గ్రాఫ్‌ పడనీయొద్దు..!

వృత్తి జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ త్వరత్వరగా ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆశిస్తుంటారు. కార్యాలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ దిశగా కసరత్తు చేస్తూనే ఉంటారు. ఇందుకోసం సకాలంలో లక్ష్యాలు చేరుకోవడం.. బాస్‌ అప్పగించిన అదనపు బాధ్యతలు సక్రమంగా చేపట్టడం వంటివి చేయడంతోపాటు సీనియర్ల సలహాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అంతర్గత నైపుణ్యాలు కూడా పెంచుకోవాలని సూచిస్తున్నారు. వృత్తి జీవితంలో వేగంగా దూసుకెళ్లడానికి నిపుణులు మరికొన్ని సూచనలు చేస్తున్నారు.. పాటించి చూడండి.
బృందంలో పని చేస్తున్నప్పుడు చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి. మాటల్లోనైనా లేదా లిఖితపూర్వకంగా అయినా విషయాన్ని అర్థమయ్యేలా చెప్పగలిగితే మీపై బృంద నాయకుడికి సదభిప్రాయం ఏర్పడుతుంది. వాక్య నిర్మాణాల్లో భాష సరళంగా ఉండాలి. సాగదీత ఉండకూడదు. మీ పట్ల సహచరులెవరైనా స్పందిస్తే సానుకూలంగా తీసుకొని తప్పొప్పులను సమీక్షించుకోవాలే కానీ.. వాగ్వాదాలు వద్దు.
జాగ్రత్తగా ఆలకించండి
సమావేశాల్లో విషయం చెప్పడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అవతలి వారు చెప్పేది వినడానికి అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుతగలకండి. సమావేశం చివర్లో మీ అభిప్రాయాలు చెప్పమనే వరకూ ఓపిక పాటించాలి.
ఘర్షణ వదు్ద
కార్యాలయంలో చిన్న చిన్న వాదనలు సహజమే. కానీ వాటిని తీవ్రంగా పరిగణించకూడదు. ఘర్షణ వాతావరణం వల్ల పని మీద దృష్టి సారించలేరు. వివాదాలు ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుకొనే దిశగా వెళ్లాలే కానీ పెద్దవి చేసుకోకూడదు. వివాదాలను పరిష్కరించే సామర్ధ్యం కలిగి ఉండడం నాయకత్వ లక్షణాల్లో ఒకటని గుర్తెరగండి.
బృందంగా
బృందంలో సభ్యుడిగా పని చేయాలే కానీ ఒక్కడిగా భావించడం వల్ల సకాలంలో లక్ష్యాలు చేరుకోలేరు. బృందంగా ఉన్నప్పుడే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. సహచరులను నవ్వుతూ పలకరించడం, తీరిక వేళల్లో సంభాషించడం వంటివి చేయడం వల్ల పని ఒత్తిడిని దూరం చేయొచ్చు. అంతేకాదు.. దీంతో బృందసభ్యుల మధ్య అవగాహన పెరిగి లక్ష్యాలు సకాలంలో చేరుకోవచ్చు.
కృతజ్ఞతలు చెప్పండి
బృంద సభ్యుల్లో ఎవరిదైనా సహాయం పొందితే వెంటనే కృతజ్ఞతలు తెలపాలి. వారికి అవసరమైనప్పుడు మీరు కూడా సహకరించాలి. సభ్యులెవరైనా లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమవుతుంటే చొరవ తీసుకొని సూచనలు చేయండి. తద్వారా బృందంలో మీకంటూ ఓ గుర్తింపు వస్తుంది. మీలోని నాయకత్వ లక్షణాలు బాస్‌ గుర్తించే అవకాశమూ ఉంటుంది.
బాడీ లాంగ్వేజ్‌
ప్రాజెక్టులోని బృంద సభ్యులందరూ ఓ తరహా బాడీ లాంగ్వేజ్‌ను అనుసరిస్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో సైగలతోనే సలహాలు, సూచనలు అందించుకుంటూ ఉంటారు. సభ్యుల మధ్య మంచి అవగాహన ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. అంతేకాదు కార్యాలయంలో మూడీగా ఉంటూ నా పనేదో నేను చేసుకుంటాలే అన్నట్లు ప్రవర్తించడం తగదు. మీరు పలికించే హావభావాలతో ఎదుటి వారిని ఆకట్టుకోగలతారు. మోముపై చిరునవ్వు చెదరనీయొద్దు. వృత్తిజీవితంలో కఠినమైనప్పటికీ కొన్ని నైపుణ్యాలు తప్పకుండా అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
* సమయానికి కార్యాలయానికి రావడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. సమావేశాలకు ఆలస్యం వస్తే బృంద నాయకుడు, బాస్‌కి మీపై నమ్మకం సడలుతుంది. పదోన్నతుల సమయంలో సకాలంలో లక్ష్యాలు చేరుకున్నారా... విజయాల శాతం ఎలా ఉంది అనే అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే మీ విజయాల గ్రాఫ్‌ పడిపోకుండా చూసుకోవాలి.
* కఠినమైన ప్రాజెక్టులను స్వీకరించడంలో వెనకడుగు వేయొద్దు. ఇలాంటి సందర్భాల్లోనే మీ నైపుణ్యాలు బాస్‌ దృష్టికి తీసుకెళ్లగలుగుతారు. చొరవ తీసుకొని వాటిని స్వీకరించడం వల్ల మీపట్ల నమ్మకం పెరుగుతుంది. వృత్తి జీవితంలో మరెన్నో మైలురాళ్లు చేరుకోవడానికి ఇది మీకు కచ్చితంగా ఉపకరిస్తుంది.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017