సాధారణ డిగ్రీతోనూ మంచి కొలువులు

సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ రోజుల్లో ఏం ఉద్యోగాలు వస్తాయి.. అనుకుంటూ నిరాశపడవద్దు. మారుతున్న కాలానికి తగినట్లు సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా బోలెడన్ని ఉద్యోగ అవకాశాలున్నాయి. ఎంచుకున్న రంగంలో పట్టు, కాస్త నైపుణ్యం ఉంటే చాలు దాదాపు అన్ని చోట్లా మీ కోసం కొలువులు వేచి చూస్తున్నాయి. సాధారణ డిగ్రీ పూర్తి చేసి కొన్ని అదనపు నైపుణ్యాలను సంపాదించి ఐటీ రంగంలో స్థిరపడిన వారు చాలా మందే ఉన్నారు. మీ చదువుకు సంబంధం లేదనిపించిన రంగాల్లో కూడా మీరు సరిగా కృషిచేస్తే తగిన కొలువులు సాధించవచ్చు. వాటిని అన్వేషించి అందిపుచ్చుకోండి మరి..!
ఐటీ.. ఈ రంగంలో ఉద్యోగాలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్‌ ఉంది. మీరు సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అయి.. ఐటీ రంగంపై ఆసక్తి ఉంటే ఈ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఇలా చేయాలంటే ముందుగా ఐటీ రంగంపై పూర్తి అవగాహన సాధించాలి. ఈ రంగంలో ఉద్యోగానికి ప్రయత్నించే ముందు.. ఐటీ పోకడలు.. భవిష్యత్తులో రానున్న మార్పులపై అవగాహన సాధించాలి. తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. భారత్‌లో ఈ-కామర్స్‌ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఐటీ ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణుల అంచనా.
ఫైనాన్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుతం ప్రతిభావంతులకు మంచి డిమాండ్‌ ఉంది. గణితంలో పట్టు ఉంటే మీరు ఏ డిగ్రీ చేసి ఉన్నా ఈ రంగంలో ఉద్యోగాల కోసం అన్వేషించవచ్చు. ఈ రంగంలో ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా పలు సంస్థలు శిక్షణను అందిస్తున్నాయి. ఇక్కడ అదనపు నైపుణ్యాలు సాధించవచ్చు. కేవలం కామర్స్‌ చదివిన వారే కాకుండా బీఎస్సీ మ్యాథ్స్‌, గణితానికి సంబంధించిన ఇతర కోర్సులు పూర్తి చేసిన వారూ ఈ రంగంలో ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.
సేల్స్‌/మార్కెటింగ్‌: నిత్యం సవాళ్లతో కూడున్న వృత్తి ఇది. ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నైపుణ్యం ఉంటే ఈ వృత్తిలో తక్కువ కాలంలోనే అభివృద్ధి చెందవచ్చు. ఎక్కువ సంస్థలు ఈ విభాగంలో ఉద్యోగాలను సాధారణ డిగ్రీలు పూర్తి చేసివారికే ఇస్తున్నాయి.
విమానయానరంగం: భారత్‌లో వేగంగా అభివృద్ధిచెందుతున్న రంగాల్లో ఇదొకటి. ఓ అధ్యయనం ప్రకారం 2020 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్‌ భారత్‌దే కానుంది. 2030 నాటికి ఈ రంగంలో భారత్‌ ముందంజలో ఉండనుంది. ప్రస్తుతం విమానయాన రంగానికి సంబంధించి పలు రకాల ఉద్యోగాలు డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా అందుబాటులో ఉంటున్నాయి. సాంకేతిక పరమైన విభాగాలు కాకుండా తక్కిన చోట్ల మానవ వనరుల అవసరం పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మోడీ సర్కారు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని విధాన పరమైన నిర్ణయాలను కూడా తీసుకొంది. దీంతో ఈ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.
పర్యటక, ఆతిథ్యరంగం: భావ వ్యక్తీకరణ చాతుర్యం.. ఓ డిగ్రీ ఉంటే చాలు ఈ రంగంలో దూసుకెళ్లవచ్చు. దశాబ్దకాలంగా దేశంలో ఈ రంగం బాగా వృద్ధి చెందుతోంది. దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రభుత్వేర సంస్థలు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా పర్యటక రంగాన్ని భారీగా అభివృద్ధి చేయాలని ప్రధాన మంత్రి మోడీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోటళ్లు, ప్రముఖ సంస్థల ఆహారశాలలు, ట్రావెల్‌ అండ్‌ టూరిజం సంస్థల్లో ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.
ఇవే కాకుండా ఫ్యాషన్‌ రంగం, ఈవెంట్స్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌, ప్రభుత్వ రంగంలో చాలా ఉద్యోగ అవకాశాలున్నాయి. కాస్త శ్రమించి అందిపుచ్చుకొంటే సకాలంలో మంచి ఉద్యోగం సాధించడం కష్టం ఏం కాదు. ఈ ఉద్యోగాలకు ప్రయత్నించేటపుడు ఆయా రంగాల్లో నైపుణ్యం, ఉద్యోగానికి కావాల్సిన కనీస అర్హతలు సాధించడం మాత్రం మరవొద్దు. అవి లేకుండా ఎక్కడా ఏమీ చేయలేరు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా దాన్ని ఎక్కువ రోజులు నిలుపుకోవడం కష్టమవుతుంది.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017