ఒక విద్యార్థి ప్రవేశ పరీక్షను వరుసగా 3 సంవత్సరాలు రాయవచ్చు.
బి) ఎన్‌టీఏ నమూనా పరీక్షలను 2018 సెప్టెంబరు 1వ తేదీ నుంచి విడుదల చేస్తుంది. పూర్తి అవగాహన కోసం విద్యార్థులు వీటిని అభ్యాసం చేసుకోవచ్చు.
సి) ఎన్‌టీఏ - జేఈఈ మెయిన్‌ ప్రాక్టీస్‌ సెంటర్లను దేశమంతటా 2697 చోట్ల అందుబాటులోకి తెస్తారు. విద్యార్థులు ప్రతి శని- ఆదివారాల్లో కాలేజీ అభ్యాసానికి ఆటంకం లేకుండా దగ్గర్లోని టెస్ట్‌ ప్రాక్టీస్‌ సెంటర్‌ (టీపీసీ)లో అభ్యాసం చేసుకోవచ్చు.
డి) ఎన్‌టీఏ - జేఈఈ మెయిన్స్‌ పరీక్ష నిర్వహణ కోసం అధిక సంఖ్యలో ప్రశ్నల నిధిని సేకరించారు. నిష్ణాతులైన అధ్యాపకులు, విద్యావేత్తలు, సైకోమెట్రిక్‌ పరీక్ష నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రశ్నలనిధి తయారయింది. దీనిలో ప్రతి విద్యార్థికీ వేర్వేరు ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలకు జవాబులు గుర్తించేటప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ మెథడాలజీలో విద్యార్థికి సులభం నుంచి క్లిష్ట ప్రశ్నలు వచ్చేలా చేస్తారు. దీనివల్ల విద్యార్థి నిజమైన ప్రతిభను వెలికి తీసేలా ప్రశ్నల కూర్పు లభిస్తుంది.

చాప్టర్ల వారీ వెయిటేజి
ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో అయినప్పటికీ గత సంవత్సరంలా మొత్తం 90 ప్రశ్నలతో మాథమేటిక్స్‌ 30, ఫిజిక్స్‌ 30, కెమిస్ట్రీ 30 ప్రశ్నలతో ఉంటుంది. సరైన సమాధానానికి +4 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు. సహజంగా జాతీయస్థాయి పోటీ పరీక్షలలో ద్వితీయ సంవత్సర సిలబస్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా నిర్వహించే పరీక్షకు బ్లూ ప్రింట్‌ ఇచ్చారు. అంటే సుమారుగా ఏ అధ్యాయం నుంచి ఎన్ని ప్రశ్నలు ఇస్తారనేది ప్రకటించారు. దీనికి అనుగుణంగా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులకు ప్రణాళిక ఏర్పరుచుకోవచ్చు.

