విజేతల తీరే వేరు

హోద్యోగో.. సహచరుడో.. గొప్ప విజయాన్ని సాధిస్తే.. ఆయన అదృష్టం బాగుంది. అందువల్లే ఆయనకు ఆ విజయం దక్కిందని చాలా మంది భావిస్తూ ఉంటారు. లేకుంటే ఏదో కొన్ని అంశాలు కలిసిరావడం వల్ల ఆయన గొప్పవారయ్యారని అనుకుంటారు. ఇది సరికాదు. ఎందుకంటే విజయం కేవలం అదృష్టం వల్ల మాత్రమే దక్కదు. దాని వెనుక గొప్ప కృషి ఉంటుంది. మరికొన్ని కారణాలూ విజయానికి దోహదం చేసి ఉంటాయి. విజయసాధకులు నిరంతరం కొన్ని అంశాలను పాటిస్తూ ఉంటారు. జయాపజయాలను పట్టించుకోకుండా తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వాటిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ అంశాలు ఏంటో చూద్దాం..
సాధారణంగా ఎక్కువ మంది ఉద్యోగులు సంస్థ కోసం..
జీతం కోసం పని చేస్తున్నట్లు భావిస్తారు. కేటాయించిన విధులను ఏదో ఒక విధంగా పూర్తి చేస్తూ ఉంటారు. కాని విజయసాధకులు అలా చేయరు. సంస్థ పట్టించుకోకున్నా.. ఉన్నతాధికారి పర్యవేక్షించకున్నా.. తాము నిర్వర్తిస్తున్న విధులకు సంబంధించి సొంతంగా కొన్ని ప్రమాణాలను.. లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. సంస్థ కోసమే పని చేస్తున్నామని కాకుండా విధులను తమ సొంత పనులుగా భావిస్తూ సకాలంలో పూర్తి చేసుకొంటూ.. లక్ష్యాలను అందుకొంటూ ముందుకు వెళ్తారు. అందరూ అన్ని వేళలా ఈ ధోరణిని అనుసరిస్తే.. వృత్తి జీవితంలో విజయం తప్పక వరిస్తుంది.
వృత్తిలో ప్రతి అంశంపట్లా స్పష్టత ఉండాలి.
ఏ విషయంలో అయినా స్పష్టత లోపిస్తే.. చేస్తున్న పనిని సజావుగా ముగించలేరు. ఎక్కువ మంది స్పష్టత, చక్కని భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. విజయం సాధించాలంటే ఈ రెండు కూడా ముఖ్యమే. స్పష్టతతో ఉంటే పనిని ఫలవంతంగా పూర్తి చేయడంతో పాటు ఇచ్చిన పనిని ఇతరులూ పక్కాగా పూర్తి చేసేలా సహకరించవచ్చు.
విజేతలు ఎప్పుడూ విమర్శలను సానుకూలంగా తీసుకొంటారు.
తాము పనిని ఎలా పూర్తి చేసినా దానికి సంబంధించిన వ్యక్తుల వద్ద పనీతీరుకు సంబంధించి అబిప్రాయాలను అడిగి తెలుసుకొంటారు. ఆ అభిప్రాయాల మేరకు ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకుంటారు. కానీ ఎక్కువ మంది ఇలా చేయరు. తాము చేసిందే పని.. అన్నట్లు నడుచుకొంటూ ఉంటారు. ఈ పద్ధతి సరికాదు.
మంచి ఉద్యోగులు ఎప్పుడూ సమయపాలనను పాటిస్తూ ఉంటారు.
ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతూ ఉంటారు. స్వలాభాపేక్ష లేకుండా తోటి ఉద్యోగులకు విధుల్లో చేతనైన సాయం చేస్తారు. కానీ ఎక్కువ మంది ఇలా కాకుండా తమ పనులు సజావుగా పూర్తి చేయకుండా.. రకరకాలుగా ఇతరుల సమయాన్ని హరించి వేస్తూ ఉంటారు. సమయం విలువ తెలిసిన విజేతలు ఎప్పుడూ తమ సమయాన్ని, ఇతరుల సమయాన్ని వృథా చేయరు.
సంస్థలు ఉద్యోగుల్లో ప్రతిభ, నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు వీలుగా అప్పుడప్పుడు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉంటాయి.
వీటిని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. మంచి ఉద్యోగులు వీటికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. కొత్త విషయాలను నేర్చుకొనేందుకు నిరంతరం ఆసక్తి చూపుతూ ఉంటారు. కొన్నాళ్లకు ఇతర ఉద్యోగులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటే.. విజేతలు మంచి నైపుణ్యాలతో చాలా ముందుకు వెళ్లిపోయి ఉంటారు.
జీవితంలో విలువలు చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రతి వృత్తికీ కొన్ని విలువలు ఉంటాయి.
వాటిని తప్పకుండా పాటించాలి. కార్యాలయంలో ఇష్టం వచ్చినటుల వ్యవహరించడం, సహోద్యోగులను ఏరకంగానూ ఇబ్బంది పెట్టడం సరికాదు. విజేతలు నిత్యం వృత్తి, వ్యక్తిగత విలువలకు కట్టుబడి ఉంటారు. సాధ్యమైనంత వరకు సంస్థలో ఎవరికీ ఏ ఇబ్బందీ సృష్టించక అవసరమైతే సాయం చేస్తూ తమ పనులను తాము చేసుకొంటూ దూసుకెళ్తారు. అందువల్ల విజేతగా ఎదగాలంటే ఏవో కొన్ని సందర్భాల్లోనే కాకుండా నిత్యం పనిలో ఉన్నత విలువలను పాటిస్తూ శక్తివంచన లేకుండా కృషి చేస్తూ.. అందరికీ ఆమోదయోగ్యంగా ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తూ ఉండాలి.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017