ప్రత్యేక లక్షణాలుంటేనే..!

క ఉద్యోగానికి పది మంది దరఖాస్తు చేశారు. అందరిలోనూ సమాన స్థాయిలో ప్రతిభ, నైపుణ్యాలు, అర్హతలు ఉన్నాయి. కాని సదరు సంస్థకు కావాల్సింది మాత్రం ఒక్కరే. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి సంస్థలోనూ నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే సంస్థలు అర్హతలు, నైపుణ్యాలు, ప్రతిభలతో పాటు వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను పరిగణనలోకి తీసుకొంటాయి. తమకు నచ్చిన లక్షణాలు కలిగిన వ్యక్తికే ఉద్యోగం ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయి. ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థుల్లో ప్రత్యేక లక్షణాల కోసం రిక్రూటర్లు ప్రత్యేకంగా ఆరా తీస్తారు. ఆ ప్రత్యేక లక్షణాలు ఏంటి.. ఎక్కువ సంస్థలు ఉద్యోగిలో ఆశించేవి ఏవి.. తెలుసుకోండి.
ఆత్మవిశ్వాసం.. ఉత్సాహం.. ప్రొఫెషనలిజం ఈ మూడు లేకుంటే ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంస్థా అభ్యర్థిలో ఈ మూడు విషయాలనే ప్రధానంగా పరిగణిస్తుంది. 'యూనివర్సం' అనే సంస్థ నాలుగు లక్షల మంది విద్యార్థులు, రిక్రూటర్లు, నిరుద్యోగుల వద్ద ఒక సర్వే చేసింది. ఇందులో 86 శాతం సంస్థలు అభ్యర్థిలో ప్రొఫెషనలిజం, 78 శాతం సంస్థలు ఉత్సాహం, 61 శాతం సంస్థలు ఆత్మవిశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నట్లు తేలింది. ఈ మూడే కాకుండా కాకుండా స్వీయ పర్యవేక్షణ, ఆసక్తి-జిజ్ఞాస అంశాలు కూడా ఉద్యోగంపై ప్రభావం చూపుతాయి. 58 శాతం సంస్థలు ఈ విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇంకా పైన పేర్కొన్న ఇతర అంశాలకూ దాదాపు అన్ని సంస్థలూ ఎంతో కొంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కూడా వెల్లడైంది.
నిజానికి.. రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నామని ఇవ్వాళ ప్రత్యేక లక్షణాలు అలవరచుకోవడం కుదరదు. చేయాల్సిందిల్లా మనలో ఉన్న సానుకూల అంశాలను, ప్రత్యేక లక్షణాలను గుర్తించి వాటిని మౌఖిక పరీక్షలో సమర్థవంతంగా ప్రదర్శించడం. ప్రతికూల అంశాలు ఉంటే వాటిని వదిలించుకోవడం మాత్రమే.
ఆలస్యం
ఇంటర్వ్యూకి వెళ్లేటపుడు ఆలస్యం ఎంత మాత్రం పనికి రాదు. ఆలస్యం అమృతం విషం అనే నానుడి ఇక్కడ అక్షరాలా వర్తిస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూకే ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి విధులకు కూడా ఆలస్యంగానే వస్తారేమోనని రిక్రూటర్లు భావిస్తారు. మీరు వారి సమయాన్ని వృథా చేయడంతో పాటు.. సదరు ఉద్యోగం పట్ల మీకు ఆసక్తిలేని అనుకుంటారు. కనుక ఎట్టిపరిస్థితుల్లోనూ మౌఖిక పరీక్షకు ఆలస్యంగా వెళ్లవద్దు.
ప్రజ్ఞ
కళాశాలలో మంచి మార్కులు, రిక్రూటర్లు పెట్టిన పరీక్షలో విజయం.. మాత్రమే మీ ప్రజ్ఞపాటవాలకు కొలబద్ద కాదు. విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటారన్నదానిపై మీ తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. వీటిని ఇంటర్వ్యూలో ప్రదర్శించాలి. ఒక్కసారి రిక్రూటర్లు మీరు చాలా తెలివైన వారని భావిస్తే మీకు దాదాపు ఉద్యోగం ఖాయమైనట్టే.
పద్ధతులు
ఇంటర్వ్యూలో ఇవి చాలా ముఖ్యం. మీరు చిరునవ్వు నవ్వినా.. విష్‌ చేసినా.. ధన్యవాదాలు తెలిపినా.. వాటిని పెద్దగా పట్టించుకోరు. ఇవి పాటించలేదంటే మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తారు. చక్కగా కూర్చోవడం, పలకరింపు, నవ్వు, మాటలు అన్నీ హుందాగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఎక్కడో చూస్తూ మాట్లాడటం, తల నిమరడం, మాట్లాడేటపుడు ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం చేయవద్దు.
అంకిత భావం
ప్రతి సంస్థా అభ్యర్థిలో అంకితభావం ఉందా.. లేదా అనేది తప్పక పరిశీలిస్తుంది. గతంలో పని చేసినపుడు ఎలా వ్యవహరించారు.. అక్కడ ఎందుకు పని మానేశారు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొంటుంది. సహేతుకమైన కారణాలు లేకుంటే అభ్యర్థిలో అంకితభావం లేదనే భావిస్తుంది. గతంలో పనిమానేసి.. లేదా ఇంకాస్త మంచి ఉద్యోగ అవకాశం కోసం ఇంటర్వ్యూకి వెళ్లినపుడు వాటికి తగిన కారణాలపై ముందుగానే కాస్త కసరత్తు చేయాలి. ఏదో ఒకటి చెబితే సరికాదు.
ఉల్లాసం
ఇంటర్వ్యూకి వెళ్లినపుడు కాస్త ఒత్తిడి, కొంచెం ఆందోళన సహజం. కొత్తవారికైతే ఇవి ఎక్కువ పాళ్లే ఉంటాయి. అయితే వీటిని ఎక్కడా రిక్రూటర్లకు కనిపించనీయొద్దు. ఇంటర్వ్యూకి వెళ్లినప్పటి నుంచి పూర్తయ్యేవరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించాలి. ఆందోళన, నిరుత్సాహం ఎప్పుడూ దరిచేరనీయొద్దు. ఎందుకంటే ఏ సంస్థా చికాకు పడేవారిని, నిరుత్సాహంగా ఉండేవారిని విధుల్లోకి తీసుకోవాలని అనుకోదు.
పరిపక్వత
ఇంటర్వ్యూలో అభ్యర్థి చాలా హుందాగా.. పరిపక్వతతో వ్యవహరించాలి. అర్థంపర్థంలేని మాటలు, జోకులు, నవ్వులు పనికిరావు. రిక్రూటర్లు ఒక ప్రశ్న అడిగినపుడు వెంటనే ఏదో ఒక సమాధానం చెప్పకుండా.. కొన్ని సెకన్ల పాటు ఆలోచించి స్పందించడం మంచింది. మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ పరిపక్వత గోచరించాలి. అప్పుడే రిక్రూటర్లు మీవైపు మొగ్గుచూపుతారు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017