గుర్తిస్తేనే.. అధిక ప్రయోజనం

సంస్థలు ఉద్యోగుల్లో ప్రతిభను కాస్త గుర్తించి ప్రోత్సహిస్తే చాలు.. సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామంటున్నారు భారత ఉద్యోగులు. ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలతో పోల్చితే ఈ ధోరణి మన దేశంలో ఎక్కువగా ఉంది. సంస్థలు ఉద్యోగుల ఆలోచనలకు ఎంత ప్రాధాన్యం ఇస్తే.. సంస్థకు అంత మేలు జరుగుతున్నట్లు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. సంస్థలు.. ఉద్యోగుల ఆలోచనలకు గుర్తింపు ఎక్కువగా ఇస్తే.. ఉత్పత్తి లేదా సంస్థల అభివృద్ధికి ఎక్కువ కష్టపడటానికి ఉద్యోగులు ఏమాత్రం వెనకడుగువేయడం లేదు. ఈ మేరకు 'సమ్మిళిత నాయకత్వం' అనే అంశంపై క్యాటలిస్ట్స్‌ రూపొందించిన ప్రపంచ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. నవ్యఆలోచనల విషయంలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్న మహిళలు 46 శాతం మంది అని తేలింది. తమను సొంతమనిషిగా సంస్థ భావించాలని కోరుకుంటున్న మహిళలు 29 శాతం మంది. ఇక పురుషుల విషయానికి వస్తే ఇది వరుసగా 82 శాతం, 61 శాతంగా ఉంది.

ఈ క్యాటలిస్ట్స్‌ సంస్థ ఆరు దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. భారత్‌, చైనా, ఆస్ట్రేలియా, జర్మనీ, మెక్సికో, అమెరికాల్లో 1500 మంది వద్ద అభిప్రాయాలు సేకరించింది. ఈ సందర్భంగా క్యాటలిస్ట్‌ ఇండియా డబ్లూఆర్సీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ షాచి ఇర్డే మాట్లాడుతూ..సంస్థలో నాయకులు, నాయకులుగా ఎదిగే అవకాశం ఉన్న వారికి సరైన నాయకత్వ లక్షణాలు అబ్బితే ఉద్యోగుల్లో సాధికారత పెంచడంతో పాటు వారి నుంచి ఫలితాలను సాధించవచ్చని వివరించారు. ఒక సంస్థల్లో ఉద్యోగులకు, వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తే.. వారు వాటి నుంచి స్ఫూర్తి పొంది మరిన్ని కొత్త ఆలోచనలు ఇవ్వడంతో పాటు వాటిని సక్రమంగా అమలు చేసేందుకు, కష్టపడి పని చేసేందుకు కూడా ముందుకు వస్తారని వివరించారు. ఇలా జరగాలంటే ముందు కార్యాలయంలో ఉద్యోగుల హితమైన వాతావరణం ఉండాలని సూచించారు. ఇలాంటి వాతావరణం వల్ల ఉద్యోగుల పనితీరులో నవ్వత చోటు చేసుకోవంతో పాటు ఫలితాలు.. ఉత్పాదకత కూడా మెరుగు అవుతాయని తెలిపారు.

ఇంట్లో పనితో అధిక ఒత్తిడి

కార్యాలయ వేళల తరువాత స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో పనికి సంబంధించిన ఈమెయిళ్లు చూడడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ఆఫీసు నుంచి వచ్చేశాక కూడా ఈమెయిళ్ల ద్వారా తరచూ కార్యాలయ పనులు చేసేవారిలో సగం మంది ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పినట్లు అమెరికాలోని ఓ సంస్థ నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది. ఆఫీసు వేళల తరువాత పనిచేయనివారిలో 36 శాతం మంది మాత్రమే ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో అమెరికాలోని 4,475మంది ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అయితే, ఇలా కార్యాలయ వేళల తరువాత మొబైల్‌ టెక్నాలజీ సహాయంతో పనిచేసేవారు తమ జీవితాలు మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. ఆఫీసు పని కోసం మొబైల్‌ టెక్నాలజీ ఉపయోగించుకోవాలని కోరుకునే సంస్థల్లో ఉన్న ఉద్యోగుల్లో 65 శాతం మంది తరచూ ఈమెయిల్‌ ఆధారిత పనులు చేస్తుండగా.. అలా కోరుకోని సంస్థల్లో ఉన్నవారిలోనూ 23 శాతం మంది ఈమెయిళ్ల సహాయంతో కార్యాలయ పనులు చక్కబెడుతున్నారట. యాజమాన్యాలు కోరుకున్నప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆఫీసు వేళల తరువాత మొబైళ్లతో పనిచేయలేదని 5 శాతం మంది చెప్పగా.. అలాకోరుకోని సంస్థల్లో పనిచేస్తున్న వారిలో 30 శాతం మంది ఆ తరహా పనికి దూరంగా ఉన్నట్లు చెప్పారు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017