గడువు తప్పొద్దు

ఎంత ప్రతిభ ఉన్నా.. ఎంత బాగా పని చేసినా.. గడువులోపు పనిని పూర్తిచేయకుంటే అన్నీ వృథా అవుతాయి. కనుక వృత్తిలో సకాలంలో పని పూర్తి చేయడం కీలకం. ఇందులో ఏమాత్రం అజాగ్రత్త వహించినా గడువు తప్పే ప్రమాదం ఉంటుంది. తరచూ ఇలా చేస్తే.. మీపై సంస్థకు విశ్వాసం సన్నగిల్లుతుంది. గొప్ప అవకాశాలూ తగ్గిపోతాయి. అందువల్ల ఆలస్యం కాకుండా పని పూర్తి చేయడం ముఖ్యం. అందుకు మొదటి నుంచీ పక్కా ప్రణాళికతో వ్యవహరించాలి.

సకాలంలో పని పూర్తి చేయడం ఒక కళ. ఇచ్చిన పనిని సమర్థంగా పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుంది. ఆ సమయంలోపు పనిని పూర్తి చేయాలంటే ఏ మేరకు పని చేయాలో ఉద్యోగులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే వృత్తిలో బాగా రాణిస్తారు. సాధారణంగా బాస్‌ ఉద్యోగిలో ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా ఇచ్చిన పనికి తగిన గడువు ఇస్తారు. తీరా ఉద్యోగి వద్దకు వచ్చేసరికి సకాలంలో ఆ పనిని పూర్తి చేయడం అతనికి పెద్ద భారం కావొచ్చు. లేకుంటే గడువుకన్నా ముందే పని పూర్తి చేసే వీలూ ఉండొచ్చు. అందువల్ల బాస్‌ పని అప్పజెప్పినపుడు దానికి ఎంత సమయం పడుతుందో ఉద్యోగి ఒక అంచనాకు రావాలి. అప్పుడే గడువు పెంచమనో తగ్గించమనో కోరవచ్చు.

బాస్‌ ఇచ్చిన గడువును వెంటనే అంగీకరించవద్దు. ఆ పని ఇచ్చిన సమయంలోపు ఏమేరకు పూర్తవుతుందో సాధ్యాసాధ్యాలపై ఆలోచించాలి. ఒకవేళ అదనపు సమయం కావాలంటే ముందే కోరాలి. గడువు తప్పి ఇబ్బందులు పడేందుకన్నా ముందే తగిన సమయం కోరడం మేలు. ఒకవేళ పని/ప్రాజెక్ట్‌ ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత మరింత సమయం అవసరమనిపిస్తే ఆ విషయాన్ని బాస్‌కు వెంటనే తెలియజేయాలి. ఇప్పటి వరకు మీరు ఏం చేశారో స్పష్టంగా వివరించాలి. దీంతో మీరు పనిని పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం అవసరమో బాస్‌కు తెలుస్తుంది.

కొన్నిసార్లు పని త్వరగా పూర్తి అయిపోయి.. గడువు చాలా మిగిలి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కొందరు చివరి నిముషం వరకూ ఆ సంగతిని బాస్‌కు చెప్పరు. ఇది సరికాదు. త్వరగా పని పూర్తయితే.. ఆ సంగతిని బాస్‌కు చెప్పి మరో పనిని అప్పగించమని కోరాలి. దీని వల్ల ఉన్నతాధికారులకు మీపై విశ్వాసం పెరుగుతుంది. గడువు పెంచమన్నపుడు వారు మీపై ఏమాత్రం సందేహించకుండా కోరింత సమయం ఇచ్చే వీలుంటుంది.

ఒకవేళ మీకు ఇచ్చిన పని సకాలంలో పూర్తి చేయలేకుంటే.. ఆ విషయం బాస్‌కి చెప్పి.. గడువులోపు పని పూర్తి కావాలంటే ఇతర ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో వివరించాలి. అవకాశం ఉంటే మీరు సూచించిన ప్రత్యామ్నాయాలను అమలు చేస్తారు. దీంతో సకాలంలో ఆ పని పూర్తయిపోతుంది. ఇతర మార్గాలను సూచించకుండా, సకాలంలో పని పూర్తి చేయకుంటే మీ వల్ల సంస్థకు చాలా నష్టం వాటిల్లవచ్చు.

ఎప్పుడైనా సరే ఒకటి రెండు సార్లు మాత్రమే అదనపు సమయం కోరాలి.అంతకు మించితే పదేపదే అదనపు సమయం కోరుతున్నారని, గడువులోపు పనిని పూర్తి చేయడం మీ వల్లకాదని బాస్‌కి ప్రతికూల అభిప్రాయం కలగవచ్చు. ఒక్కోసారి కొంచెం కష్టపడితే.. గడువులోపు పనిని పూర్తి చేసే వీలుంటుంది. అలాంటి సమయంలో కష్టపడాలి కాని మరింత సమయం కోరవద్దు.

ఒకవేళ గడువు తప్పితే దానికి సహేతుకమైన కారణాలను చెప్పాల్సి ఉంటుంది. నిజాయితీగా మీరు పని చేసి ఆలస్యం అయి ఉంటే బాస్‌ తప్పక ఆమోదిస్తారు. ఎందుకంటే అలాంటి సమయంలోనే మీరు ఆలస్యానికి సహేతుకమైన కారణాలను వెల్లడించగలరు. నిజాయతీగా పని చేయకుండా ఆలస్యం చేస్తే దొరికిపోతారు. ఎప్పుడూ అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. పైగా అదనపు సమయం కోరడం, గడువులోపు పనిని పూర్తి చేయడం వల్ల ఒత్తిడి ఉండదు. చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా సరిచేసుకొనే వీలుంటుంది.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017