కొలువులో ఖుషీ

ద్యోగులంతా మనస్ఫూర్తిగానే పని చేస్తున్నారా?చేస్తున్న పనిలో అందరికీ సంతృప్తి లభిస్తోందా?పనిని ఆస్వాదించే వారు ఎందరు?ఉద్యోగాన్ని భారంగా భావిస్తున్న వారు ఎవరు?కార్యాలయంలో ఎవరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?సమాధానం తెలుసుకోవాలంటే ఉద్యోగాలకు చెందిన వెబ్‌సైట్‌ కెరీర్‌ బిల్డర్‌ ఇటీవల దేశంలోని ఉద్యోగులపై నిర్వహించిన సర్వే వివరాలు తెలుసుకోవాల్సిందే..

కెరీర్‌ బిల్డర్‌ ''అవుట్‌లుక్‌ ఫర్‌ జాబ్స్‌'' పేరిట భారత్‌లోని ఉద్యోగులపై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 18 నుంచి 70 ఏళ్ల వయస్సున్న వారు పాల్గొన్నారు. వీరిలో పురుషులు 51 శాతం మంది ఉండగా మహిళలు 49 శాతం మంది ఉన్నారు. విధుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఉద్యోగం, కార్యాలయాల్లో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు.. పనిలో సంతృప్తి ఏమేరకు ఉంది.. వంటి అంశాలపై వారిని ప్రశ్నలు అడిగారు. వారు వెల్లడించిన సమాధానాల ఆధారంగా ఒక నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం..

దేశంలోని ఉద్యోగుల్లో ఎక్కువ మంది తాము చేస్తున్న పనిలో సంతృప్తిపొందుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 22 శాతం మంది అత్యధిక సంతృప్తి వ్యక్తం చేయగా 56 శాతం మంది తాము సంతృప్తిగానే ఉన్నామని చెబుతున్నారు. అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు (76 శాతం మంది) సంతృప్తిగానే ఉన్నారు. తక్కిన 24 శాతం మందిలోనూ ఆరు శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేయగా 18 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

ఇవీ సంతృప్తికి కారణాలు

మంచి ఉదోగ్యం, వృత్తిగత- వ్యక్తిగత జీవితాల సమతౌల్యం, జీతం, సంస్థ ఇచ్చే విలువ తదితరాలు ఎక్కువ సంతృప్తికి కారణాలుగా ఉంటున్నాయి. ఉన్నతాధికారులు, జీతం, సవాళ్లు, సహోద్యోగులు, పని ఒత్తిడి తదితరాలు పనిలో ఆనందంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇవి ఎంత సానుకూల ప్రభావాన్ని చూపితే ఉద్యోగులు పనిపై అంత ఆనందాన్ని, ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక అసంతృప్తికి గురవుతున్న అతికొద్ది మంది విషయానికి వస్తే.. సంస్థ తమను సరిగ్గా పట్టించుకోకపోవడం.. పనికి తగిన వేతనం లభించడం లేదని భావిస్తూ.. పనిపై నిరాసక్తతకు గురవుతున్నారు. ఇక వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్య విషయానికి వస్తే ఎక్కువ మంది అంటే 69 శాతం మంది స్పష్టంగా పాటిస్తున్నారు. తక్కిన వారిలో అయిదు శాతం మంది మాత్రమే ఈ విషయంలో కాస్త గందరగోళానికి గురవుతున్నారు.

ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి ఉన్నా కొత్త ఉద్యోగాలను కోరుకుంటున్న వారూ ఉన్నారు. 45 శాతం మంది.. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగుతామని పేర్కొంటున్నారు. మంచి కార్యాలయం, వీలైనప్పుడు పని చేసుకొనేలా కార్యాలయ వేళలు ఉండటం, నేర్చుకొనేందుకు, వృత్తిగతంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉంటే సదరు సంస్థల్లో పని చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ తాము పని చేస్తున్న సంస్థ ఇలాంటి వసతులు కల్పిస్తే.. ఇక్కడే కొనసాగుతామని స్పష్టం చేస్తున్నారు. జీతం కోసమే ఉద్యోగం మారాలనుకొంటున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. కేవలం ఏడు శాతం మందే అధిక జీతానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

వాస్తవానికి సంతృప్తి అనేది పనిపై మనకున్న మన ఆసక్తిని, నైపుణ్యాలను బట్టి ఉంటుంది. పనిపై అమితాసక్తి ఉంటే కష్టమైనా.. పనిలో ఒత్తిడి ఉన్నా.. దాన్ని విజయవంతంగా పూర్తి చేసినపుడు కలిగే ఆనందమే వేరు. అదే పనిలో సంతృప్తి పాళ్లను పెంచుతుంది. అలా కాకుండా పనిపై ఇష్టం లేకుంటే కార్యాలయం, సహోద్యోగులు, జీతం, ఇతర అంశాలు ఎంత సానుకూలంగా ఉన్నా పని పట్ల ఆనందం, సంతృప్తి ఉండవు. కనుక ఏ ఉద్యోగం చేస్తున్నా.. ఆసక్తి పెంచుకొని సానుకూలంగా ముందుకు వెళ్తే.. ఆ పనిలో సంతృప్తి తప్పక లభిస్తుంది.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017