మీ మనసేంటో!
మీరేంటో.. మీ రెజ్యూమె చూస్తే తెలిసిపోతుంది. మీ ప్రతిభేంటో.. నాలుగు ప్రశ్నలడిగితే బయటకొస్తుంది. మరి మీ మనస్తత్వం... వ్యక్తిత్వం..?
ఇదే ప్రశ్న ఉద్యోగాలు కల్పిస్తున్న వందల సంస్థలకు తలెత్తుతోంది. దీంతో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేటపుడు ప్రతిభ, నడవడితో పాటు మనస్తత్వాన్ని తెలుసుకొనేందుకూ అవి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎక్కువ సంస్థలు అభ్యర్థులకు మనస్తత్వ పరీక్ష (సైకోమెట్రిక్ టెస్ట్) నిర్వహించి దాని ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నాయి. అభ్యర్థి వ్యక్తిత్వం, మంచితనం, మనస్తత్వం, ఆసక్తులు, ఉద్యోగం పట్ల అంకిత భావం, ఉత్సాహం, నైతిక విలువలు, నిర్ణయాలు తీసుకొనే పరిపక్వత తదితరాలను తెలుసుకోవడం ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం. ఒక్కమాటలో చెప్పాలంటే సదరు అభ్యర్థి ఆ ఉద్యోగానికి సమర్థుడా కాదా అనేది నిర్ణయించడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ముఖ్యంగా పదోన్నతుల్లో ఈ పరీక్షకు చాలా ప్రాధాన్యం ఉంది. ఒక పదవికి వందశాతం తగిన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఎక్కువ మంది విశ్వసిస్తున్న మార్గం ఇదే.


సైకోమెట్రిక్ పరీక్షలో రెండు రకాలుంటాయి. అభ్యర్థి సామర్థ్యాన్ని గుర్తించేది ఒక రకం. అభ్యర్థి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేసేది మరో రకం. వ్యక్తిత్వ పరీక్షలో వ్యక్తి అభిప్రాయాలు, భావనలు, ఆలోచనలు, నడవడికకు సంబంధించిన ప్రశ్నలు వేసి వాటితో అతని మనస్తత్వాన్ని అంచనా వేస్తారు. సమయస్ఫూర్తి, నిర్ణయాలు తీసుకొనే స్థాయికి సంబంధించిన అంచనా కూడా ఉంటుంది. వీటి ద్వారా అతను ఆ ఉద్యోగానికి సరిపోతారో లేదో గుర్తిస్తారు. మరోటి సమర్థతకు సంబంధించిన పరీక్ష. ఇక్కడ ఆంగ్ల/మాతృభాష పదాలపై పట్టు, వ్యాకరణం, గణితంలో సత్తా, మేధోస్థాయి, సమయపాలన తదితరాలు పరీక్షిస్తారు. వృత్తిపై అవగాహన, ఉత్సాహం, కార్యాలయంలో మీ నడవడిక వంటి అంశాలను తెలుసుకొనేందుకు నిర్వహిస్తారు.

చాలా మందికి ఈ పరీక్షపై సరైన అవగాహన లేకుండా అపార్థం చేసుకొంటారు. సైకోమెట్రిక్ పరీక్షలంటే అంటే వ్యక్తిత్వం గురించి తెలుసుకోడానికే అనుకొంటారు. వాస్తవానికి వ్యక్తిత్వానికి సంబంధించిన పరీక్షలు అన్నీ సైకోమెట్రిక్ పరీక్షలే. కాని సైకోమెట్రిక్ పరీక్షలన్నీ వ్యక్తిత్వ పరీక్షలు కావు.

ఇది చాలా ముఖ్యం
వ్యక్తిత్వ పరీక్షలో వైఫల్యం అంటూ ఏమీ ఉండదు. వాస్తవానికి ఇది పరీక్ష కాదు. మీ మనసు తెలుసుకోవడమే ఇక్కడ ముఖ్యం. మీరు చెబుతున్న సమాధానం సరైందా, కాదా అన్నది ఇక్కడ అప్రధానం. మంచి వారా.. లేకుంటే చెడ్డవారా అనీ ఇక్కడ ఆరా తీయరు. మీరు ఆ ఉద్యోగానికి సరిపోతారా లేదా అన్నది మాత్రమే చూస్తారు.

ఈ పరీక్షలో రాణించాలంటే?
మనస్తత్వ పరీక్షల గురించి తెలుసుకోవాలి.
అసలుపరీక్షకు ముందు నమూనా పరీక్షల్లో పాల్గొనాలి.
పలు రకాల ప్రశ్న పత్రాలకు సమాధానాలు రాసి అభ్యాసం చేయాలి.
అభ్యాస సమయంలో సమయపాలననూ అలవాటు చేసుకోవాలి.
ఈ పరీక్షలో కొన్ని నకిలీ ప్రశ్నలుంటాయి. మీరు వాస్తవాలే చెబుతున్నారా... వాస్తవాలు దాస్తున్నారా.. అన్నది అంచనా వేయడానికే ఈ నకిలీ ప్రశ్నలు. కాబట్టి వాస్తవాలు చెప్పడానికే ప్రయత్నించండి. నిజాలు దాచినా, అబద్ధాలు చెప్పినా పసిగట్టేలా ప్రశ్నలు ఉంటాయి.
ఏ ప్రశ్న వేసినా సానుకూల దృక్పథంలో ఆలోచించాలి.
అంతర్జాలంలో పలు రకాల ఆన్‌లైన్ ప్రశ్న పత్రాలు అందుబాటులో ఉన్నందున వాటితో ఎక్కువ అభ్యాసం చేయాలి. ఇలా పదే పదే అభ్యాసంతో మీకు ఈ పరీక్షపై, ప్రశ్నల సరళిపై అవగాహన పెరుగుతుంది.