కొలువులున్నాయి కానీ!

కపక్క బోలెడు ఉద్యోగ అవకాశాలు. సరిపడా నిపుణులు లేక ప్రతిభావంతుల కోసం సంస్థల గాలింపు.మరోపక్క సరైన ఉద్యోగం లేక మంచి కొలువు కోసం యువత అన్వేషణ.ఇదీ కొన్నేళ్లుగా దేశంలో వింత పరిస్థితి.
దీంతో దేశ వ్యాప్తంగా ప్రతిభావంతులైన యువత కోసం డిమాండ్‌ పెరుగుతోంది. అయితే యువతలో మాత్రం సంస్థలు ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు, ప్రతిభ ఉండటం లేదు. ఉన్నా వారు వాటిని సరిగ్గా వెల్లడించలేకపోతున్నారు. ఈ మేరకు జాబ్‌ పోర్టల్‌ కెరీర్‌ బిల్డర్‌ నిర్వహిచిన తాజా సర్వేలో వెల్లడైంది.
దేశంలో పెద్ద సంఖ్యలో సంస్థలు తగిన నిపుణులు లేక ఆందోళన చెందుతున్నాయి. చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయలేక ఉన్న ఉద్యోగులతోనే నెట్టుకొస్తున్నాయి. కొత్తవారిలో సరైన నైపుణ్యం లేకపోవడంతో ఖాళీలు ఉన్నా వారిని కొలువులోకి తీసుకోలేకపోతున్నాయి. ఈ అంశంపై కెరీర్‌ బిల్డర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ.. ' దేశంలో నైపుణ్యాల లేమి సమస్య ఇప్పటికిప్పుడే తీరేది కాదు.' అని తెలిపారు.
ఈ సర్వేలో భాగంగా కెరీర్‌ బిల్డర్‌ దేశ వ్యాప్తంగా 500 కంపెనీలకు చెందిన మేనేజర్లు.. ప్రతినిధులను సంప్రదించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది నైపుణ్యాల లేమిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 57 శాతం మంది అయితే తమ వద్ద ప్రస్తుతం చాలా ఖాళీలు ఉండగా.. వాటిని భర్తీ చేసేందుకు తగిన నిపుణులు లేరని తెలిపారు. నిపుణుల కోసం సంస్థలు అదనంగా కొంత ఖర్చు పెట్టాల్సి వస్తోందని కూడా ఈ సర్వేలో తేలింది. నైపుణ్యలేమి వల్ల ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం పడుతోందని 76శాతం సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో కూడా కొందరు సంస్థ ఆశించిన స్థాయిలో పని చేయలేకపోవడం వల్ల కొన్నిసార్లు నష్టాలు వస్తున్నట్లు వెల్లడైంది.
ఇక ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్న వారి విషయానికి వస్తే.. వారు దరఖాస్తు చేసిన ఉద్యోగానికి తగిన ప్రతిభ ఉండడం లేదని 65 శాతం మంది మేనేజర్లు అభిప్రాయపడ్డారు. చాలా సంస్థల్లో మూడు నెలలు అంతకన్నా ఎక్కువ సమయం ఉద్యోగ ఖాళీలు ఉంటున్నాయి.
చివరకు ఎక్కడా సరైన అభ్యర్థులు లభించకపోవడంతో పదిలో తొమ్మిది సంస్థలు కాస్తో కూస్తో ప్రతిభ ఉన్నవారిని ఉద్యోగంలోకి తీసుకొని వారికి శిక్షణ ఇస్తున్నాయి. ఇందుకోసం అదనపు ఖర్చు పెట్టేందుకూ వెనుకాడటం లేదు.
మరి అభ్యర్థులు ఏం చేయాలి
ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసేటపుడు దానికి అవసరమైన అర్హతలు, నైపుణ్యంపై స్పష్టమైన అవగాహన సాధించాలి. ఇందుకోసం ఆయా ఉద్యోగాలు, సంస్థలపై కాస్త అధ్యయనం చేయాలి.
అవసరమైన నైపుణ్యాలపై అవగాహన వచ్చాక అవి తమలో ఎంతమేరకు ఉన్నాయో విశ్లేషించుకోవాలి. ఇప్పటికే ఉంటే వాటిని మరింత మెరుగుపరచుకోవాలి. లేకుంటే సాధించాలి.
సంస్థకు రెజ్యూమె పంపేముందు మీలో ఉన్న అర్హతలను ప్రధానంగా పేర్కొనడం కన్నా సంస్థకు కావాల్సిన అర్హతలు మీలో ఏమేరకు ఉన్నాయో వివరించాలి.
విద్యార్థులు అయితే.. తాము లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యోగానికి సంబంధించిన సమగ్ర వివరాలను తెలుసుకోవాలి. వాటికి కావాల్సిన నైపుణ్యాలను చదువుతో ఏమేరకు సాధించామో విశ్లేషించుకోవాలి. అవి లేకుంటే స్వల్పకాలిక శిక్షణ తీసుకోవాలి.
చదువు పూర్తయిన వెంటనే ఉన్న అర్హతలతో అన్ని సంస్థలకూ రెజ్యూమెలు పంపకుండా ఎక్కడెక్కడ ఏయే ఖాళీలున్నాయో.. వాటికి మీ అవసరం ఏమేరకు ఉందో ఆరా తీయాలి. తర్వాతే వాటికి దరఖాస్తు చేయాలి.
ప్రస్తుతం నిపుణుల కోసం డిమాండ్‌ ఎక్కువగా ఉంది కనుక మీలో కాస్త నైపుణ్యం ఉన్నా రెజ్యూమె, ముఖాముఖి పరీక్షల్లో దాన్ని చక్కగా ప్రదర్శించగలిగితే చాలు. వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.తర్వాత సంస్థలు అందించే శిక్షణతో కావాల్సిన నైపుణ్యాలు సాధించవచ్చు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017