పోస్ట్‌తో జాగ్రత్త!

ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌..
ట్విటర్లో ఓ కామెంట్‌..
గూగుల్‌ ప్లస్‌లో ఓ ఫొటో..
ఇవి ఏవైనా సరే.. మీ కలల ఉద్యోగానికి ఎసరుపెట్టవచ్చు. దాదాపు ఖాయమైన ఉద్యోగాన్ని దూరం చేయొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రిక్రూటర్లు ప్రతి ఉద్యోగి 'సామాజిక'లక్షణాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ తేడా వచ్చినా.. ఇలాంటి వ్యక్తి మనకు ఎందుకు.. అవసరం లేదని భావిస్తున్నారు. గతంలో ఈ ధోరణి తక్కువగా ఉండగా ప్రస్తుతం బాగా విస్తరించింది. మరోవైపు కొందరు ఉద్యోగులు సామాజిక అనుసంధాన వేదికలపై సరైన అవగాహన లేక ఇక్కడ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసి.. వృత్తిపరంగా లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకొంటున్నారు. అందువల్ల ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నవారు.. ఉద్యోగులు ఎవరైనా సరే.. సామాజిక వేదికల్లో హద్దుమీరకుండా వ్యవహరించాలి. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఫేస్‌బుక్‌ ద్వారా బుక్‌ అయితే మాకేంటి.. మాకు ఏమీ కాదు.. అనుకుంటున్నారా.. అయితే ఒకసారి కెరియర్‌ బిల్డర్‌ నిర్వహించిన సర్వేలో రిక్రూటర్లు ఏమంటున్నారో చూడండి మరి..!
ఒక వ్యక్తి రెజ్యూమె చేరిన వెంటనే రిక్రూటర్లు అందులో ఉన్న విషయాలను ధ్రువీకరించుకొనేందుకు అంతర్జాలంలో అన్వేషిస్తారు. ఇందులో భాగంగా సదరు వ్యక్తికి సంబంధించిన సామాజిక అనుసంధాన వేదికలు, మైక్రోబ్లాగింగ్‌ సైట్లు, బ్లాగులను తనిఖీ చేస్తారు. ఇక్కడ పెట్టిన పోస్టులు, కామెంట్‌లు, ఫొటోల ఆధారంగా ఆ వ్యక్తిపై రిక్రూటర్లు ముందే ఒక అంచనాకు వచ్చేస్తారు. దాదాపు 50 శాతం మంది ఆ వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకోవాలా లేదా అనే విషయంపై ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కెరియర్‌ బిల్డర్‌ సర్వే ప్రకారం.. ప్రస్తుతం 51 శాతం మంది రిక్రూటర్లు, సంస్థలు.. సామాజిక అనుసంధాన వేదికల్లో తేడాల వల్ల వ్యక్తులను తిరస్కరిస్తున్నాయి. గతేడాది ఈ వైఖరిని 43 శాతం మంది రిక్రూటర్లు అనుసరించగా 2012లో 34 శాతం మంది అనుసరించారు. రిక్రూటర్లు అభ్యర్థుల సామాజిక వేదికల్లో ఆరా తీస్తున్న విషయాలు ఏంటో చూడండి వరసగా... అంశం పరిశీలిస్తున్న రిక్రూటర్ల శాతం
అభ్యర్థి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారా లేదా..? అతని పోస్ట్‌లలో అసభ్యత 46 శాతం
గతంలో పని చేసిన చోట ఎలా వ్యవహరించారు.. ఆ సంస్థపై అతనికి ఉన్న గౌరవం ఎంత..? 36 శాతం
గత సంస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బయటపెట్టారా.. 24 శాతం
నేరపూరిత వ్యవహారశైలి 22 శాతం
మరేం చేయాలి
* సోషల్‌ సైట్స్‌లో మీ ఫ్రొఫైల్‌, ప్రైవసీ సెట్టింగ్స్‌ను ఒకసారి తనిఖీ చేసుకోండి.
* మీ ప్రొఫైల్‌లో ఇతరులు అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టకుండా జాగ్రత్తపడండి. ఒకవేళ పెట్టినా అవి ఇతరులకు కనిపించకుండా సెట్టింగ్స్‌ మార్చండి.
* మీ దుర్వ్యసనాలు, ఇతరులకు బాధకలిగించే అభిప్రాయాలను, ప్రతికూల అంశాలను ఎప్పుడూ పోస్ట్‌ చేయొద్దు. ఇతరులు చేసినా.. వాటిని లైక్‌ చేయవద్దు.
* మీ కవర్‌ ఫొటోలు, ప్రొఫైల్‌ ఫొటోలు చాలా హుందాగా ఉండేటట్లు చూసుకోండి. లేకంటే వెంటనే మార్చండి.
* లింక్డ్‌ఇన్‌, ఇతర ఉద్యోగానికి సంబంధించిన సైట్లలో వెల్లడించిన విషయాలకు.. రెజ్యూమెలో పేర్కొన్న అంశాలకు వైరుధ్యం లేకుండా జాగ్రత్తపడాలి.
* ఒక్కమాటలో చేప్పాలంటే మీకు సంబధించిన ఆన్‌లైన్‌ వేదికలు మీ గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచే విధంగా ఉండాలి కాని ఎక్కడా అసభ్యత కనిపించకూడదు. వివాదాస్పదంగా ఉండకూడదు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017