JEE MAINS Subject Wise Weightage
Mathematics weightage
Coordinate Geometry. 12%
Integral Calculus. 12%
Trigonometry. 7%
Sequence and Series. 7%
Matrices and Determinants 7%
Differential Equations 7%
Chapter name No of questions
Sets, Relations and Functions. 1
Complex Numbers and Quadratic 3
Equations
Matrices and Determinants. 2
Permutations and Combinations 1
Mathematical Induction. 1
Binomial Theorem and its simple 1
applications
Sequences and Series. 2
Limit, Continuity and
Differentiability. 1
Integral Calculus. 3
Differential Equations. 1
Co-Ordinate Geometry. 5
Three Dimensional Geometry. 3
Vector Algebra. 1
Statistics and Probability. 2
Trigonometry. 2
Mathematical Reasoning. 1
Physics weightage
Chapter name No of questions
Units &Dimensions. 1
Kinematics. 1
ElectricPotential &Capacitance. 2
Laws of Motion 3
Moving Charges& Magnetism. 2
Work, Energy &Power. 2
Rotational Motion. 2
Electromagnetic Waves &Communication Systems 2
Current Electricity. 3
Mechanics of Solids & Fluids. 1
Oscillations. 1
Alternating Current. 2
Waves. 1
Semiconductors 1
Wave Optics. 2
Kinetic Theory of Gases. 1
Dual Nature of Radiation. 1
Thermodynamics. 1
Atom and nuclei. 1
Chemistry weightage
Chapter name No of questions
Chemical Bonding and Molecular Structure. 3
Hydrogen and S block Elements. 1
P-Block Elements 2
D- and F Block Elements.
Coordination Compounds. 1 or 2
Practical Chemistry. 1 or -
Basic Principles of Organic Chemistry. 1
Hydrocarbons and their substituents. 2
Organic Compounds Containing Oxygen & reactons 3
Organic Compounds Containing Nitrogen. 1
Biomolecules and Polymers. 1
Chemistry of Environment and Everyday Life. 1 or 2
General principle of extraction of metals. 1 or -
Mole concept and stoichiometry. 1
States of matter and solutions. 2
Themodynamics. 1
Equilibrium. 3
Redox reactions and electrochemistry 2
Chemical kinetics and nuclear chemistry 1
Surface chemistry. 1

అన్నీ సానుకూలమే!
జనవరి, ఏప్రిల్‌లలో రెండు సార్లు జరిగే పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇది విద్యార్థులకు వరం లాంటిదే. విద్యార్థులు డిసెంబర్‌ నెలాఖరు వరకే పోటీ పరీక్షలకు తయారవుతారు. తర్వాత జనవరి, ఫిబ్రవరి బోర్డు పరీక్షలకూ, ప్రాక్టికల్స్‌.. తర్వాత థిÇయరీ పరీక్షలకు రెండు నెలలు కేటాయిస్తారు. ఇప్పుడు పరీక్ష ముందుకు జరగటం వల్ల డిసెంబర్‌ వరకూ తయారయ్యే పోటీ పరీక్షల అభ్యాసాన్ని జనవరిలోనే ప్రదర్శించుకునే అవకాశం ఏర్పడింది. ఏప్రిల్‌ పరీక్ష కంటే జనవరి పరీక్షే బాగా రాయడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఏప్రిల్‌ పరీక్షకు ఇంటర్‌ పరీక్షల తర్వాత 15- 20 రోజుల లోపు మాత్రమే కాల వ్యవధి ఉంటుంది. అంత స్వల్ప వ్యవధిలో మళ్లీ ప్రథమ సంవత్సరం సిలబస్‌ పునశ్చరణ, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ను కూడా పోటీ పరీక్షల నేపథ్యంలో తయారవటం, వీటితో పాటు గ్రాండ్‌ టెస్టుల ద్వారా అభ్యాసం చేసుకోవడానికి సమయం సరిపోదు. మానసిక ఒత్తిడికి లోనై పరీక్ష సరిగా రాయకుండా ఉండే అవకాశాలే ఎక్కువ. ఇప్పటినుంచి డిసెంబరు వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌కు సమ ప్రాధాన్యం ఇచ్చి ఆన్‌లైన్‌ పరీక్షలను అధికంగా రాయాలి. ఇలా అభ్యాసం చేయగల్గితే జనవరి పరీక్షలోనే మంచి మార్కులు సాధించవచ్చు!

