పదోన్నతిపై సందేహాలా!

దోన్నతి... వృత్తి జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరి లక్ష్యమూ ఇదే. కెరియర్‌లో దూసుకెళ్లాలని, సకాలంలో పదోన్నతులు పొంది ఉన్నతస్థానాలకు వేగంగా చేరాలని భావిస్తుంటారు. మీలోని నైపుణ్యాలు, సామర్థ్యం పట్ల మీకు నమ్మకం ఉంటే ఏమీ ఆశించకుండానే నలుగురిలోనూ గుర్తింపు పొందుతారు. అదే సమయంలో మీ నైపుణ్యాలు, అర్హతలు సంస్థకు ఎంతగా తోడ్పడితే అంతే వేగంగా ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఖాయం. మీరెంత నిజాయతీగా వ్యవహరిస్తున్నారనేది సంస్థ గమనిస్తుందని మరవద్దు. ఏదైనా ప్రాజెక్టు విషయంలో సహచరుడికి సలహాలు ఇవ్వడం ద్వారా మీలోని నైపుణ్యం బయటపడుతుంది. ఎదుటివారిని ఒప్పించే సమయంలో మీ సామర్థ్యాన్ని వారు గుర్తించేలా ఉంటే కెరియర్‌లో ఓ మెట్టు పైకెదిగినట్లే. మరోవైపు, పనికి తగ్గ ఆదరణ లభించడం లేదన్న అసంతృప్తికి లోనయ్యే వారూ ఉంటారు. పదోన్నతి పొందాల్సిన సమయంలో నిరుత్సాహంతో ఉండ రాదని, అసలు అలా ఎందుకు జరుగుతోందో గుర్తించి సమస్యను పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వృత్తి జీవితంలో పదోన్నతులు స్వీకరించడానికి ముందుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అంశాలున్నాయని వారు చెబుతున్నారు.
కెరియర్‌లో నా తదుపరి అడుగేంటి
వృత్తి జీవితంలో అడుగుపెట్టాం. రోజులు గడుస్తున్నాయ్‌ అనుకుంటే సరిపోదు. తదుపరి లక్ష్యం ఏంటి.. జీవితంలో ఎలాంటి స్థానానికి ఎదగాలనుకుంటున్నారు.. అందుకోసం మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? అనేది ప్రశ్నించుకోవాలి. మీరేస్తున్న అడుగులు ఆ దిశగానే ఉన్నాయా? లేదా ? చూసుకోండి. అప్పుడే పదోన్నతిని సులభంగా పొందగలరు.
ఎలాంటి అర్హతలు కావాలి
పదోన్నతి పొందాలంటే ప్రస్తుతం ఉన్న అర్హతలు, నైపుణ్యాలు సరిపోతాయా అనేది చూసుకోండి. మీరు అందుకోవాలనుకుంటున్న పదవికి తగిన అర్హతలు తెలుసుకోండి. దానికి తగ్గ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. ఏదైనా శిక్షణ తీసుకోవాలనుకుంటే సంకోచించకండి. అన్ని విధాలా సమర్థులైన వారికే పదోన్నతులు వరిస్తాయని గుర్తెరగండి.
అనుభవం సరిపోతుందా
పనితీరు తెలియడం ఒక్కటే ప్రాధాన్యం అనుకోకూడదు. ఆ పదవిలోకి చేరకున్నాక ఒత్తిడికి గురవకుండా సకాలంలో లక్ష్యాలు చేరుకునే అనుభవమూ తోడుండాలి. మీ విజయం బృంద విజయంతో ముడిపడి ఉంది కాబట్టి ఫలితాలు సానుకూలంగా రావడానికి మరింత కష్టపడాలి. బృందంలో మీ పనితీరు ఆధారంగానే అనుభవాన్ని లెక్కిస్తారు. సహచరులతో కలిసిమెలసి ఉండడంతోపాటు వారికి అవసరమైనప్పుడు సహకరిస్తుండాలి. వారిచ్చే సమీక్షను బట్టే బాస్‌ మీ సామర్థ్యాన్ని అంచనా వేసే అవకాశాలు లేకపోలేవు. అందుకే వారి సలహాలు తీసుకుని మరింతగా రాణించడానికి యత్నించాలి. బాస్‌ అప్పగించిన పని సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీరెంత అనుభవజ్ఞులనేది ఆయన గుర్తించడానికి అవకాశం ఉంది.
ఆ పదవికి తగ్గట్టు ఉన్నానా
వృత్తి జీవితంలో ముందుకెళ్లడానికి మీ వంతుగా చొరవ చూపడం ఎంతో ముఖ్యం. సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశమివ్వాలని, ముఖ్యమైన ప్రాజెక్టుల్లో పని చేయడానికి ఆసక్తి ఉందని నేరుగా బాస్‌కి వివరించండి. మరిన్ని బాధ్యతలు చేపడతానని చెప్పడం ద్వారా మీలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తించడానికి వీలవుతుంది. అంతేకాదు, పదోన్నతి పొందడానికి మీలో ఉన్న అర్హతలు బాస్‌ సులభంగా గుర్తు పడతారు. పదవికి తగ్గట్టుగా రాణిస్తారని మీపై నమ్మకం ఏర్పడుతుంది. ఇంకేముంది వృత్తి జీవితంలో మరో మెట్టు ఎక్కినట్లే.
భావ వ్యక్తీకరణ
కార్యాలయంలో అందరితోనూ కలుపుగోలుగా ఉండాలి. బృంద సభ్యులతోనే మాట్లాడాలన్న నియమ నిబంధనలు పెట్టుకోవద్దు. కార్యాలయంలోని ఇతర విభాగాల వారిని కూడా గుర్తించి పలకరిస్తుండాలి. కష్టపడి చేయడమే కాదు.. దానికి తగ్గ గుర్తింపు లభించాలంటే అందరికీ మీరు తెలియాలి. అప్పుడే పదోన్నతుల సమయంలో మొదట్లోనే మీ పేరు ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017