ఉందిలే మంచికాలం

ద్యోగాల కోసం అన్వేషిస్తున్నవారికి ఈ ఏడాది కలిసివచ్చేలా ఉంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులను పెంచేందుకు ఎక్కువ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. హెడ్‌హోంకోస్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ దేశ వ్యాప్తంగా పలు సంస్థల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 84.1 శాతం సంస్థలు ఈ ఏడాది కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి. గతేడాది నుంచి ఆశాజనక వృద్ధి నమోదవడంతో ఈ ఏడాది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంచనా. ఇప్పటి వరకు జరిగిన వాటికి భిన్నంగా ఈ ఏడాది కొత్త నియామకాలు ఉండవచ్చని కూడా ఈ వెబ్‌సైట్‌ పేర్కొంది. కాగా కేవలం ఆరు శాతం సంస్థలే ఈ ఏడాది ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. పది శాతం సంస్థలు ఉన్న సిబ్బందితోనే సరిపెట్టుకోవాలని నిర్ణయించాయి. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలనుకొంటున్న సంస్థల్లో సగానికిపైగా అంటే 55.4 శాతం సంస్థలు పది శాతం మేర కొత్తవారిని నియమించుకుంటామని చెబుతున్నాయి. ఇక సీనియర్‌ ఉద్యోగుల విషయానికి వస్తే.. వారిని కూడా ఎక్కువ సంఖ్యలో నియమించుకోవాలని 73 శాతం సంస్థలు భావిస్తున్నాయి. హెడ్‌హోంకోస్‌ హైరింగ్‌ అవుట్‌లుక్‌ సర్వేలో భాగంగా దేశ వ్యాప్తంగా 160 సంస్థల్లో నియామకాలకు సంబంధించి సర్వే చేశారు.

ఈ తరం తీరే వేరు

అత్యధిక ఉద్యోగులు తమకు వేతన రూపంలోనే ఎక్కువ డబ్బు చేతికి అందాలని కోరుకుంటారు. ఇది ఇప్పటిమాట కాదు. తరతరాలనుంచీ కూడా ఉద్యోగులు ఇదే కోరుకుంటున్నారు. ఆయా యాజమాన్యాలు తమ తమ సిబ్బంది కోసం కల్పించే వైద్య సదుపాయాలు, పదవీ విరమణానంతర ప్రయోజనాలు, ఇతరత్రా ప్రోత్సాహకాల కంటే కూడా నెలనెలా వచ్చే జీతం డబ్బుల మొత్తమే ఎక్కువగా ఉండాలన్నది అత్యధిక ఉద్యోగుల అభీష్టమని ఓ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

తొలుత నుంచీ చాలామటుకు యాజమాన్యాలు తమ సిబ్బంది దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యనిధి, గ్రాట్యుటీ, కంపెనీ తరఫు నుంచి నివాస వసతి, ఎల్‌టీఏ, సరళమైన రుణ సదుపాయం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే, ఈ తరం ఉద్యోగులు ఎప్పుడో సంగతి ఎందుకు ఇప్పటికిప్పుడు చేతినిండా డబ్బు ఉంటే చాలు అనే దృక్పథంలో ఉన్నారు. చేతిలో పుష్కలంగా డబ్బుంటే...తమ జీవన శైలికి అనుగుణంగా తమకు నచ్చినట్లుగా బతకడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. అంతంత మొత్తాలను పీఎఫ్‌ ఇతరత్రా పథకాల్లో ఇప్పటినుంచే ఇరికించేయడం వృధా...అసలిదంతా ఎందుకు అనే వైఖరి నేటితరం ఉద్యోగుల్లో ప్రస్ఫుటమౌతోంది. ఈ ఆలోచనా వైఖరి కూడా తరాల అంతరానికి అద్దం పడుతున్నాయి.

బేబీ బూమర్‌ జనరేషన్‌గా పేర్కొంటున్న 1946-1964 మధ్య జన్మించిన ఉద్యోగులు పీఎఫ్‌, గ్రాట్యుటీ వంటి పదవీవిరమణానంతర ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. జనరేషన్‌ ఎక్స్‌గా వ్యవహరించే 1964-1980 మధ్యకాలంలో పుట్టిన వారు క్లబ్‌ సభ్యత్వాలు, కార్లు ఇతరత్రా వసతులు, విలాసాలను బాగా ఇష్టపడుతున్నారు. ఇక, అత్యంత పిన్నవయస్కులుగా పరిగణించే వై జనరేషన్‌ అంటే.... 1980-2000 మధ్యకాలంలో పుట్టిన వారు అన్ని వసతులూ సమపాళ్లలో తాము అనుభవించాలని కోరుకుంటున్నారు. కంపెనీ ఇచ్చే వైద్యవసతి అయినా...పదవీవిరమణానంతర ప్రయోజనాలైనా, ప్రస్తుతం చేతికిచ్చే వేతనమైనా..ఏదైనా సరే సమంగా తమకు అందాలని ఆకాంక్షిస్తున్నారు. తమకిచ్చే ప్రయోజనాల విషయంలో సరళమైన విధివిధానాలు, మంచి వెసులుబాట్లనే కోరుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రేపు మనది కాదు...నిన్న తిరిగి రాదు...నేడేనిజం...నేడే సుఖం అనే దృక్పథం వారిలో ప్రస్ఫుటమౌతోందని అధ్యయనం పేర్కొంది.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017