వీడియో ఇంటర్వ్యూ ఇలా విజయవంతం

హైదరాబాద్‌లో ఉంటున్న సత్య ఢిల్లీకి చెందిన కంపెనీలో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. అతని అర్హతలు, నైపుణ్యాలు రిక్రూటర్లకు నచ్చాయి. దీంతో వాళ్లు ఇంటర్వ్యూకి సంబంధించిన కబురు పంపారు. మర్నాడు ఉదయం పదకొండు గంటలకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. వెంటనే స్కైప్‌ ఐడీ పంపాల్సిందిగా కోరారు. ఇది సత్యకు అనూహ్యపరిణామంగా మారింది. తాను స్కైప్‌ ఐడీ పంపి వీడియో ఇంటర్వ్యూకి హాజరయ్యారు. కానీ దాని గురించిన సరైన అవగాహన లేక విజయవంతంగా పూర్తి చేయలేకపోయారు. ఉద్యోగాల కోసం వెదుకుతున్నపుడు ఒక్కోసారి మీకూ ఇలాంటి అనూహ్య పరిణామం ఎదురుకావొచ్చు. అందువల్ల వీడియో ఇంటర్వ్యూకి హాజరైనపుడు దాన్ని విజయవంతంగా ఎలా ముగించాలో తెలుసుకోవడమూ ముఖ్యమే.
పెరుగుతున్న ఆదరణ
సంస్థలు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేసేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతాయి. అయితే అభ్యర్థి ఉంటున్న ప్రదేశానికి సంస్థ కార్యాలయానికి దూరం ఎక్కువైనపుడు.. రిక్రూటర్లకు సమయం తక్కువగా ఉన్నపుడు వీడియో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఒక అధ్యయనం ప్రకారం గతేడాది పది శాతం సంస్థలు ఎప్పుడో ఒక సందర్భంలో ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహించగా ఈ ఏడాది 21 శాతం సంస్థలు ఈ విధానాన్ని అనుసరించాయి. దీన్నిబట్టి చూస్తే వీడియో ఇంటర్వ్యూకి ఆదరణ క్రమంగా పెరిగే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది. అందువల్ల ఆన్‌లైన్‌ ముఖాముఖికి ఎలా సన్నద్ధం కావాలో చూద్దాం.
ఇంట్లోనే మంచిది
వీడియో ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి వచ్చినపుడు ఇంట్లో కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ ఉంటే సరి. లేకుంటే వాటిని తాత్కాలికంగా అయినా ఏర్పాటు చేసుకోవాలి. బ్రౌజింగ్‌ సెంటర్లున్నా అక్కడ అవాంతరాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల వీడియో ఇంటర్వ్యూకి వీలైనంత వరకు ఇంట్లోనే ఏర్పాట్లు చేసుకోవాలి. రిక్రూటర్లకు ముందుగానే స్కైప్‌ లేదా ఇతర ఆన్‌లైన్‌ వీడియో చాటింగ్‌ వేదికల ఐడీలు ఇచ్చి.. వారు సూచించిన సమయానికల్లా కొంచెం ముందుగానే లాగిన్‌ అయి ఉండాలి.
చూపు తిప్పవద్దు
ఇక్కడ మీరు ప్రత్యక్షంగా కరచాలనం చేయలేకపోవచ్చు. కాని రిక్రూటర్లకు చక్కని పలకరింపుతో ఆకట్టుకోవచ్చు. ఇంటర్వ్యూ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేదాకా వెబ్‌క్యామ్‌నే చూడాలి. స్క్రీన్‌ చూస్తూ మాట్లాడవద్దు. దీనివల్ల రిక్రూటర్లకు మీ హావభావాలు అర్థంకావు. ఇంటర్వ్యూ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తపడాలి. మీ బ్రాక్‌గ్రౌండ్‌ కూడా చక్కగా ఉండాలి. వెనక ఇతరులు కనిపించేలా.. బొమ్మలు ఇతర వస్తువులు ఉండకుండా జాగ్రత్తపడాలి. దరఖాస్తు సమయంలో జత చేసిన పత్రాలు, ఇతర అవసరమైన సమాచారాన్ని అంతా మీ దగ్గరే ఉంచుకోవాలి. ఒక్కసారి ఇంటర్వ్యూ మొదలైతే అది పూర్తయ్యే వరకూ మీరు తెర నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉండదు. అందువల్ల అన్నీ ముందుగానే అందుబాటులో ఉండేటట్లు సిద్ధం చేసుకోవాలి.
