ఆలోచనలు.. మాటలు ఈ రెండింటిలోనూ సానుకూల దృక్పథం చాలా ముఖ్యం. మన నోటి నుంచి వెలువడే ప్రతిమాటా సానుకూలంగానే ఉండేలా జాగ్రత్తపడటం ముఖ్యం. ఇలా మాట్లాడినపుడు అవతలి వ్యక్తుల నుంచీ సానుకూల స్పందన వస్తుంది. చివరకు ప్రతికూల అంశాలను కూడా అనుకూలంగా మార్చే సామర్థ్యం సానుకూల దృక్పథం కలిగిన మాటలకు ఉంటుంది. ఇది మీపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది కూడా. ఈ తీరు ఉద్యోగ జీవితంలో ప్రయోజనకరం. చాలా అవసరం. అలా కాకుండా ప్రతికూలంగా మాట్లాడితే అన్నీ ప్రతికూలంగానే మారే ప్రమాదం ఉంది.
ఒక వ్యక్తి చక్కగా మాట్లాడగలుగుతున్నాడంటే.. అతను సానుకూలంగా మాట్లాడటంలో నేర్పరి అని అర్థం. అందుకే నిత్యం సానుకూలంగా మాట్లాడాలి. అలా మాట్లాడటం తెలియకుంటే అభ్యాసం చేయాలి. మన మాటల్లో వీలైనంత వరకు ప్రతికూల పదాలు రాకుండా చూసుకోవాలి. ఈ చిట్కా చాలా చిన్నదే అయినా అనుసరిస్తే చక్కని ప్రయోజనాలుంటాయి. ఇందుకు అభ్యాసం ప్రధానం. అభ్యాసం చేయకుంటే మాటల్లో సానుకూలతను సాధించడం కష్టం. ఉదాహరణకు ''మీరు ఫలానా వసతులు సమకూర్చకుంటే ఆ పనిని పూర్తి చేయలేను'' అని ప్రతికూల ధోరణిలో చెప్పే బదులు '' ఫలానా వసతులు కల్పిస్తే ఆ పనిని సకాలంలో పూర్తి చేస్తాను'' అని సానుకూలంగా చెబితే మంచి ప్రయోజనం ఉంటుంది. మాట్లాడుతున్న అన్ని మాటలూ ఇదే తరహాలో ఉండేలా చూసుకోవాలి.
నిత్యం సానుకూల అంశాలపైనే దృష్టి సారించాలి. ఎక్కడైనా సరే 99 అంశాలు ప్రతికూలంగా ఉన్నా.. కనీసం ఒక్కటైనా సానుకూలంగా ఉండకపోదు. అందుకే ప్రతి అంశంలోనూ సానుకూలతలపై దృష్టి సారించాలి. ఆ అంశాలను కేంద్రీకృతం చేసుకొని మాట్లాడితే మంచి ఫలితాలుంటాయి. ఈ వైఖరితో ప్రతికూల ప్రభావాలు.. వ్యతిరేక ఫలితాలకు అవకాశం తక్కువగా ఉంటుంది.
''ఎప్పుడూ నా వల్ల కాదు. అది చేయలేం.'' వంటి వ్యతిరేక భావాలతో మాట్లాడొద్దు. ఇలా మాట్లాడటానికి బదులు.. సమస్యను కొంచెం విశ్లేషించి ప్రత్యామ్నాయ పరిష్కారాలు సూచించాలి. ఇలా సూచించడం వల్ల మీరు సమస్య నుంచి తప్పించుకోకుండా పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తారన్న నమ్మకం ఎదుటి వ్యక్తికి కలుగుతుంది. దీంతో మీపై విశ్వాసమూ పెరుగుతుంది. ఎప్పుడూ కఠినంగా మాట్లాడకూడదు. 'తప్పకుండా ఈ పని చేయాల్సిందే'.. 'ఈ పని చేయక తప్పదు' వంటి మాటలకు బదులు మనం తలచుకొంటే ఈ పని తప్పకుండా చేయగలం అని మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తికి ప్రేరణ కలుగుతుంది.
మాటల్లో స్వరం చాలా ముఖ్యం. ఎప్పుడూ ఇది ప్రశాంతంగా సౌమ్యంగా ఉండేలా జాగ్రత్తపడాలి. మనం ఏది మాట్లాడినా.. అవతలి వారికి ఇంపుగా ఉండాలి. కాని ఎబ్బెట్టుగా ఉండకూడదు. ఈ అంశాన్ని నిత్యం మనసులో ఉంచుకోవాలి. ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి ఫోన్ ఇంటర్వ్యూ, బృంద చర్చ, ఇంటర్వ్యూ, శిక్షణ కాలం ఇలా ప్రతి చోటా మాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. కనుక చక్కగా మాట్లాడటాన్ని అలవాటు చేసుకొంటే చివరకు మాటలే కాకుండా వ్యక్తిత్వం కూడా సానుకూలంగా మారుతుంది. ఉద్యోగానికి.. చక్కని జీవితానికి చాలా అవసరమైన సానుకూల దృక్పథమూ అలవడుతుంది.. |