ఎక్కడి పనులు అక్కడే

ప్రస్తుతం దాదాపు ప్రతి ఉద్యోగికీ ఇల్లు.. కార్యాలయం తేడా లేదు. కార్యాలయంలో ఏ పనులు చేస్తారో అవన్నీ ఇంట్లో కూడా చేసుకొనేలా సకల వసతులూ సిద్ధంగా ఉంటున్నాయి. దీంతో వృత్తి రీత్యా అటు సంస్థకు.. ఇటు ఉద్యోగికీ ఇద్దరికీ ప్రయోజనం ఉంటోంది. అయితే ఇది ఒక్కోసారి ఉద్యోగికి తీవ్ర ఇబ్బందిగా పరిణమిస్తోంది. వృత్తిగత జీవితానికి వ్యక్తిగత జీవితానికీ తేడాను చెరిపేసి తీవ్ర ఒత్తిడిని తెచ్చిపెడుతోంది. ఫలితంగా వృత్తి, వ్యక్తిగత జీవనంలో లయతప్పి దేనికీ న్యాయం చేయలేక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఇంటికీ కార్యాలయానికీ మధ్య స్పష్టమైన గీత ఉండాలి. ఈ గీత గీసుకోవడం తేలికే. కాకుంటే దాన్ని దాటకుండా ఉండటమే అసలు సవాల్‌. అందువల్ల వీలైనంత వరకు ఇల్లు.. కార్యాలయంలో పనులను ఎక్కడివక్కడ చక్కబెట్టుకోవడం మేలు.
ఇంట్లో పనులను కార్యాలయానికి మోసుకెళ్లడం.. కార్యాలయంలో పనుల గురించి ఇంట్లో తీవ్రంగా ఆలోచించడం సరికాదు. ఎక్కడి పనులను అక్కడే పూర్తి చేయాలి. సంప్రదాయ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వారు తమ పనులను వీలైనంత వరకు కార్యాలయాల్లోనే పూర్తి చేసుకొని వస్తుంటారు. సమస్య అంతా ఐటీ, ఇంటి నుంచి పని చేయడం, ఇతర కొత్త తరహా ఉద్యోగాలదే. ముఖ్యంగా ఐటీ రంగంలో పని చేస్తున్నవారికి అన్ని వేళలా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. దీంతో వారు కార్యాలయంలో పని కాస్త ఎక్కువైనా.. లేదా ఇబ్బందిగా పరిణమించినా.. ఇంటి వద్ద పూర్తి చేద్దాంలే అనుకొని ఆ పనిని ఇంటిదాకా తీసుకొస్తుంటారు. తీరా ఇంటికి వచ్చాక పని చేసుకోవడానికి అనువైన వాతావరణం లేకుంటే తీవ్ర అసహనానికి, ఒత్తిడికి గురవుతుంటారు. దీని వల్ల ఇంట్లోనూ చికాకులు మొదలవుతాయి. అందువల్ల వీలైనంత వరకు ఏ పనిని అయినా సరే కార్యాలయంలోనే పూర్తి చేయడం ఉత్తమం.
అనివార్య పరిస్థితుల్లో ఇంటి వద్ద పని చేయాల్సి ఉంటే ఆ విషయాన్ని ముందే ఇంట్లోవారికి తెలియజేయాలి. ఇంటి వద్ద ఏ సమయంలో పని చేయాలో ముందుగానే నిర్ణయించుకొని ఆలోపు ఇతర పనులను పూర్తి చేసుకోవాలి. పని చేస్తున్నపుడు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలి. అలా కాకుండా ఎలాగో ఒకలాగా ఇంట్లో పని పూర్తి చేయొచ్చనుకొంటే అన్నివేళలా సరిగ్గా కుదరకపోవచ్చు. ముఖ్యంగా చంటి పిల్లలు ఉంటే ఇంట్లో పని చేయాలన్న ఆలోచనే చేయొద్దు. ఎందుకంటే పిల్లలున్నపుడు ఇంట్లో ఏకాగ్రతతో కార్యాలయ పనులు చేయడం కష్టమవుతుంది. ఆఫీస్‌లోలాగా ఏకాగ్రత, శక్తితో ఇంట్లో పనిని చేయలేరు. అందువల్ల పిల్లలున్నపుడు ఎట్టిపరిస్థితుల్లోనూ కార్యాలయ పనిని ఇంటికి తీసుకురాకపోవడమే ఉత్తమం.
