కాస్త సాయం చేయరూ..!
వినయ్‌కి వృత్తిగతంగా అయిదేళ్ల అనుభవం ఉంది. అన్ని పనులనూ సమర్థంగా పూర్తి చేస్తున్నారు. ఆయన నుంచి సంస్థ ఆశించిన ఫలితాలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయనకు ఒక అంశంలో సమస్య వచ్చింది. ఎలా పరిష్కరించాలో తోచలేదు. దీనిపై సహచరులను.. పై అధికారులను సాయం కోరదామనుకొన్నారు. అయితే సాయం కోరడం నామోషీగా అనిపించింది. ఆ సమస్యను తోచినట్లు పరిష్కరించారు. దీంతో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఫలితంగా ఆయన అప్పటిదాకా సంస్థ తనపై ఉంచిన విశ్వాసాన్ని కోల్పోయారు.

వృత్తిగతంగా ఇలాంటి పరిస్థితులు చాలా మందికి ఎదురౌతుంటాయి. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నట్లు.. వృత్తిగతంగా ఏదైనా సమస్య.. వచ్చినపుడు పరిష్కరించుకోడానికి ఇతరులను సాయం కోరాలంటారు నిపుణులు. ఉన్నతాధికారులను సాయం కోరినంత మాత్రాన జరిగే నష్టం ఏమీ ఉండదు. పైగా మంచి ఫలితాలు సాధించొచ్చు. ఎప్పుడూ ఒకరి కంటే.. ఇద్దరి ఆలోచనలు కలిసినపుడు మంచి ఫలితాలు వస్తాయన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

కొందరు సహచర ఉద్యోగులకు వృత్తిగతంగా సమస్య వచ్చినపుడు సాయం చేస్తుంటారు. కాని అదే సాయం తాము అడిగేందుకు చిన్నతనంగా భావిస్తుంటారు. అలా అడగడం వల్ల తమకు ఏమీ తెలియదని అనుకుంటారేమో.. అని భావించి.. దాన్ని ఒక బలహీనతగా పరిగణిస్తుంటారు. కాని ఇది తప్పు. వృత్తిగతంగా సహచర ఉద్యోగి, పై అధికారి సాయం అడగడం బలహీనత కాదు. సాయం పొందడం వల్ల చాలా సమస్యలను ముందుగానే నివారించొచ్చు.

ప్రపంచంలో ఓ ఒక్కరూ ఒంటరిగానే తమ లక్ష్యాలను చేరుకోలేరు. వృత్తిలో విజయవంతంగా రాణించాలంటే ఇతరుల సాయం.. సలహాలు తప్పనిసరి. అందుకే వృత్తిగతంగా సాయం కోరడం.. చేయడం.. అందుకోవడం చాలా ముఖ్యం.

మరికొందరు తాము సాయం అడిగితే ఆ ఉద్యోగి.. లేకుంటే పై అధికారి ఏమన్నా అనుకుంటారని భయపడుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వృత్తి గతంగా ఇతరులకు సాయం చేయడానికి ఎక్కువ మంది ఆసక్తిగానే ఉంటారు. సహచరులు, పై అధికారులతో చక్కని సంబంధాలు కలిగి ఉంటే అసలు సాయం కోరడానికి ఏ ఇబ్బందులూ రావు.

మీకు ఒక సమస్యను పరిష్కరించడానికి కొన్ని గంటలు.. లేక రోజులు పట్టొచ్చు. అదే ఇతరుల సాయం కోరితే ఆ సమస్య క్షణాల్లో పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటపుడు మీరు సాయం కోరడం వల్ల విలువైన సమయం ఆదా అవుతుంది. సమస్య పరిష్కారం కాలేదన్న బాధా తప్పుతుంది. ఒకవేళ ఇతరులు మీకు సాయం చేయలేకుంటే మీరు ఎంచుకుకన్న పరిష్కార మార్గాన్నయినా వారితో చర్చించాలి. అలా చేస్తే మీ ఆలోచనల్లో లోపాలు తెలుస్తాయి. వీటి వల్ల ప్రతికూల ఫలితాలను తగ్గించవచ్చు.

సాయం కోరడం అన్నది కాస్త సాహసంతో కూడుకున్న పని. ఎందుకంటే అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తారో తెలియదు. అయితే సమస్యను పరిష్కరించలేక ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కన్నా ఈ చిన్న సాహసం చేయడం మేలు. సానుకూల దృక్ఫథంతో ముందుకెళ్తే సంస్థలో ప్రతి ఒక్కరూ మీరు సాయపడొచ్చు. అలాగని ప్రతి చిన్న విషయానికీ ఇతరుల సాయం కోరడం సరికాదు. ఒక సమస్యను వీలైనంత వరకు మీయంతట మీరే పరిష్కరించడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించి విఫలమైనపుడు మాత్రమే ఇతరుల సాయం కోరడం మంచిది.

పోటీ దారులు, మీపై ప్రతికూల ఆలోచనలున్న వారి వద్ద సాయం కోరడం సరికాదు. వీరు సాయం చేయడంతో పాటు తప్పుదారి పట్టించే అవకాశాలూ ఉంటాయి. వీలైనంత వరకు మీపై సానుకూల అభిప్రాయం ఉన్న సహచరులు, పై అధికారులను మాత్రమే సాయం కోరడం ఉత్తమం. ఒక్కోసారి కిందిస్థాయి ఉద్యోగితో మాట్లాడినా.. పరిష్కారం లభించొచ్చు.