ఐటీ అంటే కోడింగ్‌ ఒక్కటే కాదు

టీ.. ఈ పేరు వింటే చాలు.. ఇది ప్రోగ్రామింగ్‌.. కోడింగ్‌లకు మాత్రమే సంబంధించిందని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ పరిశ్రమలో ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ కీలకమే. ఇవే కాకుండా ఇతరత్రా ఉద్యోగాలూ ఇక్కడ ఉంటాయి. ఈ ఇతరత్రా ఉద్యోగాలను బీటెక్‌ చదివిన వారితో పాటు ఇతరులూ కాస్త అవగాహన, అన్వేషణతో వీటిని సాధించవచ్చు. అవేంటో.. అదెలాగో చూద్దాం..
ఏ ఐటీ సంస్థలో అయినా ప్రధానంగా జరిగేది వ్యాపారమే. ఏ ప్రాజెక్ట్‌ చేసినా లాభం కోసమే. కనుక ప్రతి ఐటీ సంస్థలోనూ బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌, సేల్స్‌ విభాగాలు తప్పకుండా ఉంటాయి. ఇందులో పని చేసే వారికి కోడింగ్‌ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. వ్యాపార మెలకువలు.. చక్కని భావవ్యక్తీకరణ నైపుణ్యం ఉంటే చాలు. ఇలాంటి వారికి ఐటీ సంస్థల్లో కార్పొరేట్‌ మార్కెటింగ్‌, సేల్స్‌, సేల్స్‌ సపోర్ట్‌, క్త్లెంట్‌ మేనేజ్‌మెంట్‌, అకౌంట్‌ మేనేజర్‌ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎంబీఏ, అకౌంటెన్సీ తదితర కోర్సులు చదివిన వారైతే కొంచెం కష్టపడితే ఐటీ సంస్థల్లో మంచి ఉద్యోగాలను సాధించవచ్చంటున్నారు నిపుణులు. హెచ్‌ఆర్‌ విభాగమూ అంతే. దాదాపు ప్రతి సంస్థలోనూ ఉంటుంది. ఇక్కడా సంస్థలో సిబ్బంది నిర్వహణకు సంబంధించి చాలా ఉద్యోగాలు ఉంటాయి. ఇవే కాకుండా బిజినెస్‌ అనాలిసిస్‌, కన్సల్టింగ్‌, టెక్నాలజీ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్రాజెక్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లోనూ ఉద్యోగాలు సాధించవచ్చు. అడ్మినిస్ట్రేషన్‌, ఫైనాన్స్‌, నెట్‌వర్క్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ, విభాగాల్లోనూ మంచి ఉద్యోగాలు సాధ్యమే. ఏ సంస్థ తీసుకొన్నా అక్కడ ఉద్యోగాలు.. ఆ సంస్థ నిర్మాణం దాదాపు ఇలాగే ఉంటాయి. కాకుంటే ఆ సంస్థ పని తీరు, ఆయా రంగాల పట్ల కాస్తంత అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఆయా సంస్థల్లో ఉద్యోగాలు లభించే వీలుంటుంది.
ఏ సంస్థలో అయినా ఉద్యోగం దక్కాలంటే.. మీ ప్రతిభ, నైపుణ్యం అర్హతలకు తగినట్లు అక్కడ ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయో ముందు గుర్తించాలి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలు అక్కడ ఉంటే ఆయా సంస్థల ప్రధాన వ్యాపారం, పనితీరుకు సంబంధించి అవగాహన పెంచుకోవాలి. ఇలా అవగాహన కలిగిన తర్వాత ఆయా సంస్థల్లో మీకు తగిన ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తు పంపేటపుడు మీకు ఆయా రంగాలపై ఉన్న అవగాహన, ఆసక్తిని రెజ్యూమె, సీవీల్లో రిక్రూటర్లకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఐటీ సంస్థల్లో.. ఐటీ ఆధారిత ఉద్యోగాలతో పోల్చితే ఇతర ఉద్యోగాలకు సంబంధించి భారీఎత్తున ప్రకటనలు ఉండకపోవచ్చు. అందువల్ల వాటిని మీరంతట మీరే గుర్తించాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో అన్వేషణ చేయాలి. ఆయా సంస్థలు తమ వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఈమెయిల్‌కి మీ వివరాలతో కూడిన రెజ్యూమెను పంపవచ్చు. దీని వల్ల వారికి మీ అవసరం ఉన్నప్పుడు మిమ్నల్ని సంప్రదించే వీలుంటుంది. సంస్థకు కావాల్సిన నైపుణ్యాలు ఉంటే మీకు వెంటనే కొలువు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇప్పటిదాకా మీరు ఎంచుకున్న సంస్థల్లోనే కాకుండా ఇతర సంస్థల వైపు కూడా దృష్టిసారించండి. మీకు ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగ అవకాశం వస్తే.. జీత భత్యాల గురించి ఆలోచించకుండా వెంటనే చేరిపోండి. అక్కడ పని చేస్తూ మీ కలల కొలువును సాధించేందుకు ప్రయత్నించవచ్చు. ఇక్కడి అనుభవమూ ఒక్కోసారి బాగా పనికిరావొచ్చు కూడా.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017