40 రోజులకు బదులు 4 నెలల వ్యవధి
* జనవరి పరీక్షలో జేఈఈ మెయిన్స్‌లో 360 మార్కులకు 180 మార్కుల పైన సాధించిన విద్యార్థులు కచ్చితంగా ఎన్‌ఐటీల్లో సీటు, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధిస్తారు. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్‌పై మాత్రమే దృష్టి కేంద్రీకరించి మంచి ఐఐటీలో సీటు సాధించవచ్చు. అంటే జేఈఈ అడ్వాన్స్‌కు గతంలో కేవలం 40 రోజులు సమయం దొరికేది కానీ ఇప్పుడు జనవరి నుంచి మే వరకూ కనీసం 4 నెలలు విద్యార్థి సంపూర్ణంగా జేఈఈ అడ్వాన్స్‌కు తయారవటానికీ, పరీక్షలు అద్భుతంగా రాయటానికీ వీలు ఏర్పడింది!
* జేఈఈ అడ్వాన్స్‌ కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తున్నారు. అందువల్ల పరీక్షల అభ్యాసం రెండింటికీ బాగా ఉపయోగపడుతుంది.
* రెండు పరీక్షల్లో ఉత్తమ మార్కులను పరిగణనలోనికి తీసుకుంటారనేది కూడా కొందరు విద్యార్థులు సరిగా అవగాహన చేసుకోవటం లేదు. తొలిసారి పరీక్షలో మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మార్కులను విడివిడిగా తీసుకుంటారనీ, తర్వాత కూడా పరీక్ష రాసి విడి సబ్జెక్టుల్లో ఎక్కడ ఎక్కువ మార్కులు వస్తే వాటిని లెక్కిస్తారనీ అపోహ పడుతున్నారు. ఇంటర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్ష మాదిరే ఉంటుందని పొరబడుతున్నారు. మొత్తం మూడు సబ్జెక్టులను కలిపిన మార్కులను మాత్రమే పరిగణించి మొత్తం మార్కులు ఏ పరీక్షలో అధికంగా వచ్చాయో దాన్నే లెక్కలోకి తీసుకుంటారు.
* పరీక్ష వివిధ సెషన్లలో జరుగుతుంది కాబట్టి ఒక సందర్భంలో పేపర్‌ సులభంగా, వేరొక సందర్భంలో పేపర్‌ క్లిష్టంగా ఉంటే నష్టపోతామేమో అనే సంశయం విద్యార్థుల్లో ఉంది. బిట్స్‌ పిలానీ వారు నిర్వహిస్తున్న పరీక్ష మాదిరే ప్రతి విద్యార్థికీ ఒకే రకమైన క్లిష్టత ఏర్పడేలా జేఈఈని నిర్వహిస్తారు. అందుకని అలాంటి ఆందోళన అవసరంలేదు. ఇప్పటి నుంచే ఆత్మవిశ్వాసంతో పరీక్షలు ఎక్కువ రాస్తూ అభ్యాసం చేయగల్గితే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జేఈఈలో అద్భుతంగా రాణించగలరు.
జనవరి, ఏప్రిల్‌ రెండుసార్లు జేఈఈ అడ్వాన్స్‌ క్వాలిఫై లిస్ట్‌ ఇస్తారా అనే సందేహం కొందరిలో ఉంది. రెండింటి ర్యాంకులను ఏప్రిల్లో ప్రకటిస్తారు. పరీక్షలో 150 మార్కుల పైన సాధిస్తే కచ్చితంగా క్వాలిఫై అవుతారు.

