కొలువొచ్చిన కొత్తలో..

వృత్తిగత జీవితంలో ప్రతి క్షణమూ కీలకం. వృత్తిపరంగా నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్త పోకడలు వస్తూనే ఉంటాయి. వాటికి అలవాటుపడుతూ ముందుకు వెళ్లడమే మంచి ఉద్యోగి లక్షణం. ముఖ్యంగా వృత్తిజీవితంలో సకాలంలో అభివృద్ధిని, లక్ష్యాలను సాధించాలంటే యువ ఉద్యోగులు కొన్ని లక్షణాలను అలవరచుకోవాలి. సంస్థలో చేరినప్పటి నుంచి మీకంటూ ఒక గుర్తింపును సాధించాలి. అదెలాగో చూద్దాం.

ప్రతి సంస్థకూ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఒక్కో సంస్థ ఒక్కో విధంగా ఉద్యోగుల నుంచి ఉత్పత్తిని ఆశిస్తుంది. ఉద్యోగుల విషయంలో అన్ని సంస్థలూ ఒకే విధంగా వ్యవహరించవు. ఏ సంస్థ తీరు ఆ సంస్థకు ఉంటుంది. దీన్ని ఉద్యోగులు ఎంత త్వరగా గుర్తించి.. దానికి అనుగుణంగా నడుచుకుంటే అంత మేలు. ఒకవేళ ఈ అంశాల్లో స్పష్టత లేకుంటే సీనియర్లు, లేదా పై అధికారుల వద్ద అడిగి తెలుసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
వృత్తికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలని.. నేర్చుకోవాలని ఉందా.. ఉంటే ఇది కలిసి వచ్చే అంశం. ఎప్పటికప్పుడు వృత్తికి సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకొంటూ వాటిని అమలు చేస్తూ ముందుకు వెళ్లండి. పనిలో చేరినప్పటి నుంచి ఒకే విధంగా పని చేస్తూ.. మూసధోరణిలో వ్యవహరించడం కన్నా కాస్త వైవిధ్యంగా పని చేస్తూ మంచి ఫలితాలు రాబట్టడానికి ప్రయత్నించండి. ఇలాంటి తీరు సంస్థలో మీ కంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. ఒకటి రెండు సార్లు మీ ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వకున్నా.. కాస్త అనుభవం తోడైతే మంచి ఫలితాలు వస్తాయి.
సహోద్యోగులకు సాయం చేసే గుణం ఉంటే వృత్తిగతంగా బాగా రాణించవచ్చు. మీరు ఇతరులకు సాయం చేస్తున్నపుడు అవసరమైనపుడూ ఇతరులు ఆదుకొనేందుకు ముందుకు వస్తారు. దీంతో వృత్తిగతమైన ఇబ్బందులను సులభంగా అధిగమించవచ్చు. కేవలం అప్పగించిన బాధ్యతలను మాత్రమే పూర్తి చేసి వెళ్లకుండా మీరు చేయగలిగిన ఇతర పనులు ఉంటే వాటినీ పంచుకోవచ్చు. దీని వల్ల వృత్తిపట్ల మీరు కనబరుస్తున్న ఆసక్తి, నిబద్ధత ఉన్నతాధికారులు, సంస్థకు మరింత బాగా తెలుస్తాయి. అలా కాకుండా అవసరమైనపుడు ఇతరులకు సాయం చేయకుండా అప్పగించిన పనిని మాత్రమే పూర్తిచేసుకొని వెళ్తుంటే చివరకుమీరు అక్కడే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది.
సంస్థలో సదస్సులు, సమావేశాలు జరిగినపుడు కేవలం శ్రోతగానే మిగిలిపోకుండా మీరూ మీ అభిప్రాయాలను సహోద్యోగులతో పంచుకొనేందుకు ప్రయత్నించండి. కొత్త ఆలోచనలు, ప్రస్తుతం చేస్తున్న పనిలో సమస్యలు ఉంటే వాటినీ పంచుకోవచ్చు. మీకు తోచిన పరిష్కార మార్గాలూ సూచించవచ్చు. నచ్చితే సంస్థ అమలు చేస్తుంది. లేకుంటే మీకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఇలాంటి తీరువల్ల మీలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. చేస్తున్న పనితీరుపై సీనియర్లు, సహోద్యోగుల నుంచి అభిప్రాయాన్ని తీసుకోవడం ఎప్పుడూ మరవొద్దు.పనిని విమర్శించినా సానుకూలంగా తీసుకోండి. దీంతో మీలో లోపాలు తెలియడంతో పాటు సీనియర్ల నుంచి వృత్తికి సంబంధించిన పలు విషయాలను నేర్చుకొనే వీలు కలుగుతుంది.
మీరు ఒక గొప్ప పనిని విజయవంతంగా పూర్తి చేసినపుడు దానికి సహకరించిన వారి అందరి పేర్లనూ ప్రస్తావించాలి. మీరు ఒక్కరే పూర్తి చేశానని పేర్కొంటే చివరకు మీకు సాయం చేసేందుకు ఎవరూముందుకు రారు. పైన పేర్కొన్న అంశాలన్నింటినీ అనుసరిస్తే సంస్థలో మీపై అందరికీ సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. ఒకరిద్దరు సీనియర్లకు మీ తీరు బాగా నచ్చవచ్చు. అలాంటి సీనియర్లున్నప్పుడు వారితో వీలైనంత ఎక్కువ మాట్లాడండి. దీంతో వారు తమకు అనుభవరీత్యా తెలిసిన అంశాలను మీకు చెప్పడంతో పాటు మీ పనిలో పొరపాట్లు జరగకుండా సహకరిస్తారు కూడా.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017