కార్యాయలంలో పనిని ఇంటికి మోసుకురాకుండా ఉండాలంటే సమయపాలన, నైపుణ్యాలు, ఒక ప్రణాళిక ప్రకారం పని చేయడం అలవాటు చేసుకోవాలి. కార్యాలయానికి వెళ్లిన వెంటనే ఆరోజు చేయాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకొని వాటిలో ప్రాధాన్యమున్న పనులను మొదటగా పూర్తి చేసుకొంటూ తక్కిన పనులను తర్వాత చేసుకోవాలి. అలా కాకుండా అప్రధాన పనులను మొదట మొదలుపెడితే విలువైన సమయం, శక్తి వృథా అయ్యే అవకాశముంటుంది. ఏవైనా అనుకోని అవాంతరాలు ఎదురైనపుడు ప్రధానమైన పనులు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటపుడు పనిని ఇంటికి మోసుకెళ్లాల్సి రావొచ్చు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముఖ్యమైన పనుల జాబితాను సిద్ధం చేసుకోవాల్సిందే. ఎప్పటి పనులను అప్పుడు పూర్తి చేస్తూ సకాలంలో ఇంటికి చేరాలంటే తగిన శక్తి.. ఆరోగ్యం కూడా అవసరమే. వృత్తిగత జీవితంలో అనారోగ్యం, ఒత్తిడి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. అందువల్ల వీటిని వీలైనంత వరకు దరి చేరనివ్వకుండా ఇంటి వద్ద నిత్యం వ్యాయామం, మంచి ఆహార అలవాట్లను పాటించాలి.
మనసులో ఏ ఇతర ఆలోచనలూ రాకుండా ఏక్రాగతతో కార్యాలయంలో పని చేసుకోవాలంటే ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనసు పనిపై మళ్లదు. దీంతో కార్యాలయానికి వెళ్లినా సరిగ్గా పని చేయలేరు. అందువల్ల కార్యాలయానికి వెళ్లే ముందు ఇంట్లో పనులు అన్నీ చక్కపెట్టుకొని వెళ్లాలి. అంతే కాని ఇంట్లో కార్యాలయ పనుల గురించి ఆలోచిస్తూ కూర్చొంటే కార్యాలయంలో ఇంటి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. అందువల్ల ఇంట్లో ఉన్నంతసేపూ ఇంటి గురించి పట్టించుకోవడం మంచిది. ఒకవేళ ఇంటి నుంచే పని చేయాల్సి వచ్చినపుడు కార్యాలయ పనికంటూ రోజూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ సమయంలోనే కార్యాలయ పనులను పూర్తి చేసేయాలి.
ఇవి పాటించండి
* కార్యాలయానికి వెళ్లిన వెంటనే ఇవ్వాల్టి పనిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈరోజే పూర్తి చేయాలన్న దృఢ నిర్ణయంతో పనిని మొదలుపెట్టాలి
* కార్యాలయం ఇంటికి దగ్గరగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పని చేయొద్దు. మీ పని పూర్తయ్యే వరకూ కార్యాలయంలోనే గడపడం ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ మీరు పని చేసుకొనేందుకు అన్ని వసతులూ ఉంటాయి. ఆటంకాలు తలెత్తవు.
* ఇంట్లో చంటిపిల్లలున్నపుడు ఆఫీసు పనులను చేయాలని అనుకోవద్దు. మీ బాస్‌ లేదా సంస్థ ఒత్తిడి చేస్తే ఇంట్లో ఉన్న పరిస్థితిని వివరించి కార్యాలయంలోనే పని చేసుకొనేందుకు అనుమతి తీసుకోండి.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017