ఇంటర్న్‌షిప్‌పై దృష్టి సారించండి

ప్రముఖ సంస్థలు ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం కోసం సాధారణంగా సంస్థలు క్యాంపస్‌ల నుంచి అభ్యర్థులని ఎంపిక చేస్తుంటాయి. శిక్షణ పూర్తయ్యే సరికి సంస్థలో పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోగలరా అనే కోణంలో పరిశీలించి మరీ ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు ఇచ్చే శిక్షణతో నైపుణ్యాన్ని మెరుగుపరచుకుని సంస్థను అభివృద్ధి చేయడంలో ముందుముందు కీలకపాత్ర పోషించాల్సి వస్తుంది కాబట్టి సామర్థ్యాన్ని అంచనా వేశాకే తీసుకుంటున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఇలాంటి సందర్భాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఇంటర్న్‌షిప్‌ ప్రయోజనాలు అందుకోవడానికి కళాశాలల ప్రిన్సిపల్‌లు, కరస్పాండెంట్ల ద్వారా వారు చొరవ చూపించాలి. ఇన్ఫోసిస్‌, కోకకోలా, జీహెచ్‌సీఎల్‌, పియర్సన్‌, యస్‌ బ్యాంక్‌, ఫారేసియా, బ్రాండ్స్‌ ఆఫ్‌ డిజైర్‌ తదితర సంస్థలు ఇంటర్న్‌షిప్‌లపై ఇటీవల కాలంలో ప్రధానంగా దృష్టి సారించాయి.

''ఏటా కొంత మందికి ఇలాంటి శిక్షణ ఇవ్వడం వల్ల వృత్తి పరంగా ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సులభంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది.'' అని కోకకోలా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌(హెచ్‌ ఆర్‌) సమీర్‌ వాధవన్‌ అంటున్నారు. కోకకోలా ఇండియా ఫ్రాంచైజీలకు చెందిన బాట్లింగ్‌ భాగస్వాములు కోకకోలా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈగల్స్‌ అనే సామర్ధ్య పెంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. ఆరునెలల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో సాంకేతికపరమైన అంశాలతోపాటు పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పనితీరు, శిక్షణ, ఫీడ్‌బ్యాక్‌ వంటివి ఉంటాయి. క్యాంపస్‌ల నుంచి ఎన్నుకున్న అభ్యర్థులకు మంత్రా అనే సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎనిమిది వారాలపాటు నిర్వహించే దీంట్లో దేశంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌కి చెందిన వారితో శిక్షణ ఇస్తున్నారు.
ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన అండర్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ విద్యార్థులకు ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్‌ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఇన్‌స్టెప్‌ అనే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సంస్థకు చెందిన కీలక ప్రాజెక్టుల నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా 100 విశ్వవిద్యాలయాలు, బిజినెస్‌ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులను ఈ ఇన్‌స్టెప్‌ పోగ్రామ్‌కు ఎంపిక చేసుకుంటోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 40 దేశాలకు చెందిన 160 మందిని ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేసింది. వాహనాల లోపల భాగం అలంకరణలు ఉత్పత్తి చేసే ఫారేసియా అనే ఫ్రెంచ్‌ సంస్థ కూడా ఏటా 50 మందిని ఎంపిక చేసుకొని 'ఇన్‌బిల్ట్‌ గ్రూమ్‌' అని ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు నిర్వహించడానికి కారణం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇప్పటి నుంచే పెద్ద సంఖ్యలో నైపుణ్యవంతుల్ని తయారుచేయడానికేనని నిపుణులు చెబుతున్నారు.
''ఇంటర్న్‌షిప్‌ పూర్తయిన తర్వాత 80 కన్నా ఎక్కువ శాతం మందిని సంస్థలోకి తీసుకుంటున్నాం. శిక్షణ తర్వాత పూర్తిస్థాయి నైపుణ్యం సాధించిన వారిని గుర్తిస్తాం. సంస్థ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు రాణించిన వారిని ఎంపిక చేస్తాం'' అని జీహెచ్‌సీఎల్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెచ్‌ఆర్‌ హెడ్‌ రాజేశ్‌ త్రిపాఠి తెలిపారు.
సరైన ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాల ద్వారా సంస్థలో నైపుణాభివృద్ధికి మార్గం ఏర్పరచొచ్చని ఆసియాలోని ప్రముఖ బ్రాండ్‌ కన్సల్టెన్సీ అయిన బ్రాండ్స్‌ ఆప్‌ డిజైర్‌ సీఈఓ సౌరభ్‌ ఉబోవేజా పేర్కొన్నారు. ఐఐఎం వంటి సంస్థలకు చెందిన వారిని ఇంటర్న్‌షిప్‌లకు ఎంపిక చేస్తున్నామన్నారు. యస్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పేరిట యస్‌బ్యాంక్‌ కూడా ఇంటర్న్‌షిప్‌ నిర్వహిస్తోంది. దేశంలోని ప్రముఖ బీ స్కూల్స్‌తోపాటు ఎంపిక చేసిన విదేశీ యూనివర్సిటీ విద్యార్థులకు అవకాశమిస్తోంది. అభ్యసన పరిష్కారాల దిగ్గజ సంస్థ పియర్సన్‌ కూడా ముఖ్య ఇన్‌స్టిట్యూషన్లకు చెందిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తోంది.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017