దృష్టి సారిస్తున్నారా...!

కార్యాలయంలో అన్ని వేళలా పని మీద దృష్టి సారించడం కష్టసాధ్యమే. సహచరులతో పిచ్చాపాటీ, స్నేహితుల ఫోన్లతో పూర్తి స్థాయి సమయాన్ని పనికి కేటాయించని వారికీ కొదవలేదు. ఎంత దృష్టి పెట్టాలన్న ఏదో ఒక సందర్భంలో దృష్టి మరల్చడం తప్పదు. అప్పుడప్పుడు వ్యక్తిగత వ్యవహారాల కోసం పని సమయాన్ని కేటాయించినా పిచ్చాపాటీ కబుర్లకు ఎక్కువ సమయం కేటాయిస్తే మాత్రం వృత్తిజీవితంలో ముందుకెళ్లలేరని నిపుణులు చెబుతున్నారు. పని విషయంలో ప్రతిదీ ప్రశాంతంగా జరిగిపోతోంది.. అన్ని అనుకున్నట్లే సాగుతున్నాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వారానికి ఇన్ని పని గంటలు అని భావిస్తే అందులో ఎన్ని గంటలు పనికి దూరంగా ఉంటున్నామనేది గమనించుకోండి. కాలాన్ని వృథా చేయకుండా లక్ష్యాన్ని ఏర్పరచుకుని... పని మీదే దృష్టి సారించడం వల్ల పదోన్నతులు వాటంతటవే వస్తాయి.
* చాలా మంది ముందస్తుగా ప్రణాళిక లేకపోవడం వల్ల గందరగోళంలో ఇతరత్రా అంశాలపైకి దృష్టి మళ్లిస్తుంటారు. అందుకే పని విభజన చేసుకోవాలి. తొలుత చేయాల్సిన పనులు, లక్ష్యాల వివరాలు ఒక చోట రాసుకోవాలి. ప్రాజెక్టుకి సంబంధించిన పని ఎన్ని రోజుల్లో చేయాలి? ఏ విధంగా చేయాలనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. అప్పుడు కార్యాలయానికి వచ్చాకా ఏం చేయాలో ఆలోచించుకోవల్సిన అవసరం ఉండదు. ఇతరత్రా అంశాలపైకి దృష్టి మళ్లడం తగ్గుతుంది.
* కార్యాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత తొలి గంటసేపు ఎంత పని చేస్తున్నాం అనేది పరిశీలించాలి. చాలా మంది తొలి గంటలో అతి తక్కువ సమయం పనికి కేటాయిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఎంతో ఉత్సాహంగా కార్యాలయానికి వస్తారు కాబట్టి ఆ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. వచ్చిన వెంటనే ఆ రోజు చేయాల్సిన పనిని రాసుకొని మీ టేబుల్‌పై ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. సమయం వృథా నెమ్మదిగా తగ్గిపోతుంది.
* ఎడతెరపి లేకుండా పని మీదే దృష్టి పెట్టాలనుకోవడం తగదు. మధ్యమధ్యలో విరామం ఇస్తుండాలి. ఇలా చేయడం వల్ల దొరికే విశ్రాంతి మిమ్మల్ని మరింత ఉత్సాహంగా పని చేసేలా చేస్తుంది. అలాగని భోజనం, అల్పాహారం తీసుకునేటప్పుడు ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవద్దు. సమయాన్ని సద్వినియోగపరచుకుంటే విజయాలు వాటంతటవే వస్తాయి.
* కార్యాలయంలో మీరేం చేస్తున్నారు అనేది గమనించుకోండి. కొంతమంది ఎక్కడెక్కడో ఆలోచనలు చేస్తూ పని చేస్తున్నామని భావిస్తుంటారు. ఇలాంటి వారికి సానుకూల ఫలితాలు ఎప్పటికీ రావు. రోజులో ఎంతసేపు పనిచేస్తున్నారనేది పరిశీలన చేసుకోవడం ద్వారా ఏయే సమయాల్లో దృష్టి మళ్లుతుందో తెలుసుకోవచ్చు. తదనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుని పనిపై దృష్టి సారించొచ్చు.
* మొబైల్‌ యాప్‌లు వచ్చినప్పటి నుంచి ఫోన్లలోనే మెయిల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లు చూసుకుంటున్నారు. కార్యాలయంలో పని చేస్తున్నంత సేపు వాటికి దూరంగా ఉండాలి. వాటిలో స్టేటస్‌ను busy లేదా invisibleఅని పెట్టడం ద్వారా మీకు అవసరమైనప్పుడే వాటిని చూసుకొనే అవకాశంతోపాటు ఎవరూ మీకు అంతరాయం కలిగించలేరు.
* కార్యాలయంలో కష్టమైన పని, సులభమైన పని అంటూ ఏమీ ఉండదు. అలా భావించడం వల్ల వృత్తి జీవితంలో ఇమడలేరు అంతేకాదు దృష్టి పని మీద ఉండదు. బృంద నాయకుడు అప్పగించిన బాధ్యతలు పూర్తిచేయడం సభ్యుడి కర్తవ్యం. అలా భావించడం వల్ల సకాలంలో లక్ష్యాలు చేరుకోగలరు.
* సహచరులతో కలిసిమెలసి ఉండాలి. బృందంలో ఎవరైనా వ్యక్తిగత లక్ష్యాలు సాధిస్తే అభినందించాలి. వారి సూచనలు సలహాలు పాటించి ముందుకెళ్లడానికి యత్నించాలి. అవసరమైనప్పుడు వారి ప్రాజెక్టులోనూ సహకరించాలి. వాగ్వాదాలు, విభేదాలు వీడాలి. అప్పుడే నలుగురిలోనూ గుర్తింపు వస్తుంది.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017