చెప్పండి చాకచక్యంగా

ద్యోగ అన్వేషణలో ఇంటర్వ్యూ దశ కీలకం. ఇక్కడ విజయం సాధిస్తే.. దాదాపు కొలువు సాకారమైనట్టే. అయితే ఈ దశ ఎంత కీలకమో.. దీన్ని విజయవంతంగా అధిగమించడం అంతే కష్టం. అన్ని ఉద్యోగాలకూ పోటీ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇంటర్వ్యూలో నెగ్గాలంటే అసాధారణ ప్రతిభను.. నైపుణ్యాలను.. ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని మీరు ఎంత గొప్పగా ప్రదర్శించుకుంటారో అవకాశాలు అంతగా మెరుగవుతాయి. ఇందుకోసం బలాలను ఎంత ఉత్సాహంగా వెల్లడిస్తారో.. బలహీనతలనూ అంతే చాకచక్యంగా చెప్పాల్సి ఉంటుంది. అదెలాగో చూద్దాం.
ఒక వ్యక్తిలో బలాలు బలహీనతలు సహజం. ఇంటర్వ్యూలో రిక్రూటర్లు ఈ రెండింటినీ తెలుసుకోవాలనుకొంటారు. ఆ విషయాలు తెలిస్తేనే.. ఆ అభ్యర్థి తమ సంస్థకు ఏమేరకు పనికి వస్తారో ఒక అంచనాకు వస్తారు. ఇలాంటి తరుణంలో అభ్యర్థి ఇంటర్వ్యూలో బలాలతో పాలు లోపాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. మీ బలాల గురించి ప్రస్తావించాల్సి వచ్చినపుడు ఉత్సాహంగానే ఉంటుంది. ఇక్కడ అతి విశ్వాసాన్ని ప్రదర్శించవద్దు. రెజ్యూమె, ఫోన్‌ ఇంటర్వ్యూ, సంస్థ నిర్వహించిన పరీక్షలో వెల్లడించిన అంశాలకు విరుద్ధంగా ఏవీ చెప్పవద్దు. ఒకవేళ ఏవైనా ఉన్నా వాటిని చెప్పకుండా వదిలేయడం మేలు.
ప్రతికూలతల గురించి ప్రస్తావించాల్సి వచ్చినపుడు చాలా మంది డీలాపడిపోతుంటారు. వ్యక్తిగత లోపాలను ప్రస్తావించడం, బలహీనతలకు సాకులు చెప్పడం తదితరాలు చేస్తుంటారు. ఈ పద్ధతి సరికాదు. నిజాయితీగా హుందాగా మీలో బలహీనతలను వెల్లడించి.. వాటిని అధిగమించేందుకు ఉన్న అవకాశాలు.. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలి. ఇలా చేయడం వల్ల మీరు మీ లోపాలను అధిగమించడానికి నిజాయితీగా ప్రయత్నిస్తున్నట్లు రిక్రూటర్లకు అర్థమవుతుంది. ఏ పరిస్థితుల్లోనూ బలహీనతలకు సాకులు మాత్రం చెప్పవద్దు. సాకులు చెబితే రిక్రూటర్లలో మీపై ప్రతికూల భావన కలుగుతుంది.
కొన్ని ఉద్యోగాలకు తప్ప.. సాధారణంగా ఏ రిక్రూటరూ.. హెచ్‌ఆర్‌ మేనేజరూ మీ వ్యక్తిగత బలహీనతల గురించి అడగరు. అందువల్ల బలహీనతలంటే వ్యక్తిగతమైనవిగా భావించవద్దు. వ్యక్తిగత లోపాలను ప్రస్తావించాల్సిన పని లేదు కూడా. అవసరంగా వాటిని వెల్లడించి ఉద్యోగ అవకాశాలను చేజార్చుకోవద్దు. ఉద్యోగానికి.. నైపుణ్యాలకు సంబంధించిన వాటిని మాత్రం తీవ్రంగా పరిగణిస్తారు.
మీరు దరఖాస్తు చేసిన ఉద్యోగంలో కీలక విధులకు సంబంధించి ఏవైనా బలహీనతలు ఉంటే వాటిని ప్రస్తావించవద్దు. నేను ఫలానా విధులు నిర్వర్తించలేను.. ఆ విధులను నిర్వర్తించడం నాకు కొంచెం కష్టం వంటి విషయాలను ఇంటర్వ్యూలో చెప్పవద్దు. ఒకవేళ మీలో నిజంగా విధులకు సంబంధించిన ప్రతికూలతలు ఉంటే.. వీలైనంత త్వరగా వాటిని అధిగమించాలి. లేకుంటే మీకు ఉద్యోగం లభించినా దాన్ని నిలుపుకోవడం కష్టమవుతుంది. అప్పగించిన పనులనూ ఫలవంతంగా పూర్తిచేయలేరు.
సాధారణంగా ఏ ఒక్కరూ వందశాతం పక్కాగా ఉండలేరు. ఏదో ఒక విషయంలో లోపం ఉంటుంది. అందువల్ల ఇంటర్వ్యూలో నాకు ఎలాంటి బలహీనతలూ లేవని చెప్పవద్దు. బలహీనతల ప్రస్తావన వస్తే.. దాన్ని ఒక అవకాశంగా తీసుకొని మీకు సానుకూలంగా మలచుకోవాలి. మీకు గతంలో ఏదైనా బలహీనత ఉండి దాన్ని అధిగమించి ఉంటే.. ఆ విషయాలను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించవచ్చు. మీరు బలహీనతలను అధిగమించిన తీరు ఆసక్తికరంగా ఉంటే అది రిక్రూటర్లకు నచ్చి మీపై వారికి విశ్వాసం పెరిగే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ముఖాముఖి పరీక్షలో మీ హావభావాలు, కదలికల ఆధారంగా మీరు చెబుతున్న అంశాల్లో వాస్తవం ఏమేరకో రిక్రూటర్లు సులభంగా పసిగట్టేస్తారు. అందువల్ల ఏ అంశంలోనూ అంతిశయోక్తులు పనికిరావు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017