ఇంటర్వ్యూ పూర్తయింది. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. అయినా.. మనసులో ఏదో వెలితి. ముందస్తు ప్రణాళికతో చక్కగా సిద్ధమైనా ఆశించినంత మేరకు.. ఇంటర్వ్యూలో రాణించలేదన్న భావన. కొన్ని ప్రశ్నలకు సమాధానం సరిగ్గా తెలిసినా.. అవతలి వారికి అర్థయ్యేలా చెప్పలేకపోయామన్న ఆవేదన. ఇంటర్వ్యూలో విఫలమైన దాదాపు ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అనుభవం ఇది. అయితే చాలా మంది.. ఆ సంగతిని అక్కడికే వదిలేసి.. మరో ముఖాముఖికి సిద్ధమవుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఉద్యోగ వేటలో ప్రతి అంశాన్నీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. గత అనుభవంతో భవిష్యత్తులో చిన్న పొరపాటుకు ఆస్కారం ఇవ్వకుండా ముందుకు వెళ్లాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం
ఇంటర్వ్యూకి హాజరై ఇంటికి వచ్చిన వెంటనే.. ఒక చిన్న కాగితంపై మౌఖిక పరీక్షలో వ్యవహరించిన తీరును రాసుకోవాలి. మీ ప్రతిభకు రేటింగ్ ఇచ్చుకోవాలి. మరో ఇంటర్వ్యూకి వెళ్లేటపుడు దీన్ని ఒకసారి చదివి ఆ తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడాలి. ఇందులో భాగంగా ముఖాముఖి పూర్తయ్యాక ఒకసారి కింది ప్రశ్నలను మనసులో వేసుకొని వాటికి ఒకటి నుంచి పది వరకు రేటింగ్ ఇచ్చుకోవాలి.
* ఇంటర్వ్యూలో ఎలా వ్యహరించాను? * సంస్థ ప్రతినిధులను మొదటిసారిగా ఎలా పలకరించాను? * కార్యాలయంలో కాలుపెట్టినప్పటి నుంచి ఇంటర్వ్యూ పూర్తయ్యే దాకా హుందాగా వ్యవహరించానా? * ఆత్మవిశ్వాసంతోనే ఉన్నానా? * మాటతీరు, స్వరం ఎలా ఉంది? * అక్కడ చెప్పిన సమాధానాలు సరైనవేనా? * నా బలాల గురించి సంస్థ ప్రతినిధులకు వివరించానా? * బలహీనతల గురించి సానుకూలంగా వివరించానా?..
ఇలాంటి ప్రశ్నలకు మీ సమాధానం సంతృప్తికరంగా.. రేటింగ్ అయిదు నుంచి పది మధ్యలో ఉంటే ఇంటర్వ్యూ బాగా చేసినట్టు. అంతకన్నా తక్కువ రేటింగ్ వచ్చి ఉంటే ఆ అంశాలపై దృష్టి పెట్టాలి. తర్వాత ఇంటర్వ్యూల్లో ఆ అంశాల్లో పొరపాట్లు జరగకుండా స్నేహితులు, కుటుంబికుల సమక్షంలో కసరత్తు చేయాలి. ఇలా ప్రతిభను సమీక్షించుకొని.. లోపాలు గుర్తించి వాటిని అధిగమించేందుకు కసరత్తు చేయడం వల్ల త్వరగా విజయం సాధించొచ్చు.
ముందు నుంచీ మరీ మంచిది: ఇలాంటి సమీక్ష, రేటింగ్ కేవలం ఇంటర్వ్యూ దశ నుంచి మాత్రమే కాకుండా దరఖాస్తు దశ నుంచీ ప్రారంభిస్తే చాలా త్వరగా మంచి ఉద్యోగం సాధించే వీలుంటుంది. దరఖాస్తు పంపిన తర్వాత అందులో ఏమైనా తప్పులున్నట్లు తెలిస్తే వాటిని రాసిపెట్టుకొని అవే పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. సాంకేతిక పరీక్షల్లో చేసిన పొరపాట్లు, తెలియని అంశాలను గుర్తించి వాటిపై కసరత్తు చేయాలి. బృంద చర్చలు, ఫోన్ ఇంటర్వ్యూల్లోనూ చేసిన పొరపాట్లను, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలి. కొన్ని సార్లు దరఖాస్తు నుంచి ఇంటర్వ్యూ వరకు అన్నీ చాలా చక్కగా పూర్తి చేసినా ఉద్యోగం దొరక్కపోవచ్చు. అలాంటపుడు నిరుత్సాహం చెందడం సరికాదు. ఉద్యోగం ఇవ్వడం అనేది సంస్థ చేతిలో తప్ప మీ చేతిలో ఉండదు. కనుక వీలైనంత ఉత్తమ ప్రతిభ కనబరచడం వరకే మన కర్తవ్యం. ఆ సంస్థ లేదా ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు నిర్దేశించుకొన్న ప్రమాణాలకు చేరుకున్నామా లేదా అనేదే ముఖ్యం. చేరుకున్న తర్వాత మనకు ఉద్యోగం ఇవ్వాలా లేదా అనేది సంస్థలో డిమాండ్, ఇతరత్రా కొన్ని తెరవెనుక కారణాలపై ఆధారపడి ఉంటుంది. వాటిని మనం ప్రభావితం చేయలేం. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకుంటే.. ఆ ఉద్యోగానికి మీరు సరిపోయారా? మీకు ఆ ఉద్యోగం తగినదేనా వంటి అంశాలను సమీక్షించుకోవాలి.