డిజిటల్‌ యువతదే భవిత

పుస్తకాలతో కుస్తీ పట్టి మౌఖిక పరీక్షలకు గజినీలా దండయాత్రలు చేస్తేనే కానీ వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడం సాధ్యమయ్యేది కాదు.. నాటి తరం పరిస్థితి ఇది.. మరి నేటి తరం వారిదో.. ఇంటి దగ్గరే కూర్చొని సామాజిక వేదికల్లో రెజ్యూమెను అప్‌డేట్‌ చేసి రిక్రూటర్ల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా అభివృద్ధి చెందిన సాంకేతికత పుణ్యమైతే.. దాన్ని అందిపుచ్చుకొని దూసుకెళ్తోంది మిలీనియం జనరేషన్‌. మిలీనియం జనరేషన్‌ లేదా జనరేషన్‌ 'వై' అంటే.. డిజిటల్‌ యుగం (1983-2000)లో జన్మించిన యువతగా పరిగణిస్తున్నారు.
రానున్న పదేళ్లలో కీలకస్థానాల్లో జనరేషన్‌ 'వై'దే అగ్రస్థానమని ఓ అధ్యయనం పేర్కొంది. సమాజం, ఆర్థిక వ్యవస్థ, మార్కెట్‌పై వీరెంతో ప్రభావం చూపుతారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత జన్మించిన వీరు అన్ని రంగాల్లోనూ అన్నివేళల్లోనూ రాణించగలరని అధ్యయనం అంచనా వేసింది. 2025కల్లా 75శాతం మంది జనరేషన్‌ 'వై'కి చెందినవారే కీలక బాధ్యతలు చేపడతారని తెలిపింది. వీరంతా సాంకేతికంగా అభివృద్ధి చెందినవారే కాకుండా వాస్తవ దృక్పథం, లక్ష్యాలు సాధించాలనే పట్టుదల, బృంద నాయకుడి లక్షణాలతోపాటు భావవ్యక్తీకరణలోనూ రాణిస్తారని అధ్యయనం వివరించింది. సాంకేతికత అందిపుచ్చుకుని.. స్మార్ట్‌ఫోన్లు, సామాజిక అనుసంధాన వేదికల్లో ముచ్చట్లంటూ జాలీగా గడిపేస్తున్నట్లు కనిపించే ఈ తరం యువత.. కుటుంబ అనుబంధాలు, బాధ్యతలపైనా ఎంతో అవగాహన కలిగి ఉంటోంది. వృత్తి జీవితంలో హెచ్చుతగ్గుల వేళ ఈ అవగాహన వీరికి అక్కరకొస్తోందని అధ్యయనం పేర్కొంది. మిలీనియం జనరేషన్‌ గురించి నిపుణులు చెప్పిన పలు అంశాలను అధ్యయనంలో స్పష్టంగా వెల్లడించారు. ఉద్యోగార్థులను ఎంపిక చేసుకొనే ప్రక్రియను ఆయా సంస్థలు మార్పులు చేసుకొనేంతగా వీరు ప్రభావం చూపుతున్నారన్నది నిపుణుల మాట. చాలా సంస్థలు సామాజిక అనుసంధాన వేదికల ద్వారా నైపుణ్యవంతులైన అభ్యర్థులను గాలించి మరీ నియామకాలు చేపడుతున్నాయి. నూతనంగా ఏర్పాటైన పలు సంస్థల్లో ప్రస్తుతం మిలీనియం జనరేషన్‌దే కీలకపాత్ర. అందుకే తమ తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఆయా సంస్థలు విధానాలను మార్చుకోవాల్సి వస్తోందని నిపుణులు తెలిపారు.
ప్రస్తుతం ఉద్యోగులు బృందనాయకుడితో పరిచయం పెంచుకోవడం, సంస్థ కార్యకలాపాల్లో చొరవ చూపడంలో ముందుంటున్నారు. ఉన్నతాధికారులకు అందుబాటులో ఉండడం ద్వారా అన్ని అంశాల్లోనూ పారదర్శకతకు చోటిస్తున్నారు. సామాజిక అనుసంధాన వేదికలు.. కాలక్షేపం కబుర్లకే పరిమితం కాదని నిరూపిస్తోందీ జనరేషన్‌. భావవ్యక్తీకరణ, కలిసి పని చేయడానికి ఈవేదికలను ఉపయోగిస్తోంది. తద్వారా నూతన ఆవిష్కరణలు చేయడం, వ్యయాన్ని తగ్గించడంతోపాటు ఉత్పాదకత పెంచుతున్నారు.
* జనరేషన్‌ 'వై'కి చెందినవారు 2018కల్లా అంతకుముందు తరాల వారిని అధిగమిస్తారని ఒరాకిల్‌ సంస్థ అంచనా.
* 2025 నాటికి ప్రతి నలుగురు ఉద్యోగుల్లో ముగ్గురు జనరేషన్‌ 'వై'కి చెందినవారే - టైమ్‌ మేగజీన్‌
* 54 శాతం మంది ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేస్తారు. లేదా అప్పటికే చేసుంటారు. - కాఫ్‌మ్యాన్‌ ఫౌండేషన్‌
* తమ సంస్థలో 86 శాతం మిలీనియం జనరేషన్‌ వారేనని, సాంకేతికతను పుణికిపుచ్చుకున్న వీరి నైపుణ్యాలకు తగ్గట్టుగా ఉద్యోగాలు సృష్టిస్తున్నామని ఓ ప్రఖ్యాత ఐటీ సంస్థ తెలిపింది. మిలీనియం జనరేషన్‌ను నడిపించడానికి ఒక అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను రూపొందించామని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017