ఉద్యోగంలో బాస్ చాలా కీలకం. వారి సిఫార్సులపైనే ఆ సంస్థలో ప్రగతి ఆధారపడి ఉంటుంది. ఉద్యోగమూ సాఫీగా సాగిపోతుంది. కొందరు బాస్‌లు సిబ్బందితో చాలా చనువుగా ఉంటూ.. బాగా ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలు రాబడుతుంటారు. మరికొందరు మాత్రం అలా ఉండరు. ఎవరు ఎలా ఉన్నా.. వృత్తి జీవితంలో పై అధికారితో నిత్యం సంప్రదింపులు తప్పవు. అలాంటపుడు వారితో ఎలా మెలగాలి. ఏఏ విషయాలు చెప్పాలి. ముఖ్యంగా చెప్పకూడనివి ఏంటి..
ఇది నా పని కాదు
ఒక్కోసారి మీకు సంబంధం లేని పనులను బాస్ అప్పజెబుతూ ఉంటారు. అలాంటపుడు ఇది నా పని కాదు. నేను చేయలేను అని ఎప్పుడూ చెప్పకూడదు. ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే. ఒక్కోసారి కొత్తదనం కోసం ఆ పని అప్పజెప్పి ఉండొచ్చు. అప్పగించే ముందు బాస్ మీ సామర్థ్యాన్ని అంచనా వేసి ఉంటారన్న సంగతి గుర్తించాలి. నిజంగా ఆ పని చేయలేకున్నా వీలైనంత వరకు నిజాయతీగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.