అందిపుచ్చుకోండి

ప్రారంభస్థాయి ఉద్యోగాలకు దేశంలో డిమాండు పెరిగిందని ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. అయినప్పటికీ ఉద్యోగాల కల్పనలో మాత్రం ఏటేటా ఆ సంఖ్య తగ్గుతోంది. 2012లో 5.52లక్షల ప్రారంభ స్థాయి ఉద్యోగాల కల్పన జరిగితే 2013లో ఆ సంఖ్య 5.5 లక్షలకు తగ్గింది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ, కోల్‌కతా, బెంగళూరుల్లో ఉద్యోగాల కల్పన పెరగ్గా చెన్నై, ముంబయిలతోపాటు సూరత్‌, మైసూర్‌ తదితర ప్రాంతాల్లో మాత్రం తగ్గింది. అభ్యర్థుల్లో అర్హత, నైపుణ్యాల కొరత కారణంగానే సంఖ్య తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. సంస్థలు కోరుకున్న నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా వీటికి ఎంపిక కావచ్చు. భావవ్యక్తీకరణ, చొరవ, ఆత్మవిశ్వాసం, ఒత్తిడికి లోనుకాకపోవడం వంటి విషయాల్లో అభ్యర్థులను పరిశీలిస్తారు.
తాజా గ్రాడ్యుయేట్లు వృత్తి జీవితంలో అడుగుపెట్టడానికి ప్రారంభ స్థాయి ఉద్యోగాలు ఎంతో ఉపకరిస్తాయి. ఆయా రంగంలో ఎలాంటి అనుభవం లేకున్నా సంస్థలు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. ఇంటర్‌, పదోతరగతి అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే. తాత్కాలిక ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉంటాయి. అభ్యర్థికి అనుభవం అవసరం లేకున్నా... ప్రవర్తన, అంకితభావం వంటివి తెలుసుకోవడానికి మౌఖిక పరీక్షలో మాత్రం పలు అంశాలపై పరీక్షిస్తారు.
ముఖ్యమైన పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతారు?. విద్యార్థిగా మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్‌ ఏంటి?. ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిద్దామనుకుంటున్నారా?. లక్ష్యాలు ఏంటి? వంటి ప్రశ్నలు అభ్యర్థులను అడిగే అవకాశముంది. కళాశాల / పాఠశాల స్థాయి నుంచే అభ్యర్థిలో క్రమశిక్షణ, సాధించాలన్న తపన ఉన్నాయా లేవా అనేది రిక్రూటర్లు పరిశీలిస్తారు. అంతేకాదు.. ఈ ఉద్యోగంపైనే ఎందుకు ఆసక్తి చూపుతున్నారు.. మిమ్మల్నే ఎందుకు ఎంపిక చేసుకోవాలని కూడా రిక్రూటర్లు అడగొచ్చు.

ప్రారంభస్థాయి ఉద్యోగాలకు 2012తో పోలిస్తే 2013లో 6.7 శాతం డిమాండు పెరిగిందని అసోచాం సర్వే పేర్కొంది. మధ్య, సీనియర్‌స్థాయి ఉద్యోగాలకు 5.1శాతం డిమాండు తగ్గిందని తెలిపింది. జాబ్‌పోర్టళ్లు, 56 పట్టణాల్లోని జాతీయ, ప్రాంతీయ పత్రికల్లో వచ్చిన 4500 సంస్థల ఉద్యోగ ప్రకటనల సమాచారాన్ని పరిశీలించామని అసోచాం సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ తెలిపారు.
ప్రారంభస్థాయి ఉద్యోగాలకు సంబంధించి 2012లో దేశ వ్యాప్తంగా 5.52లక్షల ఉద్యోగాల కల్పన జరగ్గా 2013లో ఆ సంఖ్య 5.50లక్షలకు తగ్గింది. అయినప్పటికీ టైర్‌-1 నగరాలైన ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతాల్లో 2012 కన్నా 2013లో ఏకంగా 26.8 శాతం వృద్ధి కనిపించింది. హైదరాబాద్‌, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాల్లో కూడా 15.2, 12.7, 6.6, 0.5 శాతం వృద్ధి కనిపించింది. ముంబయి, చెన్నై నగరాల్లో మాత్రం ప్రారంభస్థాయి ఉద్యోగాల్లో ప్రవేశాలు తక్కువగానే ఉన్నాయి. టైర్‌ 2 పట్టణాలైన నాగ్‌పూర్‌ (64.7 శాతం), లక్నో (39.1 శాతం), కొచ్చిన్‌ (35.3 శాతం), విశాఖపట్టణం (22.7 శాతం), విజయవాడ (15.9 శాతం) , జైపూర్‌ (9.5 శాతం), మీరట్‌ (6.9 శాతం), చండీగఢ్‌ (33.9 శాతం)ల్లో ప్రారంభస్థాయి ఉద్యోగ ప్రవేశాలు అశాజనకంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే టైర్‌-2 పట్టణాలైన భోపాల్‌ (2.2 శాతం), సూరత్‌ (5.3 శాతం), పాట్నా (9.7 శాతం), ఇండోర్‌ (13 శాతం), గౌహతి( 13.2 శాతం), మైసూర్‌ (16.7 శాతం), వదోదర (18.4 శాతం), కోయంబత్తూరు (33.9 శాతం)ల్లో మాత్రం 2012 కన్నా 2013లో ప్రారంభస్థాయి ఉద్యోగ కల్పన తక్కువగానే ఉంది.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017