ఏ రంగాన్ని ఎంచుకుంటారు?

వృత్తి జీవితంలో అడుగుపెట్టాలన్న వారికి మార్కెట్‌లో అనేక అవకాశాలు కన్పిస్తుంటాయి. ఏ రంగంలోకి వెళ్లాలి... ఆయా రంగాల్లో అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై పలు రకాలుగా సందేహాలు వస్తుంటాయి. ఏ రంగాన్ని ఎంచుకోవాలి... అందులో భవిష్యత్తు బాగుంటుందా.. ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది అనే అంశాలపై అవగాహన ఉంటే సులభంగా భవిష్యత్తుని మలచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రస్తుతం ఐదు రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడయింది.
సంస్థ నిర్వహించిన సర్వేలో తొలి స్థానంలో ఐటీ నిలిచింది. తర్వాత బీపీఓ/కాల్‌సెంటర్ దక్కించుకుంది. పలు సంస్థలు అభ్యర్థులు ఎంచుకోవడంలో నియామక సంస్థల వైపు చూస్తుండడంతో ఆ రంగంలోనూ అవకాశాలు విపరీతంగా ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. బ్యాంకింగ్, మెడికల్/ఫార్మా రంగాలు కూడా అర్హత కలిగిన అభ్యర్థులను అన్వేషిస్తున్నాయి.
ఐటీ రంగం: ఉద్యోగావకాశాల్లో ఐటీ రంగం తన హవా కొనసాగిస్తోంది. తాజా గ్రాడ్యుయేట్లకు ఈ రంగం అనేక అవకాశాల కల్పిస్తోంది. ఇటీ రంగంలోని ప్రముఖ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఐబీఎం, టెక్ మహీంద్ర, క్యాప్‌జెమిని, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తదితర సంస్థలు ఈ ఏడాది తాజా గ్రాడ్యుయేట్లను ఆహ్వానిస్తున్నాయి. టీసీఎస్ ఇప్పటికే 25వేల మంది తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశమిచ్చింది. 2015 మార్చికల్లా మరో 25 వేలమందిని తీసుకొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 16వేల మందిని తీసుకున్నట్లు సర్వే పేర్కొంది.
బీపీఓ/కాల్ సెంటర్: తాజా గ్రాడ్యుయేట్లకు అత్యధిక అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో బీపీఓ /కాల్‌సెంటర్ కూడా ఒకటి. క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో బీపీఓ, కాన్సెంట్రిక్ఇండియా, ఎక్సెల్ సర్వీసెస్, కన్వెర్జీస్ తదితర ప్రముఖ సంస్థలు ఎప్పటికప్పుడు తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశాలిస్తున్నాయి. భావ వ్యక్తీకరణ, వృత్తి పట్ల అంకితభావం, కావాల్సిన అర్హతలు పరిశీలించి యువతను వృత్తి జీవితంలోకి ఆహ్వానిస్తున్నాయి.
నియామక సేవలు: వృత్తి జీవితంలో అడుగుపెట్టేవారికి, సంస్థలకు మధ్య వారధిలా పనిచేసే నియామక సంస్థల్లోనూ అవకాశాల కోకొల్లలు. నియామకాల విషయంలో చాలా సంస్థలు వీటిపై అధారపడడం వల్ల ఈ రంగంలోనూ అవకాశాలు బాగున్నాయని సర్వే తెలిపింది. ఇటీవల కాలంలో ఈ రంగంలోనూ వందలాది చిన్న చిన్న సంస్థలు కూడా తమ సేవలు విస్తృతం చేశాయి. తాజా గ్రాడ్యుయేట్ల నైపుణ్యాలను పరిశీలించి అనంతరం వారి భవిష్యత్తుకి బాటలు వేస్తున్నాయి.
మెడికల్, ఫార్మా: అధిక సంఖ్యలో తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశాలిచ్చే రంగాల్లో ఇది కూడా ఒకటి. మెడికల్ కోడర్స్, మెడికల్ రిప్రజెంటేటివ్‌లుగా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఏ రంగానికి చెందిన గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ మెడికల్ ట్రాన్స్‌కిప్ట్‌లో అవకాశాలు వస్తున్నాయి. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, సేల్స్, మార్కెటింగ్ వ్యవహారాల్లో అవకాశాలు బాగా పెరుగుతున్నాయని సర్వే చెబుతోంది.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో క్లరికల్, ప్రాథమిక స్థాయి అధికారులకు ఇటీవల డిమాండు విపరీతంగా పెరిగింది. ఎక్కువ మందికి ఉద్యోగాలిచ్చిన వాటిల్లో ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ, పైవ్రేటులో ఐసీఐసీఐ బ్యాంకులు ముందున్నాయి. ఓ అకాడమీ చెప్పిన వివరాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 70వేలు, ప్రైవేటు రంగ బ్యాంకులు 40వేల మందికి అవకాశాలు ఇచ్చాయి.త్వరలో టైర్ 2, 3, 4 పట్టణాల్లో కొత్త బ్యాంకులు వస్తుండడంతో ఈ రంగానికి డిమాండు మరీ పెరిగింది. బీమా రంగం మార్కెట్‌లో ఎల్ఐసీ కీలకపాత్ర పోషిస్తోంది. తాజాగా పెద్ద సంఖ్యలో అధికారులు, ఏజెంట్లను నియమించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లు కూడా ఈ రంగంలో ఆఫర్లు బాగానే ఇస్తున్నాయి.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017