ఇకనైనా ప్రేమించడం మొదలుపెట్టండి

మీకు ఉద్యోగం రోజూ బోర్‌ కొడుతోందా..! అయితే ఒకసారి సానుకూలంగా ఆలోచించండి. పనిని ప్రేమించడానికి ప్రయత్నించండి. కొంచెం కష్టమే. అయినా సరే ఒక్కసారి మీరు పనిని ప్రేమించడం మొదలుపెడితే ఇక జీవితంలో మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పనిని ప్రేమించాక అసలు మీకది ఉద్యోగంలాగానే అనిపించదు. మీరు ఆ ఉద్యోగాన్ని బాగా ఆస్వాదిస్తారు. దీంతో మీ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా పదోన్నతులు.. ఇతర ప్రయోజనాలు వరుస కడతాయి. పనిపై ఉన్న వ్యతిరేక భావన పోతుంది. పనిని ప్రేమించడం అన్నది ఒక కళ. ఇది కొందరికి స్వతస్సిద్ధంగా ఉంటుంది. మరికొందరు అందిపుచ్చుకొంటారు. మీరూ పనిని ఆస్వాదించాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందే.

అయిదారేళ్ల చిన్నారిని పెద్దయ్యాక నువ్వు ఏం అవుతావంటే గొప్ప గొప్ప పదవులను చెబుతారు. అయితే చిన్నపుడు కలలు కన్న ఉద్యోగమో స్థానమో సాధించేది మాత్రం అతి కొద్ది మందే. కారణం పెద్దయ్యే కొద్దీ వారు ఆ కల నుంచి దూరమవుతూ ఉంటారు. చిన్నప్పటి కలను సాధించడం చాలా కష్టమని భావించి.. లక్ష్యాన్ని మార్చుకుంటారు. చిన్ననాడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఉన్న మార్గాలేంటో అన్వేషించి.. సాధన దిశగా కసరత్తు చేయాలి. అప్పుడే కలల కొలువు సాధ్యమవుతుంది. ఇష్టమైన ఉద్యోగాన్ని సాధిస్తే.. ఇక జీవితంలో అంతా హాయిగా గడిచిపోయే అవకాశాలు ఎక్కువ. ఇష్టం ఉన్నపుడు ఎంత కష్టపడినా అసలు అది కష్టంగా అనిపించదు. ఇలా కష్టపడి పని చేయడం అలవాటయితే తప్పకుండా రాణిస్తారు. దీనికంతటికీ కారణం పనిపై మీకు ఉన్న ప్రేమ. ఇలాంటి ఉద్యోగాన్ని సాధించాలంటే విద్యార్థులకు, కొత్తగా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి ఎక్కువ అవకాశాలుంటాయి.
ఎక్కువ మంది తమ కలల కొలువు కాకుండా అప్పటి పరిస్థితులను బట్టి ఏదో ఒక ఉద్యోగంలో చేరి అతి కష్టంపై నెగ్గుకొస్తుంటారు. తర్వాత ఫలానా ఉద్యోగం రాలేదే.. అని బాధపడుతూ ఉంటారు. ఇది సరికాదు. ఒకవేళ నచ్చని ఉద్యోగంలో చేరినా.. అందులోనూ సానుకూల అంశాలను వెదికి వాటిని అందిపుచ్చుకోవాలి. ఈ ఉద్యోగం చేయక తప్పదు కనుక ఇక్కడ రాణించాలంటే ఆసక్తి, ఇష్టం పెంచుకోవాలి. అందుకు తగినట్లు కార్యాలయంలో మంచి వాతావరణం కల్పించుకోవాలి. ప్రతికూల భావాలు కలిగిన ఉద్యోగులకు కాస్త దూరంగా ఉండాలి. మీలాగే తొలుత ఆసక్తి లేకున్నా ఉద్యోగంలో చేరి ఇప్పుడు రాణిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారిని అనుసరించాలి. వీలైతే వారితో సన్నిహితంగా మెలుగుతూ వారు ఎలా సానుకూలంగా ముందుకెళ్తున్నారో తెలుసుకోవాలి.
పనిపై ప్రేమ పెరగాలంటే..!:
* వృత్తికి సంబంధించిన కొత్త నైపుణ్యాలు సాధించాలి. కొత్త అంశాలు నేర్చుకోవాలి
* మీ వృత్తికి సంబంధించిన పుస్తకాలను చదవాలి. తాజాగా వచ్చిన పుస్తకాలైతే మంచిది. కొత్త పోకడలు తెలుస్తాయి.
* మీకు, మీ వృత్తికి సంబంధించిన సదస్సులు, శిక్షణ తరగతులు జరిగితే తప్పకుండా హాజరుకావాలి
* పనిని ఎప్పడూ కొత్తగానే ప్రారంభించాలి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా గడచిన అనుభవంతో కొన్ని ప్రయోగాలూ చేస్తుండాలి.
* ఒక్కోసారి మీరు ఎంచుకున్న లక్ష్యాలు సరైనవా సమీక్షించుకోవాలి. వాటిని సాధించలేకుంటే ప్రతికూల భావాలు నెలకొంటాయి. ఎంత ప్రయత్నించినా ఉద్యోగంపై ఏకాగ్రత.. ఇష్టం లేకుంటే ఆసక్తి ఉన్న రంగంవైపు అడుగులేయండి. ఇలాంటి నిర్ణయం తీసుకొనేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉన్న అవకాశాలు, అనుభవం, చదువు, భవిష్యత్తులో జరగనున్న పరిణామాలపై అవగాహన పెంచుకొని.. తర్వాతే ఇష్టమున్న కొలువు వైపు దృష్టిం సారించాలి. లేకుంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంటుంది.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017