భవిష్యత్‌.. ఇక సుస్థిరం

భివృద్ధి.. యువతకు ఉపాధి అవకాశాల జపం పఠించిన భాజపాకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతోంది. యువతకు ఉపాధి.. ఉద్యోగాలకు పెద్దపీట వేస్తామని ప్రధాని కానున్న మోడీ చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు ఏమేరకు ఉంటాయి.. అందిపుచ్చుకోవాలంటే ఏంచేయాలన్న అంశంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకొందాం..

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. మోడీ విజయం వల్ల దేశంలో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.. అంటున్నాయి రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించిన సంస్థలు. మోడీ విజయం జాబ్‌ మార్కెట్‌లో భారీ మార్పులు తీసుకురాగలదని ఈ సంస్థలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే ఆర్థిక ఇబ్బందులు తగ్గే అవకాశాలున్నాయి. దీంతో చాలా సంస్థలు తమ పరిధిని విస్తృతం చేయడంతో పాటు లాభాల బాటలో నడవాలని చూస్తున్నాయి. ఫలితంగా నైపుణ్యం, ప్రతిభ ఉన్నవారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి నుంచి మరో మూడు నెలల్లో రిక్రూట్‌మెంట్‌లు వూపందుకోవచ్చని వీరు సూచిస్తున్నారు. గత త్రైమాసికం నుంచి మార్కెట్‌ లాభాల బాటలో నడవడం కూడా ఇందుకు దోహదం చేస్తోందని వారు చెబుతున్నారు.
ఏబీసీ కన్సల్టంట్స్‌ అనే రిక్రూట్‌మెంట్‌ సంస్థ ఈ నెల మొదటివారంలో దేశ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలపై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 85 శాతం సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త వారిని నియమించుకోనున్నట్లు తెలిపాయి. ఈ అంశంపై ఏబీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్పందిస్తూ.. 'శుభపరిణామాలు మొదలయ్యాయి. ఇకపై నియామకాలు వూపందుకుంటాయి' అని చెబుతున్నారు.
ఆర్థిక మాంద్యానికి ముందు అంటే 2007 సంవత్సరంలో లాగా ఈ సారి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని మరికొందరు నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాక యువతకు ఉపాధి అవకాశాలు వూపందుకుంటాయని వీరు చెబుతున్నారు. మరో మూడు నుంచి ఆరు నెలల్లో దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున నియామకాలు మొదలవుతాయని సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా స్వదేశీ సంస్థలు ప్రభుత్వ నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నాయని.. ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజులకు అంటే అక్టోబరు నుంచి ఆ సంస్థలు నియామకాలు చేపడుతాయని చెబుతున్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చాక మైనింగ్‌, మెటల్స్‌, ఆరోగ్యరంగాలకు సంబంధించి త్వరగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని మొదట ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. పర్యావరణ సంబంధిత సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ శాఖ పటిష్ఠతకు పాధాన్యం ఇచ్చే విధంగా ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య పథకాలు వూపందుకుంటాయని వీటితో యువతకు ఎక్కువ ఉపాధి లభించొచ్చని విశ్లేషకుల అంచనా. కొత్త ఉద్యోగ అవకాశాలు సరే.. వాటిని అందిపుచ్చుకోవాలంటే అభ్యర్థులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలి. ఎంచుకున్న రంగంలో కొత్త పోకడలను గుర్తించి వాటిని తగినట్లు సన్నద్ధం కావాలి. తమ రంగానికి సంబంధించిన వార్తలు, ఆ రంగంలో చోటు చేసుకొంటున్న మార్పులను గమనిస్తుండాలి. దీని వల్ల ఉద్యోగానికి తగినట్లు సిద్ధం కావడంతో పాటు కావాల్సిన నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఇక విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం సాధించడంపై దృష్టిపెట్టాలి. ఇప్పుడు చివరి సంవత్సరం చదువుతున్న, పూర్తి చేసిన విద్యార్థులకు ఇది మంచి తరుణం. దీన్ని సద్వినియోగం చేసుకొంటే ఉద్యోగ అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోవచ్చు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017