ముందు అధ్యయనం చేయండి

ఇంటర్వ్యూ.. ఉద్యోగ సాధనలో చివరి దశ. ఇక్కడ నెగ్గితే చాలు దాదాపు ఉద్యోగం వచ్చేసినట్టే. అందువల్ల ఏ ఉద్యోగమైనా సరే.. మౌఖిక పరీక్ష చాలా కీలకం. రాతపరీక్ష.. ఇతర అంశాలతో పోల్చితే మౌఖిక పరీక్ష ఎక్కువ కష్టంగా ఉండదు. కాని విజయవంతమయ్యేది మాత్రం కొందరే. ఒక్కోసారి సంస్థ అవసరాలు.. పోటీపడుతున్న అభ్యర్థుల్లో ప్రతిభా పాటవాలు కూడా అభ్యర్థి విజయావకాశాలను ప్రభావితం చేస్తుంటాయి. అందువల్ల మౌఖిక పరీక్షలో తెలిసో.. తెలియకో చిన్న పొరపాటు చేసినా ఉద్యోగ అవకాశం చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే కొన్ని కీలక అంశాలపై అవగాహన అవసరం. అవేవో తెలుసుకుందాం.
ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకొని ఉండాలి. తెలియకుంటే తెలుసుకున్న తర్వాతే మౌఖిక పరీక్షకు హాజరవ్వాలి. ఇందుకోసం ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి ఆ సంస్థ గురించి అధ్యయనం చేసి.. అన్ని విషయాలపైనా అవగాహన కలిగి ఉండాలి. మీరు దరఖాస్తు చేసిన ఉద్యోగం, చేయనున్న విధులకు సంబంధించిన అంశాలపైనా అవగాహన తప్పని సరి.
* ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వస్త్రధారణ, పర్‌ఫ్యూంల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ తేడా వస్తే రిక్రూటర్లు మిమ్మల్ని త్వరగా తిరస్కరించే వీలుంటుంది. దరఖాస్తు చేసిన ఉద్యోగానికి తగినట్లు వస్త్రధారణ ఉండాలి.
* సరిగ్గా మౌఖిక పరీక్ష సమాయానికి సంస్థ వద్దకు చేరుకోవడం కన్నా.. కాస్త ముందుగా వెళ్లాలి. అనవసరపు ఒత్తిడి దరిచేరకుండా ఉంటుంది. సరిగ్గా ఇంటర్వ్యూ సమాయానికి లేదా ఆలస్యంగా వెళ్తే గందరగోళ పరిస్థితి తలెత్తే అవకాశముంది.
* దరఖాస్తుతో పాటు జత చేసిన రెజ్యూమె నకలను తప్పకుండా తీసుకెళ్లాలి. మౌఖిక పరీక్షకు ముందు రిక్రూటర్లు ఒక్కోసారి రెజ్యూమెలు అడుగుతుంటారు. ఈ సమయంలో మరో రెజ్యూమెను ఇవ్వడం సరికాదు.
* మొబైల్‌ ఫోన్‌ను కొందరు వైబ్రేషన్‌ మోడ్‌లో పెడుతుంటారు. ఇది సరికాదు. వైబ్రేషన్‌ మోడ్‌లో కూడా కాస్త శబ్దం వస్తుంది. దీని వల్ల మీ దృష్టి ఇంటర్వ్యూ నుంచి ఫోన్‌వైపునకు మళ్లే ప్రమాదం ఉంది. మౌఖిక పరీక్షకు వెళ్లే ముందు మొబైల్‌ను తప్పకుండా స్విచాఫ్‌ చేయాలి. వైబ్రేషన్‌.. సైలెంట్‌ మోడ్‌లకన్నా ఇదే ఉత్తమం.
* సంస్థలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇంటర్వ్యూ పూర్తయి బయటకు వచ్చే దాకా చాలా మంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. వారందరితోనూ హుందాగా వ్యవహరించాలి. కరచాలనం, పలకరించే సమయాల్లో పద్ధతులు పాటించాలి.
* మీలో బలాలు, బలహీనతలు ఏంటి..? గతంలో ఉద్యోగం ఎందుకు మానేశారు? మిమ్మల్నే ఈ ఉద్యోగానికి ఎందుకు తీసుకోవాలి? మీ గురించి చెప్పండి..? వంటి ప్రాథమిక ప్రశ్నలకు సరైన సమాధానాలను ముందే సిద్ధం చేసుకోవడం మంచిది. వాటికీ సరైన సమాధానాలు చెప్పకుంటే మీరు ఇంటర్వ్యూకి ఏమాత్రం సన్నద్ధం కాలేదని భావిస్తారు.
* జోక్‌లు పనికిరావు. ఇక్కడ మాట్లాడే భాష, భావ వ్యక్తీకరణ తీరు హుందాగా ఉండాలి.
* రిక్రూటర్లు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఒక్కోసారి కుదరకకపోవచ్చు. ఈ సమయంలో మీకు తెలిసిన విషయాన్ని సూటిగా చెప్పడం.. తెలియకుంటే నిజాయతీగా తెలియదని అంగీకరించడం ఉత్తమం. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. ఏదో ఒకటి చెబితే ఆ విషయాన్ని రిక్రూటర్లు సులభంగా గుర్తించేస్తారు.
* మౌఖిక పరీక్షలో హావభావాలు కూడా ముఖ్యమే. ఒక్కడ చేతులు కట్టుకొని కూర్చోవడం సరికాదు. సందర్భానుసారం చిరునవ్వు కూడా అవసరమే. కాళ్లు కదపడం, చేతులు కట్టుకోవడం, ముందున్న బల్లపై ఒరిగిపోవడం, ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం వంటివి చేయొద్దు.
* ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మీకూ కొన్ని సందేహాలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడానికి రిక్రూటర్లను కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. దీనివల్ల ఉద్యోగంపట్ల మీరు కనబరుస్తున్న ఆసక్తి వారికి తెలుస్తుంది.
* ఇంటర్వ్యూలో మీరు చెప్పే సమాధానాలు రెజ్యూమెలో పేర్కొన్నవాటికి భిన్నంగా ఉండకూడదు.
* చివరిలో ధన్యవాదాలు చెప్పడం మరవద్దు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017