అలా నింపితే చాలదు

ద్యోగ అన్వేషణలో తొలి దశ దరఖాస్తు నింపడం. ఏ ఉద్యోగానికైనా ఇది తప్పనిసరి ప్రక్రియ. దీని తర్వాతే పరీక్షలు, ఫోన్‌ ఇంటర్వ్యూలు, బృంద చర్చలు, ముఖాముఖీలు. ఈ తొలిదశలో పక్కాగా వ్యవహరిస్తేనే కొలువు సాకారమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువ మంది అప్లికేషన్‌ను నింపే విధానం సరిగ్గా తెలియక.. సదరు దరఖాస్తులో అభ్యర్థి నుంచి సంస్థ ఆశిస్తున్న అంశాలను గుర్తించక వైఫల్యం చెందుతుంటారు. ముందుగా దరఖాస్తు నింపే విధానంపై అవగాహన పెంచుకోవాలి. అందువల్ల అసలు దరఖాస్తు నింపేటపుడు తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలేంటో చూద్దాం.
ఆన్‌లైన్‌లో.. ఆఫ్‌లైన్‌లో ఇలా ఎక్కడైనా సరే.. దరఖాస్తుఫారాన్ని ఒకటికి రెండు సార్లు పూర్తిగా చదవాలి. తర్వాతే నింపాలి. పూర్తిగా చదవకుండా దరఖాస్తును నింపవద్దు. ప్రతి దరఖాస్తులోనూ చేయాల్సినవి, చేయకూడనివి (డూస్‌ అండ్‌ డోన్ట్స్‌) ఉంటాయి. వాటిని తప్పనిసరిగా అనుసరించాలి. సూచనలను పూర్తిగా అర్థం చేసుకోకుండా దరఖాస్తును నింపి పంపితే.. పొరపాట్లు దొర్లే అవకాశం ఉంటుంది. ఈ పొరపాట్లను సంస్థ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ ఉద్యోగం పట్ల ఆసక్తి పెద్దగా లేదని భావిస్తారు. ప్రతి ఖాళీని వీలైనంత వరకు నింపాలి. నింపకుండా వదలిపెట్ట కూడదు. ఎందుకంటే దరఖాస్తులో ప్రతి ఖాళీకి ఒక ప్రధాన ఉద్దేశం ఉంటుంది. మీకు సంబంధించినది కానంత వరకు ప్రతి ఖాళీని సమగ్రమైన వివరాలతో నింపాలి. వదిలేస్తే అది మీ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమవుతుంది.
ఆలస్యం చేయొద్దు: ఏ ఉద్యోగానికైనా అప్లికేషన్‌ను సకాలంలో రిక్రూటర్లు లేదా సంస్థకు చేరేలా పంపాలి. ఆలస్యంగా పంపితే మీరు ఎంత ప్రతిభావంతులైనా మీ దరఖాస్తును పట్టించుకోరు. గడువుకు కొన్ని గంటల ముందు మీకు సమాచారం అందినా సరే దరఖాస్తు మాత్రం గడువులోపే చేరాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆలస్యంగా వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకొంటారు. అప్పుడూ ఆలస్యానికి తగిన కారణం ఉండాలి. లేకుంటే దాన్నీ పట్టించుకోరు.
దరఖాస్తులో అక్షర, వ్యాకరణ దోషాలు ఉండ కూడదు. ఎందుకంటే ఇక్కడ 60 శాతం మేర అంశాలను ముందుగానే భర్తీ చేసి ఉంటారు. మీకు సంబంధించిన వివరాలు మాత్రమే నింపాల్సి ఉంటుంది. కొన్నింటికి సూటిగా అవును, కాదు అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ అంశాల్లో కూడా దోషాలు వస్తే వాటిని తీవ్రంగానే పరిగణిస్తారు. అభ్యర్థికి కనీస పరిజ్ఞానం కూడా లేదని భావిస్తారు. దీంతో మంచి అవకాశాలను కూడా ఆదిలోనే కోల్పోవాల్సి ఉంటుంది.
