ఒక్కో కొలువుకు ఒక్కో విధంగా

రవి ఇప్పటికే ఒక సంస్థలో పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగ అనుభవం ఉంది. దీంతో తన అనుభవం అర్హతలకు తగినట్లు ఎప్పటికప్పుడు రెజ్యూమెను తాజా పరచుకొంటూ ఉన్నాడు. అర్హతలకు తగిన ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు కన్పిస్తే నిత్యం వాటికి దరఖాస్తు చేస్తూనే ఉన్నాడు. కాని ఉద్యోగం మాత్రం రావడం లేదు. చివరకు ప్రముఖ సంస్థలో పని చేసిన అనుభవం ఉన్నా బయట మంచి అవకాశాలు ఎందుకు రావడం లేదంటూ ఆందోళనలో మునిగిపోయాడు.
సౌమ్యది తరగతిలో ప్రథమ ర్యాంకు. నైపుణ్యాలు, ప్రతిభ, మంచి అర్హతలు ఉన్నాయి. వాటికి తగ్గట్లు పక్కాగా ఒక రెజ్యూమెను సిద్ధం చేసుకుంది. దీన్ని రిక్రూటర్లకు పంపితే సరిపోతుందని భావించి అన్ని సంస్థలకూ ఈ రెజ్యూమెను పంపింది. కాని ఇప్పటికీ ఆమెకు ఉద్యోగం రాలేదు.
ఇక్కడ రవి, సౌమ్య అంతా బాగానే చేశారనిపించినా.. వారు అన్ని సంస్థలకూ ఒకే రెజ్యూమె పంపడం తప్పయింది. ఆయా సంస్థలు, ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలకు తగినట్లు రెజ్యూమెలో మార్పులు చేయాల్సి ఉంటుంది. కాని ఇవేమీ పట్టించుకోకుండా ప్రతి ఉద్యోగానికీ ఒకే దరఖాస్తు పంపితే సరికాదు. అందువల్ల ఒక్కో ఉద్యోగానికి తగినట్లు ఒక్కో విధంగా రెజ్యూమెను రూపొందించాలి.
ఇలా ఒక్కో ఉద్యోగానికి ఒక్కో విధంగా సిద్ధం చేయాలంటే ముందుగా ఆయా ఉద్యోగాల ప్రకటనలోని వివరాలను సమగ్రంగా అర్థం చేసుకోవాలి. దీంతో సంస్థకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు ఏంటో ప్రధానంగా తెలుస్తాయి. వాటినే రెజ్యూమెలో ప్రముఖంగా ప్రస్తావించాలి. దీంతో రిక్రూటర్లు మీ రెజ్యూమెలను పరిగణనలోకి తీసుకొటారు. అలా కాకుండా ముందుగా సిద్ధం చేసుకొన్న వాటిని పంపితే అవి బుట్టదాఖలయ్యే ప్రమాదముంది.
సాధారణంగా ఒకే విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవానికి సంబంధించి పలు రకాల ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆయా ఉద్యోగాన్ని పట్టించుకోకుండా అన్ని అర్హతలు, నైపుణ్యాలను ఒకే విధంగా వెల్లడించడం సరికాదు. ఏ ఉద్యోగానికి ఏ అర్హతలు, నైపుణ్యాలు అవసరమో వాటినే ప్రధానంగా ప్రస్తావించి తక్కిన వాటిని నామమాత్రంగా వెల్లడిస్తే సరిపోతుంది.
రెజ్యూమెలో ఏ అంశాన్ని ఎలా పేర్కొనాలి, ఏ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలో తెలిసి ఉండాలి. ఇక్కడే ఎవరి ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. కొన్ని సార్లు కేవలం రెజ్యూమెను మాత్రమే పంపితే సరిపోదు. దాన్ని మొత్తం చదివే తీరిక లేక రిక్రూటర్లు పక్కన పెట్టే ప్రమాదముంటుంది. కవర్‌లెటర్‌ను కూడా జత చేయాలి. ఇది రెజ్యూమెకు ప్రతిబింబంలాగా ఉండాలి. సదరు ఉద్యోగానికి మీరు ఏ విధంగా అర్హులు, మిమ్మల్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలో అందులో పేర్కొనాలి. ఇది నచ్చితే రిక్రూటర్లు తప్పక మీ రెజ్యూమెను పరిశీలిస్తారు.
