చక్కగా వింటేనే ఉద్యోగం
సంస్థకు పది మంది కావాలంటే.. యాభై మందిని ఇంటర్వ్యూకి పిలవడం.. అక్కడ వారిని వడబోసి తగిన అభ్యర్థులను ఎంచుకోవడం పాత పద్ధతి. ఇలా ఎక్కువ మందిని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేయడం వల్ల విలువైన సమయం వృథా.. అనవసర ప్రయాసని సంస్థలు భావిస్తున్నాయి. ఫలితంగానే టెలిఫోన్ ఇంటర్వ్యూలు తెరపైకి వచ్చాయి. ఇంటర్వ్యూకి పిలిచే ముందు అభ్యర్థులను ఒకసారి ఫోన్‌లో ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఇక్కడ విజయవంతమైతేనే వారిని తుది ఇంటర్వ్యూలకు పిలుస్తున్నాయి.

ఫలితంగా ప్రస్తుతం ఫొన్ ఇంటర్వ్యూలు సర్వత్రా సాధారణమైపోయాయి. మరి వీటిలో నెగ్గాలంటే.. ఈ సూచనలు పాటించాలంటున్నారు నిపుణులు.

మీరు తగిన అభ్యర్థి అని భావిస్తేనే ఆ సంస్థ మిమ్మల్ని ఫోన్‌లో ఇంటర్వ్యూ చేస్తుంది. కనుక ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. ఇక్కడ ఇంటర్వ్యూ చేసే అభ్యర్థిని చూడలేరు. మీ సమాధానాలకు వారి స్పందన కూడా సరిగా తెలియదు. కనుక కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అవతలి వ్యక్తి చేప్పే విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం.. ఫోన్ సంభాషణల్లో సహజం. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అడిగే ప్రశ్నను సరిగా అర్థం చేసుకోకుంటే పొంతనలేని సమాధానాలు చెప్పే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు ఇంటర్వ్యూపై సరిగా ఆసక్తి చూపడం లేదని సంస్థ ప్రతినిధి భావించే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా వినాలి.

ఫోన్‌లో ఇంటర్వ్యూ చేసే సమయాన్ని ఆ సంస్థ ముందే తెలియజేస్తుంది. ఆ సమయానికి మొబైల్‌ను పూర్తిగా ఛార్జ్ చేసి పెట్టుకోవాలి. వచ్చిన కాల్‌ను ప్రశాంత వాతావరణంలో తీయాలి. ఉండే చోటు సిగ్నల్స్‌కు.. మీకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలి. ఆ ప్రాంతంలో ఇతర శబ్దాలు రాకుండా జాగ్రత్త పడాలి. సమీపంలోని ఫోన్‌లను ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచాఫ్ చేయాలి. ఆ సమయంలో ఇతరులు ఎవరైనా కాల్ చేస్తే.. మీ ఫోన్‌లో 'లైన్ వెయిటింగ్' శబ్దాలు రాకుండా ముందే సెట్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తల వల్ల ఎలాంటి చిన్నచిన్న ఆటంకాలూ తలెత్తవు.

అతి మౌనం పనికిరాదు: పోన్‌లో మాట్లాడుతున్నపుడు ఎక్కువసేపు మౌనంగా ఉండకూడదు. మ్.. ఆ.. వంటి ఊనికలను సాగ తీయకూడదు. వీటి వల్ల మీ విశ్వాసం, పరిజ్ఞానంపై సంస్థ ప్రతినిధికి అనుమానం కలుగుతుంది. మిమ్మల్ని అవతలి వ్యక్తి చూడటం లేదు కనుక ఇలాంటి అనవసర ఊనికలు, మౌనం గందరగోళం సృష్టిస్తాయి. ఒకవేళ సమాధానం చెప్పేందుకు కొంచెం ఆలోచించుకోవాలంటే ఆ విషయాన్ని నేరుగా చెప్పాలి.

ఫోన్ వచ్చాక అవతలి వ్యక్తి అడిగే సమాచారం కోసం పత్రాలను వెదుక్కోవడం కన్నా ముందే వాటిని దగ్గర ఉంచుకోవాలి. ఆ సమాచారాన్ని అంశాల వారీగా ఉంచుకొంటే వెంటనే సమాధానం చెప్పేందుకు వీలుంటుంది. ఇలా చేయడం వల్ల అనవసర గందరగోళం తప్పుతుంది. కొన్ని అంశాలను కంప్యూటరులో చూసి చెప్పాల్సి ఉంటే.. వాటికి సంబంధించిన ఫోల్డర్లను ముందే తెరచి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తికి సమయం వృథాకాదు. మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది.

ఇవి చేయకూడదు: ఫోన్‌లో మాట్లాడేటపుడు వీలైనంత వరకు హెడ్ ఫోన్లను వాడాలి. వీటి వల్ల అవతలి వ్యక్తి చెప్పేది మీకు.. మీరు చెప్పేది అవతలి వ్యక్తికి స్పష్టంగా వినిపిస్తాయి. అంతేకాని లౌడ్ స్పీకర్ ఆన్ చేయకూడదు.

ఒక్క విషయం: ఫోన్ ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ మిమ్మల్ని తదుపరి పరీక్షకు అనుమతించాలా లేదా అనేది మాత్రమే నిర్ణయిస్తుంది. ఇది కేవలం స్క్రీనింగ్ ఇంటర్వ్యూ మాత్రమే. ఇది పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చేసిందనుకోవడం సరికాదు. ఫోన్ ఇంటర్వ్యూతో పాటు చాలా అంశాలను సంస్థ పరిశీలించాల్సి ఉంటుంది. కాని ఇక్కడ విఫలమైతే మాత్రం ముందుకు వెళ్లడం కష్టం. ఫోన్ ఇంటర్వ్యూల్లో ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం ప్రధానం.