సమష్టితత్వంతోనే గెలుపు

''కలిసికట్టుగా రావడం ప్రారంభానికి చిహ్నం.. కలిసి ఉండడం అభివృద్ధికి చిహ్నం.. కలిసి పని చేయడం విజయానికి చిహ్నం''
- 19వ శతాబ్దపు అమెరికా పారిశ్రామికవేత్త హెన్రీఫోర్డ్‌

మీరు ఓ ప్రాజెక్టులో బృంద సభ్యుడు. అన్ని బాధ్యతలు ప్రాజెక్టు మేనేజరు చూసుకుంటారు.. మనకు అప్పగించిన పని చేసుకుంటే చాలు అనుకోవడం పొరపాటు. కార్యాలయంలో బృంద నాయకుడు ఎంత కీలకమో.. సభ్యులు కూడా అంతే కీలకం. సమాచారాన్ని పంచుకోవడం, కొత్త కొత్త ఆలోచనలు చేయడం, బాధ్యతలు స్వీకరించడం సభ్యుడు చేస్తుండాలి. అప్పుడే ఆ బృందం సకాలంలో లక్ష్యాలు చేరుకోగలుతుంది. అంతేకాదు సభ్యులకు వ్యక్తిగతంగానూ ప్రశంసలు లభిస్తాయి. నలుగురు మెచ్చుకొనే బృంద సభ్యుడు కావాలంటే మరికొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలంటున్నారు నిపుణులు.
* బృందంలో మీకు అప్పగించిన పని చేసుకోవడమే కాదు... నలుగురితోనూ కలిసిపోవాలి. బాధ్యతలు పంచుకోవాలి. సహచరులకు సహాయపడుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. అన్ని అంశాలను ఒకే కోణంలో చూడకుండా బయట నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. మీ పాత్రకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు మారుతుండాలి.
* కలిసి పని చేయడమనేది విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. సవాళ్లకు భయపడకండి. బృందంగాఎదుర్కొంటే సులభంగా పరిష్కరించొచ్చు. మిగిలిన సభ్యులతో విబేధాలు లేకుండా సమన్వయం చేసుకుంటే సానుకూల ఫలితాలు అవే వస్తాయి.
* ఎప్పటి పని అప్పుడే పూర్తి చేస్తుండాలి. అది కూడా నూరు శాతం అంకితభావంతో చేయాలి. గడువు చాలా కాలం ఉందిగా అని సగం సగం పని చేస్తే లక్ష్యాలు చేరుకోలేరు.
* బృందంలో సమర్థుడు అనిపించుకోవాలి అంటే అర్హతలు, నైపుణ్యాలు ఉంటే చాలదు.. వాటిని పూర్తిగా వినియోగించాలి. పని నుంచి తప్పించుకోవడం మీరెంత నిపుణులైనా విజయవంతమైన బృంద సభ్యుడు అనిపించుకోలేరు.
* క్రమశిక్షణతో ఉండాలి. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఎవరిపైనా నిందలు కూడదు. నోరు జారడం, వాగ్వాదాలతో నష్టమే ఎక్కువ.
* ప్రాజెక్టు సమాచారాన్ని ఎప్పటికప్పుడు సహచరులతో పంచుకోవాలి. తెలిసిన విషయాన్ని పంచుకుంటే వారి నుంచి కూడా సహకారం లభిస్తుంది. భావ వ్యక్తీకరణలో ఎలాంటి లోపాలు ఉండకూడదు. ఎలాంటి అరమరికలు లేని చర్చ త్వరగా పరిష్కారాలు చూపిస్తుంది. ఇతరులను మీరు నమ్మినపుడే వారూ మిమ్మల్ని నమ్ముతారని గుర్తెరగండి.
* కార్యాలయంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. సభ్యుల మధ్య ఇలాంటి వాతావరణం ఉంటే పనులు సకాలంలో పూర్తవుతాయి. లక్ష్యం దిశగానే మీ పనితీరు ఉండాలి. ఈ విషయంలో సందేహాలకు తావుండకూడదు.
* ఒక్కోసారి బృందంలో ఒడిదుడుకులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఒత్తిడికి గురవకుండా దాని నుంచి బయటపడేది ఎలా అని యోచించగలగాలి. భిన్న కోణాల్లో ఆలోచిస్తూ అభిప్రాయాలను సూటిగా సహచరులకు చెప్పాలి. వాళ్లు చెప్పే సూచనలూ విని అందరూ కలిసి తగిన పరిష్కారం కనుగొనాలి. ఇతరుల తప్పులు గుర్తిస్తే వెంటనే వారికి చెప్పండి.. కానీ ఆరోపణలు చేయకండి. వీలైనంతగా సూచనలు చేయాలి తప్ప తప్పులు ఎత్తి చూపడం తగదు.
* కలిసి పని చేసే సామర్థ్యమే బృంద పనితీరుకు గీటురాయి. అంతర్గత రాజకీయాలకు స్వస్తి చెప్పి సభ్యులందరూ ఒకరిపట్ల మరొకరు గౌరవభావాలతో మెలగడం కీలకం. ఇతరులను ప్రోత్సహించడం, వారి సామర్థ్యాన్ని గుర్తించి అభినందించడం చేస్తుండాలి. ఇతరుల బలహీనతల గురించి హుందాగా వారికి తెలియపరచాలి. అప్పుడే విజయవంతమైన బృంద సభ్యుడు కాగలరు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017