ఈ ప్రత్యేకతలున్నాయా?

గెలుపు అందని ద్రాక్ష కాదు. అందుకోవాలంటే కాస్త కష్టపడాలంతే. ఈ కష్టానికి తోడు మరికొన్ని మంచి లక్షణాలు తోడైతే విజయాన్ని సాధించడం మరింత సులభమవుతుంది. ఈ లక్షణాల్లో కొన్ని స్వభావ రీత్యా వస్తే.. మరికొన్ని అలవరచుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ, నైపుణ్యాలు, కష్టపడేతత్వం అన్నీ ప్రస్తుతం అందరిలోనూ ఉంటున్నాయి. దీంతో గెలవాలంటే మరిన్ని అదనపు లక్షణాలను వంట బట్టించుకోవాలి. ఆ లక్షణాలేంటో చూడండి మరి..!
ఆత్మవిశ్వాసం:
ఇది చాలా కీలకం. లేకుంటే జీవితంలో ఎక్కడా ఏమీ చేయలేం. రోజు రోజుకూ పతనం తప్ప అభివృద్ధి ఉండదు. ఆత్మవిశ్వాసం లేకుంటే విజయం వరించదు. వాస్తవిక దృక్పథం, పరిస్థితుల ప్రభావం, నిజాయితీ, కష్టపడేతత్వం, సానుకూలంగా ఆలోచించడం.. వంటివన్నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ విషయాల్లో రాజీపడకుండా వ్యవహరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కుతూహలం:
కొత్త విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న కుతూహలం ఎప్పుడూ ఉండాలి. ప్రతి అంశంపైనా ప్రత్యేక ఆసక్తి చూపించాలి. దీని వల్ల ఇతరులకు తెలియని కొత్త విషయాల మీకు తెలుస్తాయి. ఫలితంగా ప్రతి చోటా మీ ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది.
నిర్ణయాత్మక శక్తి:
అందరూ నిర్ణయాలు తీసుకొంటారు. కానీ వాటిని పక్కాగా అమలు చేసేది కొందరే. అందువల్ల నిర్ణయం తీసుకొనే ముందే దాని తీవ్రత.. పర్యవసానాలను పసిగట్టగలగాలి. ఇందుకోసం అనుభవం అవసరమే. అయితే అనుభవం ఉన్నా అందరూ సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుభవానికి తోడు కసరత్తు, సమస్య లేదా పనిపై పూర్తి పట్టు అవసరం. ముందుగా దాన్ని సాధించాలి.
మీ గురించి తెలుసా?:
మీరు వృత్తిలో విజయం సాధించాలంటే ముందు మీ గురించి మీకు తెలియాలి. మీ బలాలు, బలహీనతలపై స్పష్టత ఉండాలి. మీకు విజయాలు తెచ్చి పెట్టే అంశాలు ఏవో ముందుగా గుర్తించి ఆ దిశగా కసరత్తు చేయాలి. సాధారణంగా అందరికీ బలహీనతలు ఉంటాయి. అయితే కొంచెం కష్టపడితే వాటిని తప్పకుండా అధిగమించవచ్చు. అందువల్ల ముందుగా మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకొని ఉండటం ముఖ్యం. వృత్తిలో ఎప్పుడూ రాజీధోరణి వద్దు. అత్యుత్తమ ఫలితాలు సాధించే వరకు కృషి చేస్తూనే ఉండాలి.
ప్రత్యేకత ఉందా..:
ఒక సంస్థలో చాలా మంది ఉద్యోగులు ఉంటారు. వారిలో కొంతమందికే పదోన్నతులు వస్తుంటాయి. ఆ కొంత మందిలో మీరు తప్పక ఉండాలంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచీ మీ ప్రత్యేకత చూపాలి. పనిలో.. బాధ్యతల్లో చొరవ ఉండాలి. చాలా మంది ఇక్కడే వెనుకబడుతూ ఉంటారు. రోజూ కార్యాలయానికి వెళ్లామా.. ఏదో ఒక విధంగా ఇచ్చిన పనిని పూర్తి చేశామా.. అన్న ధోరణిలో ఉంటూ విలువైన అవకాశాలను కోల్పోతూ ఉంటారు. ఈ విధానం సరికాదు. సంస్థల్లో తప్పకుండా మీకంటూ ఒక ప్రత్యేకత, ముద్ర ఉండాలి.
సమయం కాదు.. సాధన కావాలి:
కార్యాలయంలో ఎంత సేపు పని చేశామన్నది ముఖ్యం కాదు. మనం చేసిన పని వల్ల ఏ మేరకు ఫలితాలువచ్చాయన్నదే ప్రధానం. సంస్థకు.. మీకు కావాల్సిందీ అదే. కాని కొందరు ఎక్కువ సమయం పని చేయడం వల్ల గుర్తింపు, మంచి ఫలితాలు వస్తాయనుకొంటూ ఉంటారు. ఆ విధానం సరికాదు. కొత్తగా, ఇతరులకు భిన్నంగా ప్రయత్నించినపుడు గొప్ప ఫలితాలు సాధ్యమవుతాయి. అందుకోసం ప్రయత్నించాలి.
అవకాశం వచ్చిందా..:
ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నవారు లేదా ఉద్యోగం చేస్తున్నవారు ఎవరైనా సరే.. జీవితంలో అభివృద్ధి చెందేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదు. మొదట దాన్ని అందిపుచ్చుకోవాలి. తర్వాతే దాన్ని ఎలా సానుకూలంగా మలచుకోవచ్చో ఆలోచించవచ్చు. కొన్ని అపోహలు, అవగాహన లేమి, అనవసర భయాలతో అవకాశాలను ఎప్పుడూ చేజార్చుకోవద్దు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017