జేఈఈని గెలిపించే ఒలింపియాడ్‌!
విజ్ఞానశాస్త్ర రంగాల్లో, సాంకేతిక సంబంధ పరిశ్రమల్లో రాణించాలనుకునేవారికే కాకుండా వ్యాపారరంగాల్లో ఆసక్తి ఉన్నవారికి కూడా ‘ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌’ అతి ముఖ్యం. దీన్ని అందించే శక్తి మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ సిలబస్‌కు ఉంది. జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు కూడా సమస్యా పరిష్కార నైపుణ్యాలను సవాలు చేస్తాయి. అందుకే... సిలబస్‌లోని వేల సమస్యలను స్టడీ మెటీరియల్‌ రూపంలో తయారుచేసి విద్యార్థులతో సాధన చేసినంతమాత్రానే జేఈఈలో నెగ్గటం అసాధ్యం. మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌, జేఈఈల సిలబస్‌లు పూర్తిగా భిన్నమైనవేే. అయినప్పటికీ ఒలింపియాడ్‌కు సిద్ధమైతే ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌కు సంబంధించిన లాజికల్‌ మ్యాథమేటికల్‌ ఇంటలిజెన్స్‌, స్పేషియల్‌ ఇంటలిజెన్స్‌లు ఏమేరకు ఉన్నాయో, వాటినెలా మెరుగుపరచుకోవాలో తెలుస్తుంది. ఒలింపియాడ్‌ సిలబస్‌లో ఉన్న నంబర్‌ థియరీ, ఆల్జీబ్రా, కాంబినేటరిక్స్‌ భావనలను నేర్చుకోవటం, సమస్యలు సాధించడం వల్ల తార్కిక- గణిత మేధాశక్తి ప్రేరేపితం అవుతుంది. ఒలింపియాడ్‌ సిలబస్‌లోని జామెట్రీని సాధన చేస్తే స్పేషియల్‌/ విజువలైజేషన్‌ మేధాశక్తి బయల్పడుతుంది. మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌లో ఏ అంచె వరకూ వెళ్ళగలిగినప్పటికీ జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌లలో విజయం ఎంతో తేలికవుతుంది! ఈ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించేవారిలో ఎక్కువమంది... మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌లో ఏదో ఒక దశ చేరుకున్నవారే!

తొలి పరీక్షే తుది పరీక్షగా సిద్ధమవ్వాలి!
ప్రస్తుతం కొందరు విద్యార్థులు జనవరిలో జరిగే పరీక్షను సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీన్ని ఒక మాదిరి పరీక్షలా భావించి ఏప్రిల్లో జరిగే పరీక్షనే అసలు పరీక్షగా భావించి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అది సరైన పద్ధతి కాదు. జనవరి పరీక్షనే అసలైన పరీక్షగా భావించాలి. ఎందుకంటే ఆ తర్వాత దొరికే కొంచెం సమయంలో ఏప్రిల్‌ పరీక్షకు ప్రిపేరై స్కోరు పెంచుకోవడం అంత తేలిక కాదు. చాలా విద్యాసంస్థల్లో సిలబస్‌ నవంబరులోనే పూర్తవుతుంది. బోర్డు పరీక్షల ఒత్తిడి కూడా ఉండదు. కాబట్టి జనవరిలో జరిగే పరీక్షకే పూర్తిస్థాయిలో సన్నద్ధులవడం సరైన నిర్ణయం. ఈ పరీక్షలో తెచ్చుకునే మార్కులను బట్టి తర్వాతి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
* దసరా సెలవుల్లోపు ఇంటర్‌ సిలబస్‌ పూర్తిచేసుకుని ఆ తర్వాత, మెయిన్స్‌ పరీక్షకు సన్నద్ధత ఆరంభించాలి.
* ఇష్టమైన లేదా కష్టమైన సబ్జెక్టును మాత్రమే చదవటం కాకుండా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఎక్కువ ప్రశ్నలను సాధించటం కంటే ఎక్కువ కాన్సెప్టులను అర్థం చేసుకోవడం ముఖ్యం.
* పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది కాబట్టి వేగానికీ, కచ్చితత్వానికీ ప్రాధాన్యం. వీటికోసం వీలైనన్ని మాదిరి పరీక్షలు రాయాలి.
* నెగిటివ్‌ మార్కులున్నందున ఊహించి సమాధానాలు గుర్తించకూడదు.
* పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో జరుగుతుంది. అందుకని కొన్ని ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ పరీక్షలు రాయడం చాలా అవసరం. ఎన్నో సంస్థలు ఇంటర్నెట్‌ ద్వారా ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
* ఒత్తిడికి గురై మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఒకవేళ పరీక్ష సరిగా రాయలేకపోయినా ఏప్రిల్లో మరో అవకాశం ఉంటుందని ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

Published on 27-08-2018