ఇంటర్వ్యూ అయ్యాక..!

ద్యోగ సాధనలో కీలక దశ ఇంటర్వ్యూ. ఈ దశకు చేరుకోవడం ఎంత కష్టమో.. దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా అంతే కష్టం. ముఖాముఖి పరీక్షలో విజయం సాధించినా తర్వాత కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది. వీటిని సజావుగా పూర్తి చేస్తే మీరు ఆశించిన కొలువు సాకారమవుతుంది. ఆ అంశాలేమిటో తెలుసుకొందాం.

ఇంటర్వ్యూ పూర్తయింది. రిక్రూటర్లు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు. అంతా సానుకూలంగా జరిగింది. ఆ దశలో ఎక్కువ మంది ఇక ఉద్యోగం ఖాయమని రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి చేరుకుని అంతటితో సరిపెట్టేస్తారు. ఈ విధానం సరికాదు. ఎందుకంటే ఇంటర్వ్యూను విజయవంతంగా ముగించినంత మాత్రాన ఉద్యోగం తప్పక వస్తుందని ఆశించలేం. ఇంటర్వ్యూ తర్వాత కొన్ని విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోటీ ఎక్కువ కావడంతో ఇంటర్వ్యూలు కేవలం ఒక్కసారి మాత్రమే కాకుండా రెండు మూడు దఫాలుగా జరుగుతుంటాయి. వాటిపై అవగాహన కలిగి ఉండాలి. ఒక ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత తదుపరి ఏం చేయాలో సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకోవాలి. ఒక్కో సంస్థ ఒక్కో విధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఉంటుంది. ఆ విషయాలనూ తెలుసుకోవాలి. ముఖాముఖి పరీక్షలో నెగ్గినా అభ్యర్థి అనుభవం, ఆలోచనా తీరు, శారీరక దారుఢ్యం తదితర కొన్ని అంశాలు కూడా ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తుంటాయి. ఆ విషయాలన్నీ ఇంటర్వ్యూకి హాజరయ్యే ముందే తెలుసుకొని ఉండాలి.

ఇంటర్వ్యూ పూర్తయ్యాక కొన్ని సార్లు మీకు సంస్థ నుంచి ఎలాంటి సమాచారం అందకపోవచ్చు. అలాంటి సమయంలో మీరు సంస్థను సంప్రదించాలి. మీకు ఉద్యోగ అవకాశం ఎందుకు రాలేదో అడిగి తెలుసుకోవాలి. లేకుంటే మిమ్మల్ని సంస్థ పట్టించుకోకపోవచ్చు. అభ్యర్థుల్లో ఉద్యోగ ఆసక్తిని గమనించేందుకు కొన్ని సంస్థలు ఇంటర్వ్యూ తర్వాత తదుపరి సమాచారం ఇవ్వవు. అలాంటి తరుణంలో అభ్యర్థులే సంస్థల్ని సంప్రదించాలి.

ఇంటర్వ్యూలో ఆసక్తిని వెల్లడించడం చాలా ముఖ్యం. దాన్ని ఇంటర్వ్యూ ముగిశాక కూడా కొనసాగించాలి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వారి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. మీకు తదుపరి సమాచారం ఎప్పుడందుతుంది.. తర్వాత ఏం చేయాలి వంటి ప్రశ్నలను రిక్రూటర్లను అడగాలి. దీని వల్ల మీరు ఆ సంస్థలో పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కోసారి మీరు ఇంటర్వ్యూలో కాస్త వెనుకబడినా ఆసక్తితో ఉద్యోగాన్ని అందిపుచ్చుకోవచ్చు.

ముఖాముఖి పరీక్ష ముగిసిన తర్వాత సంస్థకు, రిక్రూటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక మెయిల్‌ పంపవచ్చు. ఈ మెయిల్లో కృతజ్ఞతలు తెలపడంతో పాటు.. ఇంటర్వ్యూలో రిక్రూటర్లు గుర్తించని.. సదరు ఉద్యోగానికి సరిపోయే నైపుణ్యాలను సంక్షిప్తంగా వెల్లడించవచ్చు. ఈ మెయిల్లో మీ పేరు, ఇంటర్వ్యూ జరిగిన రోజు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. లేకుంటే మిమ్మల్ని రిక్రూటర్లు గుర్తించలేకపోవచ్చు.

ఎప్పుడూ ఒకే ఇంటర్వ్యూపై ఆధారపడవద్దు. ఉద్యోగం వచ్చే వరకూ మీ అర్హతలు, నైపుణ్యాలు, ప్రతిభకు తగిన కొలువు కోసం అన్వేషణ చేస్తూనే ఉండాలి. ఒకే ఇంటర్వ్యూపై ఆశలు పెంచుకోవడం.. ఆధారపడటం వల్ల ఒకవేళ ఆ ఇంటర్వ్యూతో ఉద్యోగం రాకుంటే సమయం వృథా అవడంతో పాటు నైరాశ్యం పెరిగే ప్రమాదం ఉంటుంది.అందువల్ల ఇంటర్వ్యూలో ఎంత బాగా వ్యవహరించినా ఇతర అవకాశాలనూ వెదుక్కొంటూ ఉండాలి.

స్నేహితులు, పరిచయస్తులు లేదా బంధువులు.. ఎవరైనా సిఫార్సు చేసినపుడు మీరు ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఇంటర్వ్యూకి హాజరై ఉంటే.. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత ఆ వివరాలను ఆ వ్యక్తికి తెలియజేయాలి. ముఖాముఖి పరీక్ష ఎలా జరిగింది.. మీరు ఎలా సమాధానాలు చెప్పారు వంటి విషయాలను వివరంగా తెలియజేయాలి. అలా చెప్పకుంటే మీకు ఇంటర్వ్యూ జరిగిన తీరు సిఫార్సు చేసిన వ్యక్తికి తెలియదు. దీంతో మరోసారి మీకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నా ఆయన చేయలేకపోవచ్చు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017