చదివిన తర్వాత లేదా ఉద్యోగం మానేసిన వెంటనే మరో ఉద్యోగం దొరకకపోవడం తప్పుకాదు. అయితే అది ఎందుకు లభించలేదో చెప్పగలగాలి. ప్రస్తుతం చాలా దరఖాస్తుల్లో 'ఉద్యోగ విరామం'కు సంబంధించిన వివరాలను అడుగుతున్నారు. దీనికి సమాధానం సహేతుకంగా ఉండేలా చూసుకోవాలి. ఏదో ఒకటి చెబితే సరికాదు. తర్వాత అయినా రిక్రూటర్లు అసలు విషయాన్ని గుర్తుపట్టేస్తారు.
దరఖాస్తులో మీరు వెల్లడించిన అంశాలకు ఆధారాలను జతచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంస్థలు కొన్ని ధ్రువపత్రాలను, లేదా ఆధారాలను జతచేయాల్సిందిగా కోరుతాయి. ఈ అంశాన్ని తప్పక పాటించాలి. ఏ ఒక్క ఆధారం, లేదా ధ్రువపత్రాన్ని జత చేయడం మరిచిపోయినా.. దానికి సంబంధించి మీరు నింపిన అంశాలపై అనుమానం తలెత్తుతుంది. ఒక్కోసారి నమ్మలేరు కూడా. కనుక దరఖాస్తులో నింపిన ప్రతి అంశానికీ తగిన ఆధారం చూపడం మంచిది. సంస్థ కోరిన ధ్రువపత్రాలు లేకుంటే ఇతరులతో మిమ్మల్ని పోల్చిచూడటానికి కూడా కష్టమవుతుంది. దీంతో ఉద్యోగం వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి.
దరఖాస్తులో సంస్థ కోరిన అంశాలనే వెల్లడించాలి. ఇతర అంశాలను రెజ్యూమెలోనూ, ఇంటర్వ్యూలోనూ తెలియజేయవచ్చు. అలా కాకుండా అన్ని విషయాలనూ అప్లికేషన్‌లోనే వెల్లడించాలనుకొంటే కుదరదు. ఇలా చేస్తే దరఖాస్తులను పరిశీలించే వారు గందరగోళానికి గురయ్యే అవకాశముంటుంది. ఒకవేళ సంస్థకు అవసరం లేని అంశాలను మీరు ప్రస్తావిస్తే.. 'తర్వాత చూడవచ్చని' మీ అప్లికేషన్‌ను పక్కన పెట్టేసే అవకాశముంటుంది.
ఒక దరఖాస్తును నింపే ముందు ఆ ఉద్యోగానికి అవసరమైన అర్హతలు, ప్రతిభ, నైపుణ్యాలు ఏంటో ఒకసారి అధ్యయనం చేయండి. వాటిపై స్పష్టత వచ్చాక అవి మీలో ఎంతవరకు ఉన్నాయో ఆలోచించండి. తర్వాతే దరఖాస్తును నింపండి. దీని వల్ల సంస్థకు కావాల్సిన నైపుణ్యాలు మీలో ఉంటే వాటినే స్పష్టంగా వెల్లడించగలుగుతారు. ముందుగా అధ్యయనం చేయకుంటే ఉద్యోగానికి అవసరం లేని వివరాలతో అప్లికేషన్‌ను పూర్తి చేసే ప్రమాదం ఉంటుంది.
ఇంకా..
* దరఖాస్తులో కోరిన అర్హతలకన్నా ఎక్కువ అర్హతలు, నైపుణ్యాలు ఉంటే వాటికి తగిన కొలువును వెదుక్కోవాలి. అంతేకాని ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలని భావించవద్దు.
* రెజ్యూమెలను కాపీ పేస్ట్‌ చేయొద్దు. మీ అర్హతలు, మీ నైపుణ్యాలు, వృత్తిగత ఆసక్తులు, సృజనకు తగినట్లు ఉండేలా చూసుకోవాలి.
* దరఖాస్తుకు జతచేసే రెజ్యూమెలో దరఖాస్తులో పేర్కొన్న వివరాలు మాత్రమే ఉంటే సరిపోదు. అదనపు వివరాలు ఉండాలి.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017