అన్వేషణ మారింది!

ప్రతిభ, నైపుణ్యాలకు తగినట్లు ఆయా రంగాలపై అవగాహన.. కొత్తగా చోటు చేసుకొంటున్న మార్పులను గుర్తిస్తే చాలు ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. మరికొద్ది రోజుల్లో పెద్దఎత్తున నియామకాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. ఇప్పటి నుంచే వాటిని అందిపుచ్చుకోవడానికి కసరత్తు చేయాలి. మునుపటిలాగా సంప్రదాయబద్ధంగా ఉద్యోగాల కోసం సిద్ధం కావడంతో పాటు కొన్ని ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకోవాలి. దీంతో వెంటనే కొలువు దక్కే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతులు ఏంటో చూద్దాం.
ఇటీవల కొన్నేళ్లలో ఉద్యోగాల కోసం అన్వేషణలో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. మారిన పరిస్థితులకు తగినట్లు ఉద్యోగాల వేట కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం మీరు మంచి ఉద్యోగం సాధించాలంటే ఇప్పటి వరకు అన్వేషించిన తీరుకన్నా ఇప్పుడు కాస్త భిన్నంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొలువులు తెచ్చిపెట్టేందుకు సామాజిక మీడియా ఒక వారధిలా మారింది. ఇక్కడ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఇది తెలిసిన విషయమే అయినా.. ప్రతిభ, నైపుణ్యాలను ఇక్కడ చక్కగా ప్రదర్శించుకోగలిగితే మీకు ఉద్యోగ అవకాశాలు రెట్టింపు అయినట్టే. పైగా మీరు సామాజిక మీడియాలో చురుగ్గా ఉండటం వల్ల రిక్రూటర్లు సైతం మిమ్మల్ని గుర్తించడం సులభమవుతుంది. ఇప్పటికైనా మీరు లింక్డ్‌ఇన్‌, ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మీడియా, ఆన్‌లైన్‌ వేదికల్లో చురుగ్గా లేకుంటే అక్కడ నైపుణ్యాలను ప్రదర్శించడం మొదలుపెట్టండి. మీరు ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసినపుడు.. సదరు సంస్థ లేదా రిక్రూటర్లు మీ ప్రతిభను తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో అన్వేషించే అవకాశం కూడా ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోండి.
గూగుల్లో ఉన్నారా..?
ఇప్పుడు రెజ్యూమె రూపు మారింది. మీ గురించిన సమస్త సమాచారం కోసం రిక్రూటర్లు ఇరత సంస్థలను ఆశ్రయించే రోజులు పోయాయి. రెజ్యూమెపై ఆధారపడటమూ తగ్గింది. ఇప్పుడు మీ సమాచారం మొత్తం గూగుల్లో లభిస్తుందని భావిస్తున్నారు. అందువల్ల మీ పేరు గూగుల్లో వెదికితే మీ గురించిన సమస్త సమాచారం అందుబాటులో ఉండేలా చూసుకోండి. ప్రతికూల, వివాదాస్పద అంశాలు లేకుండా ఉండేలా జాగ్రత్తపడాలి. ఇందుకోసం మీ పేరిట మీ నైపుణ్యాలకు తగినట్లు బ్లాగులు, వెబ్‌సైట్లు నిర్వహించొచ్చు. సామాజిక మీడియాలో చురుగ్గా ఉండొచ్చు.
ఇక నెట్‌వర్కింగ్‌ గురించి తెలిసిందే. ఇది ఎంత బలంగా ఉంటే అవకాశాలు అంతమెరుగవుతాయి. ఇప్పటి వరకు మీకు నామమాత్రంగానే నెట్‌వర్కింగ్‌ ఉంటే దాన్ని విస్తృతం చేసుకోండి. పాతమిత్రులు, క్లాస్‌మేట్స్‌, బంధువులు, పరిచయస్తుల చిట్టా తీసి ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో ఆరా తీయండి. వారితో సంబంధాలు పెంచుకోండి. దీంతో వారి ద్వారా మీకు మంచి అవకాశాలు వచ్చే వీలుంటుంది.
ఆఫీస్‌కి త్వరగా వెళ్తే..
లండన్‌: మీకు ఉద్యోగంలో పదోన్నతి కావాలా.. అయితే కార్యాలయానికి కాస్త ముందుగా వెళ్లండి. ఎందుకంటే కార్యాలయానికి త్వరగా వచ్చే వారికి పదోన్నతులు, జీతాల పెంపు అవకాశాలు ఎక్కువట. ఈ మేరకు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అలాగే కార్యాలయం నుంచి ఆలస్యంగా ఇంటికి వెళ్లే వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయట. కార్యాలయానికి ముందుకు వచ్చే ఉద్యోగులతో వారి పై అధికారులు కాస్త సానుకూలంగా ఉంటారట. కార్యాలయం నుంచి కాస్తముందుగా వెళ్లినా.. సమయానికే పని ప్రారంభించినా ఉత్పత్తిపై పెద్ద ప్రభావం లేకపోయినా.. అది ఉద్యోగుల ప్రవర్తనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందట. దీంతో పదోన్నతులు, జీతాల పెంపును కార్యాలయానికి వచ్చే, కార్యాలయం నుంచి వెళ్లే సమయాలు ప్రభావితం చేస్తాయని అధ్యయన కర్తలు చెబుతున్నారు. ఈ అధ్యయనం వివరాలను జర్నల్‌ ఆఫ్‌ అప్త్లెడ్‌ సైకాలజీ వెల్లడించింది.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017