ఇంటర్వ్యూ పూర్తయ్యే వరకూ మీ చూపు కెమెరా నుంచి మరల్చవద్దు. ప్రత్యక్ష ఇంటర్వ్యూకి హాజరైనపుడు ఎలా ప్రవర్తిస్తారో ఇక్కడ కూడా అలాగే వ్యవహరించాలి. ఇంట్లో ఉన్నా ఇంటర్వ్యూ గదిలో ఉన్నట్లే భావించాలి. వేషధారణ కూడా చాలా హుందాగా ఉండేటట్లు చూసుకోవాలి. మీరు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో ఉన్నపుడు స్క్రీన్‌పై ఇతర వెబ్‌సైట్లు, ప్రోగ్రాంలు ఉంటే అవి ఒక్కోసారి ఆటంకం కలిగించవచ్చు. అందువల్ల ముఖాముఖి మొదలయ్యేలోపు సదరు వీడియో చాట్‌ అప్లికేషన్‌ తప్ప మిగతావన్నింటనినీ మూసేయండి.
అభ్యాసం చాలా ముఖ్యం
ఇప్పటి వరకూ వీడియో ఇంటర్వ్యూ అనుభవం లేకుంటే ఒక్కసారి అభ్యాసం చేయడం మంచిది. స్నేహితులు లేదా కుటుంబికులతో ఒకసారి వీడియో ఇంటర్వ్యూని నిర్వహించుకోండి. దీనివల్ల ఆచరణలో ఎదురయ్యే సమస్యలు తెలుస్తాయి. అసలు ఇంటర్వ్యూలో ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ప్రత్యక్షంగా మాట్లాడేటపుడు ఆన్‌లైన్‌లో మాట్లాడేటపుడు స్వరంలో తేడాలు ఉంటాయి. వీటిని ముందుగానే గుర్తించి మీ స్వర స్థాయి ఏమేరకు ఉంటే అవతలివైపు వినసొంపుగా ఉంటుందో కూడా తనిఖీ చేయాలి. లేకుంటే మీ మాటలు అవతలివారికి మరీగట్టిగానో లేకుంటే తక్కువ శబ్ధంతో వినిపించవచ్చు.
ఇదే అంతిమం కాదు
ఇక రిక్రూటర్ల ప్రశ్నలకు సమాధానాలు, ఇతర విషయాలన్నీ వ్యక్తిగత ఇంటర్వ్యూలోలాగానే ఉంటాయి. అందువల్ల నైపుణ్యాలు, అర్హతలు, ఇతర అంశాలకు సంబంధించి ముందుగా కాస్త కసరత్తు చేయాలి. ఎప్పుడూ వీడియో ముఖాముఖే చివరిదని భావించవద్దు. ఇక్కడ మీరు విజయవంతంగా పూర్తి చేస్తే రిక్రూటర్లు మిమ్మల్ని మరోసారి ప్రత్యక్ష ఇంటర్వ్యూకి హాజరుకావాల్సిందిగా కోరవచ్చు. అందువల్ల ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూనే అంతిమం కాదన్న విషయాన్నీ గుర్తుంచుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత వెంటనే కెమెరాను బంద్‌ చేయవద్దు. ఇంటర్వ్యూ పూర్తయితే రిక్రూటర్లే మీ నుంచి వైదొలగతారు. అప్పటిదాకా వేయి ఉండండి. వారు ఎంతసేపటికీ వైదొలగకుంటే ''నేనిక నిష్క్రమించవచ్చా..'' అని ఒకసారి అడగండి.
ముఖ్యంగా..
* ప్రశాంతమైన వాతావరణం ఉండేలా శబ్ధకాలుష్యం.. లేకుండా చూసుకోవాలి
* తగినంత వెలుతురు.. మీ నుదుటికి నేరుగా చేయి చాపితే తగలనంత దూరంగా వెబ్‌క్యామ్‌ ఉండాలి
* అవతలి వారికి మీ మిమ్మల్ని స్పష్టంగా చూపేలా మంచి వెబ్‌క్యామ్‌ ఉండాలి.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017