జాబుదొంగలతో.. జాగ్రత్త!

దువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చింది ఓ యువతి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆమె రైలు దిగిందో లేదో.. ఆమెకు ఆర్బీఐ ఉద్యోగి తారసపడ్డాడు. అతను తన గుర్తింపు కార్డు చూపి.. తాను ఉద్యోగాలు ఇప్పిస్తుంటానని నమ్మబలికాడు. చేతిలో ఉన్న నకిలీ దరఖాస్తులు ఇచ్చి వాటిని నింపమని కోరాడు. తర్వాత ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చివరకు ఒకరోజు ఫలానా చోట ఇంటర్వ్వూకి రమ్మని చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత ఆమెను వ్యభిచార గృహానికి అమ్మేశాడు.
* బీటెక్‌ పూర్తి చేసిన యువకుడు ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో పలు పోర్టళ్లలో రిజిస్టర్‌ చేసుకున్నాడు. వారానికి ఫలానా చోట ఉద్యోమంటూ ఒక మెయిల్‌ వచ్చింది. స్పందించాడు. జీతం రూ.50 వేలనిరెండు నెలల జీతం (అంటే రూ. లక్ష) ముందుగా తమకు చెల్లిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని మరో మెయిల్‌ వచ్చింది. నమ్మి చెల్లించాడు. అంతే తర్వాత మెయిల్స్‌ ఆగిపోయాయి. ఆరా తీస్తే.. అప్పుడు తెలిసింది అతనికి తాను మోసపోయానని.
* ఓ ప్రముఖ సంస్థలో మీకు ఉద్యోగం వచ్చింది.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి అంటూ.. ఒక మెయిల్‌ వచ్చింది. క్లిక్‌ చేశాడు. అంతే వారం తర్వాత అతని బ్యాంకు ఖాతాలో మొత్తం డబ్బుల్ని ఎవరో కొట్టేశాడు. ఆరా తీస్తే.. అతనికి వచ్చిన మెయిల్లో వైరెస్‌.. సిస్టమ్‌లోకి చొరబడి మొత్తం సమాచారాన్ని హ్యాకర్‌కు పంపగా అతను బ్యాంకు ఖాతాను కొల్లగొట్టినట్లు తేలింది.
* ఇవీ ప్రస్తుతం ఉద్యోగాల పేరిట కొంతమంది చేస్తున్న మోసాలు. రోజూ ఎక్కడో ఒక చోట ఇలాంటివి వెలుగులోకి వస్తున్నా.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సంస్థలు హెచ్చరిస్తున్నా.. ఇప్పటికీ కొందరు మోసపోతూనే ఉన్నారు. అందువల్ల మోసపూరిత ఉద్యోగ ప్రకటనలు.. ఆఫర్లు ఎలా ఉంటాయో అవగాహన పెంచుకోవాలి. దీంతో మోసగాళ్లవలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడవచ్చు.
* ఉద్యోగ ప్రకటన ఎప్పుడైనా అధికారికంగా వెలువడుతుంది. అనధికారికంగా ప్రముఖ సంస్థల పేరిట వచ్చే మెయిల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాంటి మెయిల్‌ వస్తే... వెంటనే దానికి స్పందించకుండా.. సదరు సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఉద్యోగ ప్రకటనలు ఏమైనా ఉన్నాయో ఆరా తీయాలి. ఉంటే.. తప్పకుండా అక్కడ సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు, మెయిల్‌ ఐడీల వివరాలను ఇచ్చి ఉంటారు. వాటికి మాత్రమే మీరు రెజ్యూమె లేదా దరఖాస్తు పంపాలి. అపరిచితుడు.. లేదా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి ఫలానా చోట ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మవద్దు. ఎక్కువగా మోసాలు జరిగేది ఇలాంటి వారి వల్లే. ఒకవేళ పరిచయస్తులు ఉద్యోగం ఇప్పిస్తానంటే కూడా అనుమానించాల్సిందే. కేవలం ఉద్యోగ అవకాశాలను మాత్రమే చెప్పగలరు. ఒకవేళ ఉద్యోగం ఇప్పిస్తాంటే అతను ఎక్కడ పని చేస్తున్నారో.. ఆయన స్థాయి ఏంటి.. తదితర వివరాలు ఆరా తీయాలి.
* మీలో తగిన ప్రతిభ, అర్హతలు, నైపుణ్యం లేకుండా ఎవరూ ఉద్యోగం ఇప్పించలేరు. అలాంటివి ఏవీ లేకున్నా ఉద్యోగం పక్కాగా వస్తుందంటే తప్పకుండా అనుమానించాలి. అపరిచితులు, అనధికారిక సంస్థల నుంచి వచ్చే మెయిల్స్‌కి స్పందించవద్దు. అపరిచితులు ఉద్యోగం ఇస్తామన్నా.. దరఖాస్తులు ఇచ్చి పూర్తి చేయమన్నా చేయవద్దు. ఆ దరఖాస్తును తీసుకెళ్లి తర్వాత పంపుతానని చెప్పి వచ్చేయాలి. ఒకవేళ దరఖాస్తు నిజమే అయితే తర్వాత పంపవచ్చు. అది మోసం అనిపిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు మాత్రం దరఖాస్తులో నిపండం.. ఫోన్‌ నంబర్లు వెల్లడించడం సరికాదు.
* సంస్థలు ఎక్కడా ఉద్యోగుల నుంచి కానీ.. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొన్న వారి నుంచి కానీ.. డబ్బులు వసూలు చేయవు. డబ్బులిస్తే ఉద్యోగం ఇస్తానంటే అది తప్పకుండా మోసమే అయి ఉంటుందని గ్రహించాలి. 'విదేశాల్లో ఉద్యోగం' పేరిట ఎక్కువగా మోసాలు జరుగుతుంటాయి. అలాంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ ప్రకటన.. దరఖాస్తు చేయడం.. ఆ దరఖాస్తు సంస్థకు నచ్చితే.. ఇంటర్వ్యూ పిలుపు అక్కడ రాణిస్తే ఉద్యోగ అవకాశం.. ఇదీ ఉద్యోగం వచ్చే క్రమం. ప్రస్తుతం 99 శాతం సంస్థలు అనుసరిస్తున్న విధానం ఇదే. అలా కాకుండా ఉన్నపళంగా ఉద్యోగం రాదన్న సంగతిని గుర్తుంచుకోవాలి.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017