చూడగానే ఆకట్టుకోవాలి

రెజ్యూమె.. దీన్ని రూపొందించడం ఒక కళ. మీ రెజ్యూమె మీకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాలి. అలా కాకుండా నెట్‌లోనో.. లేక మరెక్కడో చూసో.. ఇతరుల సాయంతోనో దీన్ని ఏదో ఒకలాగా రూపొందిస్తే మీకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇది పక్కాగా ఉంటేనే మీకు అవకాశాలు మెరుగవుతాయి. పైగా రెజ్యూమె రాసే విధానం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అయినా కొన్ని ప్రాథమిక అంశాలను మాత్రం తప్పక అనుసరించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..
* రెజ్యూమెను సిద్ధం చేసే ముందుకు మీరు దరఖాస్తు చేయనున్న ఉద్యోగానికి సంబంధించిన సమస్త వివరాలను తెలుసుకోవాలి. ఏ సంస్థలో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారు.. సదరు ఉద్యోగం తీరు ఎలా ఉంటుందో అవగాహన కలిగి ఉండాలి.
* ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటో ముందుగా ఆరా తీసి వాటిని ఒక జాబితాగా చేయాలి. తర్వాత మీలో ఉన్న అర్హతలను మరో జాబితాగా రాసుకోవాలి. ఆ రెండింటినీ సరిపోల్చి ఉద్యోగానికి సరిపడే అర్హతలు, నైపుణ్యాలను గుర్తించి వాటిని రెజ్యూమెలో పేర్కొనాలి.
* ఒకవేళ మీకు ఆ కొలువు ఇస్తే ఎలా రాణిస్తారో సంక్షిప్తంగా చెప్పగలగాలి. మీరు గతంలో ఉద్యోగం చేసి ఉంటే ఆ ఉద్యోగంలో మీరు సాధించిన విజయాలు వివరించాలి. వీటితో పాటు సదరు ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, నైపుణ్యాలు వెల్లడించడం మరవద్దు. మొత్తానికి రెజ్యూమె చూడగానే అందులో విషయం అర్థం అయిపోవాలి.
* ఆన్‌లైన్‌ రెజ్యూమె అయితే మీ అర్హతలు, నైపుణ్యాలు, ఆశిస్తున్న ఉద్యోగానికి సంబంధించిన 'కీ వర్డ్స్‌'ను అందులో పొందుపరచాలి. దీని వల్ల రిక్రూటర్లు మీ రెజ్యూమెను గుర్తించడం సులభమవుతుంది.
ఇవి చేయొద్దు
* కవర్‌లెటర్‌ చేర్చకపోవడం
* అన్ని ఉద్యోగాలకు ఒకే రెజ్యూమె పంపడం
* రెజ్యూమెలో ఛాయాచిత్రాలు
* ఉద్యోగ అనుభవాలను వివరంగా చెప్పకుండా సంక్షిప్తీకరించడం
* అక్షర, వ్యాకరణ దోషాలు, అన్వయ దోషాలు
* సంకేతపదాలు, సంక్షిప్త రూప పదాలు, సాంకేతిక పదాలు

ప్రతిభ లేమి

ఒకవైపు దేశంలో తమకు సరిపడా ఉద్యోగాలు దొరకడం లేదని యువత భావిస్తోంటే.. మరోవైపు తమకు సరిపడా ప్రతిభావంతులు దొరకడం లేదని కంపెనీలు పేర్కొంటున్నాయి. భారత్‌లో ఆర్థిక, ఐటీ తదితర రంగాల్లో 64 శాతం కంపెనీలు తమకు కావాల్సిన నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దొరక్క సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. మ్యాన్‌పవర్‌గ్రూప్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 36 శాతం కంపెనీలు నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయి. భారత్‌లో తగిన అభ్యర్థులు దొరకకపోవడంతో అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, ఐటీ ఉద్యోగులు, సేల్స్‌ మేనేజర్లు తదితర ఖాళీలను భర్తీ చేసేందుకు చాలా సంస్థలు కష్టపడుతున్నాయి. ఈ సందర్భంగా మ్యాన్‌పవర్‌గ్రూప్‌ ఎండీ ఏజీ రావు మాట్లాడుతూ.. అకౌంటెంట్లు, ఆడిటర్లు, ఖర్చులు తగ్గించుకొనేందుకు సలహాలు ఇచ్చే వారి కొరత ఎక్కువగా ఉందని వివరించారు. ప్రస్తుతం అంతర్జాలం అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ సేవలు విస్తృతమవుతున్నాయని.. దానికి తగినట్లు ఐటీ నిపుణుల డిమాండ్‌ కూడా పెరుగుతోందని తెలిపారు. ఇవే కాకుండా ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, మేనేజ్‌మెంట్‌/ఎగ్జిక్యూటివ్‌, పీఆర్‌వోలు, మార్కెటింగ్‌, లీగల్‌, సాంకేతిక రంగాల్లో కూడా సిబ్బంది కొరత ఉన్నట్లు మ్యాన్‌పవర్‌ సర్వే తెలిపింది. జపాన్‌లో అత్యధికంగా 81 శాతం కంపెనీలు నిపుణుల లేమితో ఇబ్బందిపడుతున్నాయి.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017