మౌఖిక పరీక్షకు వెళ్లే ముందు..

ఉద్యోగ వేటలో కీలక దశ ఇంటర్వ్యూ. ఇక్కడ విజయం సాధిస్తే చాలు దాదాపు ఉద్యోగం వచ్చేసినట్టే. మరి ఇంత ముఖ్యమైన ముఖాముఖికి సిద్ధమవడంలో చాలా మంది తెలిసో.. తెలియకో నిర్లక్ష్యం కనబరుస్తుంటారు. మౌఖిక పరీక్ష సందర్భంగా సంస్థ ప్రతినిధులకు అవసరమైన పత్రాలు ఇంటి వద్దే వదలివెళ్లి ఇబ్బంది పడుతుంటారు. మరికొందరైతే ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థ పూర్తి పేరు కూడా చెప్పలేక విఫలమౌతుంటారు. అందుకే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ప్రతిభతో పాటు కాస్త ముందస్తు సన్నద్ధతా ముఖ్యం. మరి ఎలా సిద్ధమవ్వాలి? దీనికి సమాధానమే ఈ కథనం.

ఇంటర్వ్యూకి వెళ్లేందుకు ఒక రోజు ముందు ఉద్యోగార్థి తప్పకుండా కొన్ని అంశాలను ఒకసారి తనిఖీ చేసుకొని మనసులో గుర్తు పెట్టుకోవాలి. వాటిలో ప్రధానమైనవి.. సంస్థ పూర్తి పేరు, సంప్రదించాల్సిన వ్యక్తి స్థాయి, అతని పేరు, దరఖాస్తు చేసిన ఉద్యోగ స్థాయి, ఇంటర్వ్యూ జరిగే విభాగం, ప్రదేశం. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఫైల్లో కనీసం రెండైనా రెజ్యూమె నకళ్లు, రిఫరెన్స్, సిఫార్సు పత్రాలు ఉన్నాయో లేదో తప్పక తనిఖీ చేసుకోవాలి. ఇవే కాకుండా ఇతర అవసరమైన పత్రాలు, ఫొటోలు కూడా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. విద్యార్హత, ఇతర అంశాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలూ తప్పకుండా తీసుకెళ్లాలి. కేవలం వీటి నకళ్లు మాత్రమే తీసుకెళ్తే సరిపోదు. రెజ్యూమెను ఒకసారి తీరిగ్గా పరిశీలించాలి. అందులో పేర్కొన్న అంశాల్లో సంస్థ ప్రతినిధులకు అనుమానం వచ్చే అవకాశం ఉన్న విషయాలను గుర్తించాలి. వాటి గురించి ఇంటర్వ్యూలో అడిగినపుడు సంక్షిప్తంగా వివరించేందుకు ముందే సిద్ధమై ఉండాలి.

ఇంటర్వ్యూలో అడిగే సాధారణ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలన్న అంశంపై అవగాహన పెంచుకోవాలి. ఒకవేళ ఉద్యోగ అనుభవం ఉంటే గతంలో సాధించిన విజయాల తాలూకు పత్రాలను తప్పకుండా తీసుకెళ్లాలి. సంస్థ ప్రతినిధులను అడగదలుచుకున్న ప్రశ్నల జాబితాను సిద్ధం చేసుకోవాలి. ఇంటర్వ్యూలో సాధారణంగా అడిగే ప్రశ్నలను గుర్తించి వాటి ఆధారంగా కుటుంబికులు లేకుంటే స్నేహితులతో ముఖాముఖి సాధన చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు సమాధానం చెప్పే తీరు, ముఖంలో హావభావాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. పొరపాట్లు ఉంటే స్నేహితుల సూచనలతో సరి చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆరోగ్య జాగ్రత్తలూ పాటించడం ముఖ్యం. కొందరు ఏమీ తినకుండా ముఖాముఖికి వెళ్తుంటారు. ఇది సరికాదు. అలాగే ఇంటర్వ్యూ ముందు రోజు కంటి నిండా నిద్ర చాలా ముఖ్యం. మౌఖిక పరీక్షలో హుందాగా కనిపించేలా ముందు రోజు ధరించాల్సిన దుస్తులు, పాదరక్షలు, ఇతరత్రా వస్తువులు కూడా ఎంపిక చేసుకొంటే ఆఖరి క్షణంలో గందరగోళం తప్పుతుంది. ఇంటర్వ్యూకి వెళ్లే రోజు సుగంధ ద్రవ్యం వాడితే గాఢత ఎక్కువ లేకుండా చూసుకోవాలి.

ఇంటర్వ్యూకి ఏమాత్రం ఆలస్యంగా కాకుండా సకాలంలో వెళ్లేందుకు జాగ్రత్తపడాలి. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమయానికి ఆ సంస్థ వద్దకు చేరుకొనేలా ప్రణాళిక చేసుకోవాలి. సంస్థకు చేరుకొన్న వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత సిబ్బందికి తెలియజేయాలి. ఆయన్ను కలవాలి. ముఖాముఖి పరీక్షకు వెళ్లే ముందు మొబైల్ ఫోన్‌ను తప్పకుండా స్విచాఫ్ చేయాలి. కనీసం వైబ్రేషన్, సైలెంట్ మోడ్‌లో కూడా పెట్టుకోకూడదు. మీ టై, టక్, తలకట్టు తీరు సరిగ్గా ఉన్నాయో లేదో ముఖాముఖికి వెళ్లే కొన్ని నిముషాల ముందు ఒకసారి పరిశీలించుకుని సరి చేసుకోవాలి. ఇంటర్వ్యూకు తీసుకెళ్లే ఫైల్లో అవసరమైన పత్రాలు తప్ప చిత్తుకాగితాలు, ఇతరత్రా పత్రాలు లేకుండా జాగ్రత్తపడాలి. ఆఖరి క్షణంలో ఎలాంటి ఒత్తిడి, ఉద్వేగాలు దరి చేరనీయకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మౌఖిక పరీక్షలో విజయం సొంతమవుతుంది.