LIC - Assistant Administrative Officer

ఎల్‌ఐసీలో 590 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు

ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్‌ఐసీ 590 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏఏవో) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. వీటిలో జనరలిస్ట్‌ విభాగంలో 350 ఖాళీలు ఉన్నాయి. సాధారణ డిగ్రీ విద్యార్హతతోనే ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ప్రాథమిక, ప్రధాన, మౌఖిక పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఇంగ్లిష్‌ విభాగంలో అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇది ఎంతో సానుకూలాంశం. ప్రాథమిక పరీక్షకు సరిగ్గా 60 రోజుల వ్యవధి ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తాజా అభ్యర్థులు సైతం ప్రధాన పరీక్షకు ఎంపిక కావచ్చు. ఇప్పటికే ఐబీపీఎస్, ఎస్‌బీఐ పీవో పరీక్షలకు సన్నద్ధం అవుతున్నవాళ్లు, గతంలో రాసినవాళ్లు ఆ సన్నద్ధతతోనే ప్రాథమిక పరీక్షను ఎదుర్కోవడం సాధ్యమే.

ప్రాథమిక పరీక్ష ఇలా..
వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్‌ ఎబిలిటీ 35, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 35, ఆంగ్ల భాష (వ్యాకరణం, పదసంపద, గ్రహణ) నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. పరీక్ష వ్యవధి గంట. ప్రతి విభాగాన్నీ 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. విభాగాలవారీ కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి. రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఒక్కో విభాగం నుంచి 18 మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలైతే 16 చొప్పున సాధిస్తే సరిపోతుంది. ఆంగ్లంలో 10 రావాలి. ఎస్సీ, ఎస్టీలైతే 9 సాధించాలి. ఇక్కడ అంగ్లంలో అర్హత సాధిస్తే చాలు. తర్వాతి దశ ఎంపికకు ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఆంగ్లాన్ని మినహాయించి మిగిలిన 70 మార్కులకు గాను అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి ఆయా విభాగాలవారీ ఉన్న ఖాళీలకు 20 రెట్ల అభ్యర్థులను తర్వాతి దశ పరీక్షకు ఎంపికచేస్తారు.

ప్రధాన పరీక్ష ఇలా..
300 మార్కులకు ఆబ్జెక్టివ్, 25 మార్కులకు డిస్క్రిప్టివ్‌ విధానంలో ప్రధాన పరీక్ష ఉంటుంది. ఈ రెండూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ పరీక్ష పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్‌ మొదలవుతుంది. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి ఆబ్జెక్టివ్‌ పరీక్షలో స్వల్ప మార్పులు ఉంటాయి.

జనరలిస్ట్‌ ప్రశ్నపత్రం ఇలా: రీజనింగ్‌ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. వీటికి 90 మార్కులు. 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఈ విభాగంలో అర్హత కు 45 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలైతే 40 మార్కులు సరిపోతాయి. జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో 30 ప్రశ్నలు వస్తాయి. వీటికి 60 మార్కులు. 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. 30 మార్కులు సాధిస్తే అర్హత లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీలైతే 27 తప్పనిసరి. మరో విభాగం డేటా ఎనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. వీటికి 90 మార్కులు. 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఈ విభాగంలో అర్హత కు 45 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలైతే 40 మార్కులు సరిపోతాయి. ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ మార్కెట్‌ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. వీటికి 60 మార్కులు. 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. 30 మార్కులు సాధిస్తే అర్హత లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీలైతే 27 తప్పనిసరి. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి మొత్తం 2 గంటలు. అనంతరం డిస్క్రిప్టివ్‌ పరీక్ష మొదలవుతుంది. ఇందులో ఆంగ్లభాషలో ఇచ్చిన అంశం నుంచి లేఖ, వ్యాసం 30 నిమిషాల వ్యవధిలో రాయాలి. ఈ విభాగంలో అర్హత సాధించడానికి కనీసం 10 మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలైతే 9 సరిపోతాయి. ఆంగ్ల విభాగంలో అర్హత సాధిస్తే సరిపోతుంది. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.

