క్లయింట్లను కట్టిపడేసే వారికే కొలువులు

పోటీ ప్రపంచంలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అధికంగా ఉన్నవారి వైపే సంస్థలు చూస్తున్నాయి. ఇలాంటి అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉండడమేకాదు ఉన్నతస్థానాలకూ త్వరగా చేరుకోగలరని నిపుణులు చెబుతున్నారు. సంస్థ నాణ్యమైన ఉత్పత్తులు చేయడంతోనే మనుగడ సాధించలేదు. వాటిని విజయవంతంగా క్లయింట్ల దగ్గరకు చేరవేయడంలోనే దాని విజయం దాగుంది. అందుకే భావవ్యక్తీకరణ ఉన్న అభ్యర్థులను ఏరికోరి మరీ సంస్థలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతమున్న వినియోగదారుల్లో 60 నుంచి 70 శాతం మంది అదే ఉత్పత్తిని వినియోగిస్తుండగా.. కొత్త వినియోగదారుల్లో కేవలం 5 నుంచి 15 శాతం మాత్రమే ఆకర్షించగలుతున్నాయని ఓ సర్వే చెబుతోంది. సంస్థ ఉత్పత్తి పట్ల సంతృప్తి చెందిన వినియోగదారుల్లో నాలుగు నుంచి ఆరు శాతం మంది ఇతరులకు చెబుతూ ప్రచారం కూడా చేస్తారని, అదే అసంతృప్తి చెందిన వినియోగదారుల్లో తొమ్మిది నుంచి 15 శాతం మంది సంస్థ ఉత్పత్తి పట్ల తామెలా అసంతృప్తికి గురయ్యామో వివరంగా ప్రచారం చేస్తారని సర్వే పేర్కొంది. వినియోగదారుడిని కోల్పోవడం కన్నా ఆకర్షించడమే కష్టమని తెలిపింది. అందుకే భావవ్యక్తీకరణ నైపుణ్యాలున్న వారినే తమ ఉద్యోగులుగా సంస్థలు ఎంచుకుంటున్నాయి. వినియోగదారులను ఆకట్టుకోవడంలో మెలకువలు తెలిసిన వారినే వృత్తి జీవితంలోకి ఆహ్వానిస్తున్నాయి.

ఉత్పత్తులను ఎక్కువ మంది వినియోగదారులకు చేరవేయడం ద్వారా పోటీ మార్కెట్‌లో సంస్థను అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం వినియోగదారులు ఆయా ఉత్పత్తుల పట్ల ఎంతో అవగాహన కలిగి ఉంటున్నారు. తమ అవసరాలకు తగినట్లుగా ఉంటున్నాయా, ఎక్కువ సొమ్ము వెచ్చించాల్సి వస్తోందా అనే దిశగా వారి ఆలోచన పరిధి పెరిగింది. అంతేకాదు వాణిజ్య ప్రక్రియలో వినియోగదారుడిదే పై చేయిగా ఉంటోంది. అందుకే వారిని ఆకర్షించడంలో సంస్థ ఉద్యోగులు పూర్తిస్థాయి నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.

* ఉత్పత్తుల విషయంలో పూర్తి అవగాహన ఉండాలి. ఉత్పత్తి గురించి మార్కెట్లో ఉన్న మంచి, చెడు అంశాలు తెలుసుకోవాలి. అన్నిరకాల ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అయితే వాటిలో ఏది సంతృప్తినిస్తుందనే విషయంలో కొంత సందిగ్ధంలో ఉంటారు. ఆ సందిగ్ధాన్ని వీడి సంస్థ ఉత్పత్తులు కోనుగోలు చేసేలా చేయాలి. వినియోగదారుడు ఎలాంటి ఉత్పత్తులు కోరుకుంటున్నాడు... మార్కెట్లో ఏయే ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి... అనే విషయాలపై కసరత్తు చేస్తుండాలి. అవసరమైతే వివిధ వర్గాలకు చెందిన వినియోగదారులను సంప్రదించాలి. వారి అలవాట్లు, ఆసక్తులు తెలుసుకోవాలి. తదనుగుణంగా సంస్థ ఉత్పత్తులు ఉన్నాయా లేవో పరిశీలించి నివేదిక బాస్‌కు పంపాలి. మార్పులు చేర్పులు ఉంటే సంస్థ తప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది.

* క్లయింటుకు సమయం కేటాయించడం ద్వారా వారిని సులభంగా ఆకట్టుకోవచ్చు. సమయానికి ఉత్పత్తులు చేరుతున్నాయా అనే అంశంతోపాటు సమస్య పరిష్కారం విషయంలో తమకెంత ప్రాధాన్యం ఇస్తోందనే విషయాన్ని వినియోగదారులు గమనిస్తుంటారు. అందుకే ఎగ్జిక్యూటివ్‌లు వినియోగదారుల్ని సంతృప్తిపరచాలి. వినియోగదారుడి ఇష్టాలు తెలుసుకొని తదనుగుణంగా వారి సమస్యను పరిష్కరించగలిగే నైపుణ్యాలు పెంచుకోవాలి.

* వినియోగదారుల్లో సంస్థ పట్ల విశ్వసనీయత పెంచడం ద్వారా లాభాలు పెరుగుతాయి. బ్రాండ్‌కు ప్రచారం లభిస్తుంది. ఈ దిశగా నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటుండాలి.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017