కొలువుంది.. కానీ

ద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి శుభవార్త. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఔషధ (ఫార్మాస్యూటికల్‌) రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంపై జాబ్‌ పోర్టల్‌ నౌకరీ డాట్‌కామ్‌.. నౌకరీ హైరింగ్‌ అవుట్‌లుక్‌ సర్వే పేరిట ఒక అధ్యయనం నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 800కు పైగా రిక్రూటర్లు, సంస్థల వద్ద సర్వే చేసింది. ఐటీ రంగంలో ఈ ఏడాది ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఈ సర్వేలో ప్రాథమికంగా తేలింది.

ఈ సర్వేలో పాల్గొన్న రిక్రూటర్లు, సంస్థల్లో 64 శాతం.. ఈ ఏడాది కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం చాలా ఖాళీలు ఉండటం.. కొత్త ప్రాజెక్ట్‌లు వస్తుండటంతో ఈ సారి తప్పకుండా వాటిని భర్తీ చేయాలని భావిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి కాస్త ఆశాజనకంగా ఉంది. గతేడాది 54 శాతం సంస్థలే కొత్తగా ఉద్యోగాలను ఇస్తున్నట్లు వెల్లడించాయి.

ఇక ఉద్యోగుల తొలగింపు విషయానికి వస్తే.. ఈ సారి ఈ సంఖ్య భారీగా తగ్గనుంది. కేవలం రెండు శాతం సంస్థలే ఈ ఏడాది ప్రథమార్ధంలో ఉద్యోగుల తొలగింపు గురించి ఆలోచిస్తున్నాయి. గతేడాది ద్వితీయార్ధంలో ఐదు శాతం సంస్థలు ఉద్యోగుల తొలగింపుపై కసరత్తు చేశాయి.

మొత్తానికి తాజా సర్వేలో పాల్గొన్న.. ఐటీ సంస్థల్లో 77 శాతం సంస్థలు ఈ ఏడాది ఖాళీలను భర్తీ చేయడంతో పాటు.. కొత్త/అదనపు ఉద్యోగాలను సృష్టించనున్నట్లు వెల్లడించాయి. ఇక ఫార్మా రంగం విషయానికి వస్తే 72 శాతం సంస్థలు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

ఇక కొత్తవారి (ఫ్రెషర్స్‌)కీ ఈ ఏడాది ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. చాలా సంస్థలు కొత్తవారిని, ఒకటి నుంచి రెండేళ్ల అనుభవం ఉన్నవారిని ఎక్కువగా నియమించుకొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. 56 శాతం సంస్థలు నిపుణులను నియమించుకోవాలని భావిస్తున్నాయి.

ఒకవైపు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నా.. వాటిని తగినట్లు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉండటం లేదు. ముఖ్యంగా గతేడాది మొదట్లో 55 శాతం సంస్థలు ఉద్యోగులు, విద్యార్థుల్లో నైపుణ్యలేమి ఉన్నట్లు వెల్లడించగా.. చివరికి వచ్చేసరికి 77 శాతం సంస్థలు నైపుణ్యలేమిపై ఆందోళన వ్యక్తం చేశాయి.
మరిపుడు ఏం చేయాలి..!

* విద్యార్థులైతే తుది పరీక్షలు రాసిన వెంటనే ఉద్యోగాల కోసం సిద్ధం కావాలి. నైపుణ్యాలను ఏమేరకు ఉన్నాయి.. దరఖాస్తు చేయనున్న ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఏంటో ఒక అవగాహనకు రావాలి. ఉద్యోగం కోసం అదనపు శిక్షణ అవసరమైతే ప్రకటనలు వచ్చేలోపు ఆ శిక్షణను పూర్తి చేసి సిద్ధంగా ఉండాలి.

* అన్నింటికన్నా ముఖ్యవిషయం నైపుణ్యలేమి. ఇప్పటికీ చాలా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నా నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లేక వాటిని భర్తీ చేయలేకపోతున్నాయి. అందువల్ల ఉద్యోగి అయినా విద్యార్థి అయినా ప్రతిభ, నైపుణ్యాలను మెరుగుపరచుకొనేందుకు కసరత్తు చేయాలి. అదనపు శిక్షణతో పాటు అవకాశం ఉంటే శిక్షణ కోసం సంస్థల్లో చేరి పనిచేయవచ్చు. ఇలా శిక్షణ కోసం పని చేయడం వల్ల నైపుణ్యాలు మెరుగవడంతో పాటు.. ఆయా ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాలపై అవగాహన పెరుగుతుంది.

* ఇప్పటికే పని చేస్తున్నవారు తమ రంగంలో ఆధునిక పోకడలుపై అవగాహన పెంచుకోవాలి. మరింత నైపుణ్యం సాధించాలి. దీంతో త్వరగా పదోన్నతులు, ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు అవకాశాలు పెరుగుతాయి.

''ప్రస్తుతం దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉంది. అందువల్ల ఎన్నికలు పూర్తయ్యే వరకు సంస్థల్లో నియామకాలు పెద్దగా ఉండవు. ఎన్నికలు పూర్తయ్యాక అంటే జూన్‌ నుంచి డిసెంబరు వరకు ఐటీ సంస్థల్లో నియామకాలు వూపందుకుంటాయి.''

- హితీశ్‌ ఒబెరాయ్‌
(సీఈవో, ఇన్ఫోఎడ్జ్‌-ఇండియా)


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017