చలో హైదరాబాద్‌

* రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగార్థులు నగరానికి తరలిరాక

* ప్రత్యేక శిక్షణ కేంద్రాలతో అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ కళకళ

* ఐటీ శిక్షణ సంస్థలకు వరంగా 'ఇంజినీరింగ్‌' లోపాలు

* శిక్షణ పొందినా 25 శాతం మందికే ఉద్యోగాలు

* హాస్టల్‌ ఖర్చులతో భారం

ఎంసెట్‌లో ర్యాంకు వచ్చింది...ఆనందం. ఇంజినీరింగ్‌లో సీటొచ్చింది...సంతోషం. బీటెక్‌ పట్టా చేతికి అందింది... పట్టరాని సంతోషం. మరి ఉద్యోగం వచ్చిందా?... సమాధానం లేదు. నెలలు.. ఏళ్లు గడిచినా అవును అన్న సమాధానం రావటంలేదు.. ఆ సమాధానం కోసమే రాష్ట్ర నలుమూలల నుంచి చలో హైదరాబాద్‌ అంటున్నారు విద్యార్థులు.

అందుకు కారణం నాలుగేళ్లు ఇంజినీరింగ్‌ చదివితే వారు నేర్చుకుంటున్నది కేవలం ప్రాథమిక విషయాలే. ఫలితం ఇంటర్వ్యూలో ఫెయిల్‌. ఈ పరిస్థితులే విద్యార్థులను ప్రత్యేక శిక్షణ సంస్థలవైపు దృష్టిపెట్టేలా చూస్తోంది.

రాష్ట్రం నుంచి ఏటా సుమారు 1.25 లక్షల మంది వృత్తివిద్య గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. వారిలో 10 శాతం మంది లోపే ప్రాంగణ నియామకాల్లో ఎంపికవుతున్నారు. మిగతా వారిలో 10-15 శాతం మంది మాత్రమే ఉన్నత చదువులైన ఎంటెక్‌, ఎంబీఏ లేదా అమెరికా లాంటి దేశాల్లో ఎంఎస్‌ చేయడానికి వెళ్తున్నారు. ఇక మిగిలిన 75 శాతం మందిలో కొద్ది మంది మాత్రమే ఇతరత్రా మార్గాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అత్యధికమంది ప్రత్యేక శిక్షణ పొందేందుకు నగరంలోని అమీర్‌పేట రాకుండా తప్పడంలేదు. నగరంలో ఐటీ శిక్షణ సంస్థలు సుమారు 150 వరకు ఉంటాయని అంచనా. ఎక్కువగా అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌, ఆ తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటాయి. కొన్ని సంస్థలకు రెండు చోట్ల బ్రాంచీలున్నాయి. ఎక్కువగా డాట్‌ నెట్‌, జావా నేర్చుకుంటున్నారు. శిక్షణ సంస్థలు కోర్సును బట్టి 5 వేలు- 9 వేలు ఫీజు కింద వసూలు చేస్తున్నాయి.

కళాశాలలు, శిక్షణ సంస్థల మధ్య తేడా ఏమిటి?

ఇంజినీరింగ్‌ నాలుగు సంవత్సరాల్లో ప్రస్తుత మార్కెట్‌కు అవసరమైన అంశాలపై కళాశాలల్లో బోధిస్తున్నా అది అంతగా ఉపయోగపడటం లేదు. అందుకు కారణం అధ్యాపకులు పైపైన చెప్పుకుంటూ పోతారు. సిలబస్‌ పూర్తికావాలి కాబట్టి వారి హడావిడిలో వారు ఉంటారు. ప్రాక్టికల్స్‌ ఉన్నా ఆసక్తి చూపేవారు తక్కువ. చాలా కళాశాలల్లో ప్రయోగశాలలూ అంతంతమా త్రమే. ఉన్నా ఆధునిక పరికరాలు కనిపించవు. వాటి గురించి వివరంగా చెప్పే అధ్యాపకులు, నైపుణ్యమున్న ల్యాబ్‌ సిబ్బంది కూడా ఉండటం లేదు. ఫలితంగా విద్యార్థులు సైతం ప్రాక్టికల్స్‌ను ఆషామాషీగా తీసుకుంటున్నారు. 'కళాశాలల్లో అధ్యాపకులు కేవలం తమకిచ్చిన సిలబస్‌ పూర్తికావాలన్నదే లక్ష్యంతో విద్యాబోధన సాగిస్తున్నారు. కౌన్సెలింగ్‌ ఆలస్యంగా ప్రారంభం అవుతుండటంతో విద్యాసంవత్సరంలో రెండున్నర నెలలు కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాకుండా వారు కేవలం థియరీ మాత్రమే చెబుతారు. శిక్షణ సంస్థల్లో మాత్రం ప్రస్తుతం ఐటీ సంస్థల్లో ఎటువంటి సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తున్నారు, లేటెస్టు వెర్షన్లు ఏమిటో అవి మేం చెబుతున్నాం' అని శిక్షణ సంస్థల్లో పాఠాలు చెబుతున్న బోధకులు పేర్కొంటున్నారు.

శిక్షణ పొందినా 25 శాతం మందికే!

ఇక్కడ ఐటీ శిక్షణ సంస్థల్లో ఫీజులు చెల్లించి శిక్షణ పొందినా వారిలో 25 శాతం మందికే ఉద్యోగాలు వస్తున్నాయి. అదీ కొంత ప్రతిభ ఉండి ఆంగ్లం మాట్లాడటం, అర్థం చేసుకునే సామర్ధ్యం ఉండి ఆసక్తితో ప్రాక్టికల్స్‌ చేసి విషయపరిజ్ఞానం పెంచుకున్న వారికేనని ఓ శిక్షణ సంస్థ ప్రతినిధి చెప్పారు. చాలా మంది కొద్ది రోజులు వచ్చి ల్యాబ్‌కు రాకుండా వెళ్తుంటారని, పట్టుదలతో కృషి చేసేవారే నెగ్గుతారని ఆయన తెలిపారు. మిగతా వాళ్లు ట్రయల్స్‌ వేస్తూనే ఉంటారని, కొందరు మళ్లీ ఎంటెక్‌లో చేరతారని పేర్కొన్నారు. అమీర్‌పేటలో ఓ యువకుడిని కదిలిస్తే నాలుగేళ్ల క్రితం బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తయ్యిందని, ఉద్యోగం రాకపోవడంతో శిక్షణ తీసుకున్న సంస్థలోనే రూ.4 వేల వేతనానికి చేరుతున్నానని చెప్పడం గమనార్హం. కొన్నాళ్ల అనుభవంతో మళ్లీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటానన్నారు. నగరంలో శిక్షణ పొందుతున్న వారిలో ఎక్కువగా 2010, 2011, 2012లో డిగ్రీ పట్టాలందుకున్న వారున్నారు. అధిక శాతం మంది హాస్టల్స్‌లో ఉంటున్నారు.

పొరుగు రాష్ట్రాల వారూ వస్తున్నారు

హైదరాబాద్‌కు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, బీహార్‌ తదితర రాష్ట్రాల విద్యార్థులు కూడా వస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అందుకు కారణం చైన్నె, బెంగళూరు నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ ఫీజులు మూడు నాలుగు రెట్లు తక్కువగా ఉండటమే. ఇక్కడ రూ.5 వేలకు నేర్పే కోర్సును అక్కడ రూ.25 వేలకుపైగానే తీసుకుంటున్నారు.