జాబితాతో చికాకులకు చెక్
కుమార్ నిత్యం చాలా పనులు చేయాల్సి ఉంటోంది. వాటిలో కొన్ని మరిచిపోతున్నారు.. వాటిని సకాలంలో చేయలేక ఇబ్బందులు. దీంతో ఒత్తిడి. అనారోగ్యం. కాని రమణి మాత్రం ఆయనకన్నా రెట్టింపు పనులను అలవోకగా చేస్తున్నారు. ఒత్తిడిని దరి చేరనీయక పనిని హాయిగా ఆస్వాదిస్తున్నారు. ఇంట్లో పనులూ నిముషాల్లో చక్కబెడుతున్నారు. ఎలా..?
సమాధానం ఒకటే. కుమార్ చేయాల్సిన పనులపై ముందే దృష్టి పెట్టడం లేదు. రమణి ముందుగానే చేయాల్సిన పనుల జాబితాను సిద్ధం చేసుకొని వాటి ప్రకారం నడచుకొంటోంది.


ఇదీ పనుల జాబితాకు ఉన్న ప్రత్యేకత. పనుల జాబితాను రూపొందించుకోవడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు నిద్రలేచింది మొదలు పడుకొనేదాకా మన దృష్టి పనుల నుంచి ఇతర అంశాలవైపు మళ్లకుండా ఉంటుంది. ఫలితంగా పనులు సకాలంలో పూర్త్తె ఒత్తిడి లేకుండా జీవించొచ్చు. ఇవే కాకుండా ఈ జాబితా వల్ల చాల ప్రయోజనాలున్నాయి. చేయాల్సిన పనుల జాబితా రాసుకొన్నపుడు అవి ఎప్పుడు ఎలా పూర్తి చేయాలో అన్న ప్రణాళిక కూడా మీ మనసులో సిద్ధమౌతుంది. ఈ ప్రణాళికతో ఎక్కువ పనులు పూర్తిచేయడం.. సకాలంలో కార్యాలయం నుంచి ఇంటికి చేరుకోవడం తదితర ప్రయోజనాలుంటాయి. ఈ పనుల కేవలం ఉద్యోగులకే కాకుండా సాధారణంగా అందరికీ ముఖ్యమైనా తీరికలేని జీవితంతో కూడుకున్న ఉద్యోగికి మాత్రం ఇది తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

ఎలా రాసుకోవాలి: పనుల జాబితా తయారీకి గట్టిగా పది నిముషాలు పట్టదు. కాని ఈ సమయం ఎప్పుడు కేటాయించాలన్నదే ప్రశ్న. నిద్రలేచినపుడు.. లేదా పడుకోబోయే ముందు ఈ జాబితాను సిద్ధం చేసుకోవడం మంచిది. ఓ కాగితంపై రాసుకొని పర్సులో పెట్టుకోవడం కన్నా దీన్ని ఎలక్ట్రానిక్ రూపంలో అంటే.. మొబైల్స్, కంప్యూటరులో నిక్షిప్తం చేసి ఉంచుకొంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. వీటి వల్ల మనం చేయాల్సిన పనిని మరిచిపోయినా సకాలంలో హెచ్చరికలు అందుతాయి. ఒకవేళ రోజూ కుదరకుంటే వారాంతంలోనూ పనుల జాబితాను సిద్ధం చేసుకోవచ్చు. కొందరు ఈ పనుల జాబితానూ మనసులో ఉంచుకొనీ వాటిని సకాలంలో పూర్తి చేస్తుంటారు. అలాంటి వారూ ఆ పనులను రాసిపెట్టుకోవడం మంచిది.

విశ్రాంతీ ముఖ్యమే: చాలా మంది పనుల జాబితాను తయారు చేసేటపుడు పనులకే అధిక ప్రాధాన్యం ఇస్తారు కాని విశ్రాంతికి సమయం ఇవ్వరు. దీని వల్ల రోజంతా పనులతో అలసిపోయి డీలా పడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల పనుల జాబితాను సిద్ధం చేసేటపుడు విశ్రాంతికి కావాల్సిన సమయాన్నీ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

ఏరోజుకారోజు కాకుండా వారాంతంలో.. ఈ పనుల జాబితా సిద్ధం చేసుకొనే వారికి కొన్ని అదనపు ప్రయోజనాలున్నాయి. ఒకరోజు తక్కువ పనులు ఉండటం.. లేకుంటే త్వరగా పూర్తి చేసినపుడు తర్వాతి రోజు చేయాల్సిన పనుల జాబితా ముందే ఉంటుంది కనుక వాటినీ త్వరగా పూర్తి చేసుకొనేందుకు వీలుంటుంది. ముఖ్యంగా పనుల జాబితాను ప్రాధాన్యమైన అంశాల వారీగా రాసుకోవాలి. వీటివల్ల ఎక్కువ ప్రాధాన్యమున్న పనులను త్వరగా పూర్తి చేసి అప్రాధాన్యమైన వాటిని తర్వాత పూర్తి చేయొచ్చు. ఇలా పనుల జాబితాకు గోరంత సమయం కేటాయించడం వల్ల జీవితంలో కొండంత సమయం ఆదా అవుతుంది.
మీకు తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా 63 శాతం మంది ఉద్యోగులు మాత్రమే చేయాల్సిన పనుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. ఈశాతం భారత్‌లోనూ ఇంతే.
ఈ జాబితా తయారీలో భారత్‌ది ఆరో స్థానం.
ప్రపంచ వ్యాప్తంగా 60% పురుషులు, 71% మహిళలు ఈజాబితాను అనుసరిస్తున్నారు.
భారత్‌లో 45 శాతం మంది ఈ జాబితాను కాగితాల్లో రాసుకొంటుండగా 48 శాతం మంది ఎలక్ట్రానిక్ రూపంలో తయారు చేసుకొంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం మంది పనుల జాబితాను రాసుకొంటుండగా 45 శాతం మంది ఎలక్ట్రానిక్ రూపంలో సిద్ధం చేసుకొంటున్నారు. తక్కిన అయిదు శాతం మంది మనసులో.. చాక్‌బోర్డులపై రాసుకొంటున్నారు.