అసలు అక్కడ ఏం పేర్కొనాలి?
అన్ని రెజ్యూమెల్లోనూ విద్యార్హతలు, చిరునామా తదితర విషయాలు మారవు. మారేదల్లా నైపుణ్యాలు, అర్హతలు, అనుభవం, ఆసక్తి, గతంలో సాధించిన విజయాలు వంటి సమాచారమే. అందువల్ల ఈ అంశాలను మొదట్లోనే వచ్చేలా జాగ్రత్తపడాలి. దీంతో ప్రతి రెజ్యూమెలోనూ ఉద్యోగానికి తగినట్లు మార్చుకొనే వీలుంటుంది. నైపుణ్యాలు, ప్రతిభ, ప్రత్యేకలను వివరంగా.. తక్కువ పదాల్లో వెల్లడించాలి. సంస్థ ఆశించే నైపుణ్యాలు, అనుభవం మీలో ఉంటే వాటిని ప్రముఖంగా ప్రస్తావించాలి. గత ఉద్యోగాల్లో మీరు సాధించిన అంశాలు ఏవైనా ఉంటే వాటిని సవివరంగా ప్రస్తావించాలి. మీ పనితీరుతో గతంలో సాధించిన ప్రత్యేక ఫలితాలను వెల్లడించాలి. వీటిని కూడా అన్ని ఉద్యోగాలకూ కాకుండా ఒక్కో కొలువుకు ఒక్కో విధంగా పేర్కొనాలి.
సంస్థకు అవసరం లేని నైపుణ్యాలను, అర్హతలను వెల్లడించాల్సిన అవసరం లేదు. ఇవి వెల్లడించడం వల్ల రిక్రూటర్లు మీరు ఆయా రంగాలకు సంబంధించిన అంశాలకే సరిపోతారని భావించి మీ దరఖాస్తులను పక్కన పెట్టే ప్రమాదం ఉటుంది. నైపుణ్యాలు కూడా సంస్థకు అవసరమైనవి, తాజాగా సాధించినవి ఉంటే వాటినే మొదట పేర్కొనాలి. ఒక్కోసారి మీరు గతంలో సాధించిన నైపుణ్యాలు ప్రస్తుతం అవసరం లేకపోవచ్చు. అలాంటపుడు వీటిని ప్రధానంగా ప్రస్తావించవద్దు. ఎప్పుడూ సంస్థకు కావాల్సిన అంశాలనే వెల్లడించాలి.
రెజ్యూమెలో సాధారణ విషయాలను కూడా పెద్దగా చెప్పాల్సిన పని లేదు. కాస్త ప్రత్యేకంగా అనిపించినవి.. గొప్పగా ఉన్నవాటినే ప్రస్తావించాలి. అలాంటివి ఏమీ లేకుంటే ఎందుకు సాధించలేకపోయారో ఒక మాటలో చెబితే సరి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి కొన్ని సాధనలు, విజయాలు, అనుభవాలు ఉంటాయి. వీరు సాధారణ విషయాలకు బదులు తాము సాధించిన వాటిని వెల్లడించవచ్చు. అప్పుడే చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెదుకుతున్నవారు తాము ఎంచుకున్న రంగంలో, కళాశాల స్థాయిలో సాధించిన విజయాలను వెల్లడించాలి. మంచి ప్రాజెక్ట్‌లు చేసి ఉంటే వాటిని తప్పకుండా ప్రస్తావించాలి. ఆయా ప్రాజెక్ట్‌ల వివరాలను పూర్తిగా వెల్లడించలేం కనుక వాటికి సంబంధించిన వెబ్‌సైట్‌ లేదా బ్లాగ్‌ లేదా ఇతర లింక్‌లను రెజ్యూమెలో వెల్లడించవచ్చు.
రెజ్యూమెలో మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌, ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం చిరునామాలను మాత్రమే వెల్లడిస్తే సరిపోతుంది. వీటితో పాటు ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్లస్‌, ట్విట్టర్‌, ఇతర సామాజిక అనుసంధాన వేదికల చిరునామాలను ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017