వివరంగా తెలుసుకోండి

ద్యోగ ప్రకటనల్లో ఉద్యోగ వివరణ లేకున్నా.. సరిగ్గా అర్థం కాకున్నా సదరు ప్రకటన విడుదల చేసిన సంస్థకు ఫోన్‌ చేసో లేదా మెయిల్‌ ద్వారానో ఉద్యోగ వివరణను తెలుసుకోవడం అవసరం. లేదంటే మీ ప్రయత్నాలు వృథా ప్రయాస అవుతాయి.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నారా..! అయితే కొంచెం ఆగండి. ముందుగా 'ఉద్యోగ వివరణ' (జాబ్‌ డిస్క్రిప్షన్‌) తెలుసుకోండి. వివరణ చదవకనే దరఖాస్తు చేస్తామా అనుకోవద్దు. ఎందుకంటే చాలా మంది దాన్ని సరిగా అవగాహన చేసుకోకుండానే దరఖాస్తులు పంపేస్తుంటారు. దీని వల్ల తగిన ఉద్యోగం రాకపోగా నిరుత్సాహం పెరుగుతుంది. అందువల్ల ఒక్కసారి ఉద్యోగ వివరణ ఒకటికి రెండు సార్లు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి. తర్వాతే దరఖాస్తు చేయాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగం లభించే అవకాశాలు రెట్టింపు అవుతాయి. అదెలాగంటే..!
ఒక సంస్థ లేదా కొలువుకు ఎలాంటి అభ్యర్థి అవసరమో ఆ సంస్థ ప్రకటనలో వివరాలను ముఖ్యంగా ఉద్యోగ వివరణను చదివితే తెలిసిపోతుంది. అయితే ఈ వివరణలో పేర్కొన్న అంశాలను అందరూ సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. సంస్థ ఒక ఉద్యోగం కోసం ప్రకటన ఇస్తే అభ్యర్థులు మరో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తూ ఉంటారు. ప్రకటనలో పేర్కొన్న అర్హతలకు విరుద్ధంగా రెజ్యూమెను నింపుతారు. ఇక ప్రతిభ, నైపుణ్యాలు కూడా అంతే సరిగా అర్థం చేసుకోకుండా దరఖాస్తు పంపేస్తుంటారు. రిక్రూటర్లు ఇలాంటి వాటిని పక్కన పెట్టేస్తారు. అభ్యర్థి మాత్రం తనకు ఫలానా చోట ఉద్యోగం రాలేదనుకొంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఈ విధానం తప్పు. అసలు ఒక అభ్యర్థికి ఉద్యోగం రావాలంటే.. ఉద్యోగ ప్రకటనను అది పత్రికలో కానీ.. ఆన్‌లైన్‌లో కానీ.. సంస్థ వెబ్‌సైట్లో కానీ.. ఇతర మార్గాల్లో కానీ ఎక్కడైనా చూసినా.. అందులో ఉన్న వివరణను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. ఇలా చేస్తే అప్పటికే సగం ఉద్యోగం వచ్చేసినట్లు. ఈ వివరణను అర్థం చేసుకోగలిగనపుడే ఆ సంస్థకు కావాల్సిన అర్హతలు, నైపుణ్యాలను, ప్రతిభను సమర్థవంతంగా వెల్లడించగలుగుతాం. సంస్థ అవసరాలకు తగినట్లు అభ్యర్థి సిద్ధం కావచ్చు.
వివరణ వల్ల ప్రయోజనాలు: ఉద్యోగ వివరణను పూర్తిగా చదవడం వల్ల ఆ ఉద్యోగంలో రోజువారీ చేయాల్సిన పనులేమిటి? నిర్వర్తించాల్సిన విధులేమిటి అన్నదానిపై అవగాహన వస్తుంది. బలాలు బలహీనతలపై ఒక అంచనాకు రావొచ్చు. ప్రకటనలో పేర్కొన్న కొన్ని అర్హతలు, నైపుణ్యాలు లేకుంటే వాటిని సాధించేందుకు కృషి చేయొచ్చు. ఒక ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకొని ఒక డిగ్రీలో చేరితే.. అది పూర్తయ్యేలోపు ఆ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు, అర్హతలు మారిపోవచ్చు. అందువల్ల ఉద్యోగ ప్రకటనల్లో వివరాలను తెలుసుకొంటూ ఉంటే ప్రస్తుతం ఆ రంగంలో చోటు చేసుకొంటున్న మార్పులు, ఉద్యోగుల ఎంపికలో సంస్థలు అనుసరిస్తున్న విధానాలు తదితరాలు తెలుసుకొని వాటికి తగినట్లు తమనుతాము మలచుకోవచ్చు.
రెజ్యూమె రూపొందించే ముందు: ముందుగా సిద్ధం చేసిన రెజ్యూమెను పంపడం సరికాదు. ఒక ఉద్యోగ ప్రటకన వచ్చాక.. ఆ ప్రకటనకు, ప్రకటనలో వివరణకు తగినట్లు రెజ్యూమెను సిద్ధం చేసుకోవాలి. ప్రకటనలో పేర్కొన్న వివరాలు, అవసరాలు, అర్హత ఆధారగా రెజ్యూమెను తీర్చిదిద్దాలి. ఇలా రూపొందించిన రెజ్యూమెను మాత్రమే పంపాలి. ఒక్కో ప్రకటన ఒక్కోలా ఉంటుంది కాబట్టి.. ఆయా ప్రకటనలకు తగినట్లు రెజ్యూమెలను సిద్ధం చేసుకోవడం ఉత్తమం.
ప్రకటనలో ఇవన్నీ తెలుసుకోవాల్సిందే
* ఉద్యోగం పేరు, పని చేయాల్సిన స్థలం
* ఈ ఉద్యోగంలో చేరాక అప్పగించే బాధ్యతలు
* చేయాల్సిన విధులు వాటి ప్రాధాన్యం
* కొలువుకు అవసరమయ్యే అర్హతలు
* అభ్యర్థుల్లో ఉండాల్సిన ప్రతిభ, నైపుణ్యాలు
* శారీరక దృఢత్వం, మానసికస్థితికి సంబంధించిన అంశాలు
* కార్యాలయంలో పని తీరు, వాతావరణం
* పని చేయాల్సిన ప్రాంతాలు
* ఈ ఉద్యోగంతో కలిగే ఇతర ప్రయోజనాలు


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017