అవాస్తవాలు వద్దు

రెజ్యూమె.. ఇది మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం. మీ ప్రతిభ, నైపుణ్యాలు, విద్యార్హతలు, అనుభవానికి దర్పణం. ఉద్యోగ అన్వేషణలో చాలా కీలకం. అయినా కొంత మంది రెజ్యూమెలో అవాస్తవాలు ప్రస్తావించి లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి అందివచ్చిన ఉద్యోగ అవకాశాలను చేజార్చుకొంటున్నారు. అందువల్ల రెజ్యూమెలో ఎప్పుడూ అవాస్తవాలను ప్రస్తావించకూడదు. ఒకవేళ ప్రస్తావిస్తే చాలా నష్టపోవాల్సి ఉటుంది.
రెజ్యూమెలో ప్రస్తావించిన అంశాలను ఎవరు తనిఖీ చేస్తారులే.. అని చాలా మంది అవాస్తవాలు, అతిశయోక్తులు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది తప్పు. మీరు రెజ్యూమెలో పేర్కొన్న విషయాలు సరైనవో కావో ప్రస్తుతం సులభంగా గుర్తుపట్టేయవచ్చు. అంతర్జాలం, సామాజిక అనుసంధాన వేదికలు, ఇతరత్రా మార్గాల్లో ఒక రెజ్యూమెను కొన్ని నిముషాల్లోనే తనిఖీ చేసేయవచ్చు. ప్రస్తుతం రిక్రూటర్లు/సంస్థలు కేవలం రెజ్యూమెను మాత్రమే ఆధారం చేసుకొని అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలవడం లేదు. ఆయా అభ్యర్థుల గురించి లింక్డ్‌ఇన్‌, సామాజిక మాధ్యమాలు, ఇతర అంతర్జాల వేదికలపై ఆరా తీస్తున్నారు. అక్కడ లభించే సమాచారం, రెజ్యూమెలో పేర్కొన్న విషయాలకు వైరుధ్యం ఉంటే అలాంటి వారిని పక్కన పెట్టేస్తున్నారు.
ఒకవేళ తప్పుడు సమాచారంతో ఉద్యోగం సాధించినా.. ఆ కొలువుకు తగిన ప్రతిభ, నైపుణ్యాలు లేకుంటే ఎక్కువ కాలం పాటు కొనసాగడం కష్టమవుతుంది. ఒకవేళ కొనసాగినా గతంలో పేర్కొన్న నైపుణ్యాలు, ప్రతిభ ప్రదర్శించకుంటే ఉన్నతాధికారులు విరుచుకుపడటం ఖాయం. దీంతో సదరు ఉద్యోగం చేసినన్ని రోజులు మోసం చేసి ఉద్యోగం సంపాదించామన్న భావన, ఒత్తిడి వెంటాడుతూనే ఉంటాయి. దీన్ని భరించడంకన్నా ఆదిలోనే నిజాయతీగా వ్యవహరించి నైపుణ్యాలకు తగిన ఉద్యోగం సంపాదించుకోవడం ఉత్తమం.
ఒక్కోసారి రెజ్యూమెలో పేర్కొన్న ఒక్క అబద్ధం జీవితానే ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. తప్పుడు సమాచారంతో ఉద్యోగం సాధించి తర్వాత కోల్పోతే.. మరో ఉద్యోగానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్పుడు రిక్రూటర్లు గతంలో ఉద్యోగం ఎందుకు మానేశారని అడుగుతారు. తప్పుడు సమాచారంతో ఉద్యోగం సాధించాను అందువల్ల దాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఇక్కడ చెప్పలేరు. ఫలితంగా మరో అబద్ధం చేపాల్సి ఉంటుంది. రిక్రూటర్లు మీరు గతంలో పని చేసిన సంస్థను సంప్రదిస్తే మీరు తప్పుడు సమాచారం ఇచ్చారన్న వాస్తవం తెలిసే వీలుంటుంది. దీంతో మీకు ఉద్యోగ అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి.
కొంత మంది తాము గతంలో ఎలాంటి ప్రాజెక్ట్‌లు చేయకున్నా ఇతరులు చేసిన ప్రాజెక్ట్‌లను తాము చేసినట్లు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది సరికాదు. వీటికి బదులు మీరు సాధించిన విజయాలను ప్రస్తావించవచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రశ్నలు తలెత్తితే దొరికిపోయే అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్‌ చేయలేదు కనుక అందులో లోతుపాతుల గురించి తెలిసే అవకాశం ఉండదు. అందువల్ల ఎప్పుడూ చేయని ప్రాజెక్ట్‌లను రెజ్యూమెల్లో ప్రస్తావించవద్దు.
గతంలో అందుకున్న జీతం విషయానికి వచ్చే సరికి చాలా మంది అభ్యర్థులు కాస్త ఎక్కువ చేసి చెబుతుంటారు. ఇది సరికాదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ప్రతి సంస్థా గతంలో జీతం తాలూకు విషయాలను నిర్ధరించుకొనేందుకు 'ఫాం 16' (ఆదాయ పన్ను చెల్లింపు వివరాల పత్రం)ను అడుగుతున్నాయి. జీతాన్ని ఎక్కువ చేసి చెబితే ఫాం 16ని తనిఖీ చేసినపుడు దొరికిపోయే వీలుంటుంది.
ముగ్గురిలో ఒకరు ఇంతే..!
ఇటీవల హైర్‌రైట్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ రిక్రూటర్ల వద్ద ఒక సర్వే నిర్వహించగా.. 34 శాతం మంది అభ్యర్థులు తమ రెజ్యూమెల్లో అబద్ధాలాడుతున్నట్లు తేలింది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు అవాస్తవాలు చెబుతున్నారు.
ఎక్కువ అబద్ధాలు ఇక్కడే
* విద్యార్హతలు బీ ఉద్యోగంలో చేరిన తేదీలు
* ఉద్యోగాల పేర్లు
* సాంకేతిక నైపుణ్యాలు
* ఉద్యోగ అనుభవం


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017