ఐటీ, చార్టర్డ్‌ అకౌంటెంట్, యాక్చూరియల్, రాజభాష అధికారి: ఈ విభాగాల్లో డేటా ఎనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ ప్రిటేషన్‌ బదులు ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. వీటికి 90 మార్కులు.40 నిమిషాల్లో పూర్తిచేయాలి. కనీసం 45 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలకు 40 సరిపోతాయి. మిగిలిన ప్రశ్నపత్రం అంతా జనరలిస్ట్‌ మాదిరిగానే ఉంటుంది. రాజభాష అధికారి పోస్టులకు మాత్రం డిస్క్రిప్టివ్‌ పరీక్షలో స్వల్ప మార్పులు ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ భాషల్లో అభ్యర్థి ప్రావీణ్యాన్ని తెలుసుకుంటారు. ప్రధాన పరీక్షలో అన్ని విభాగాల్లో అర్హత సాధించిన సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి మెరిట్‌ ప్రకారం ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలకు 3 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు.

మౌఖికం..
60 మార్కులకు ఉంటుంది. ఇందులో 30 మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీలైతే 27 తప్పనిసరి. ఇలా అర్హత సాధించిన వారి జాబితాకు ప్రధాన పరీక్షలో పొందిన మార్కులను జతచేసి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం తుది నియామకాలు చేపడతారు. ప్రాథమిక పరీక్షలో సాధించిన మార్కులను తుది నియామకాల్లో పరిగణనలోకి తీసుకోరు.

సన్నద్ధత ఇలా...
ప్రాథమిక పరీక్ష పూర్తిగా ఐబీపీఎస్, ఎస్‌బీఐ పీవో స్టేజ్‌-1 మాదిరిగానే ఉంటుంది. ఇప్పటికే బ్యాంకు పీవో పరీక్షలకు సన్నద్ధం అవుతున్నవారు ప్రిలిమ్స్‌ విషయంలో అదే సన్నద్ధతతో సిద్ధం కావచ్చు. ఆయా విభాగాలవారీ సమయాన్ని, కనీస మార్కులను నిర్దేశించారు. వ్యవధిలోగా ఎక్కువ ప్రశ్నలు పూర్తిచేయడానికి, కనీస మార్కులు సాధించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి. అనంతరం అదనపు మార్కులకోసం కసరత్తు చేయాలి.

ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ ప్రాధాన్యంగా ఉన్నవి రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ ఎనాలసిస్‌ (జనరలిస్టు పోస్టులకు). మార్కుల పరంగా చూసినా.. ప్రాథమిక పరీక్షలో 70, ప్రధాన పరీక్షలో 180 అంటే రెండింటిలోనూ కలుపుకుని 400 కుగానూ కేవలం ఈ విభాగాల నుంచే 250 మార్కులు వస్తున్నాయి. అందువల్ల అధిక ప్రాధాన్యతతో వీటిని చదువుకోవాలి.

ఆంగ్లంతో ఇబ్బందిలేనివాళ్లు ఆ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి అవసరం లేదు. తెలుగు మీడియం నేపథ్యం వారుమాత్రం కనీస మార్కుల సాధన దిశగా కృషి చేస్తే సరిపోతుంది.

కొత్తగా పోటీ పరీక్షలు రాస్తున్నవారు ఆయా విభాగాల్లో ప్రాథమికాంశాల నుంచి అధ్యయనం ప్రారంభించాలి. ప్రాథమిక పరీక్షకు సరిగ్గా 60 రోజుల వ్యవధి ఉంది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రధాన పరీక్షకు అర్హత సాధించడానికి ఈ గడువు సరిపోతుంది. ఒక్కోరోజు ఒక్కో పాఠ్యాంశాన్ని బాగా చదువుకున్నా చాలు. రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ల సన్నద్ధతకు 40 రోజులు, ఆంగ్లం కోసం 10 రోజులు కేటాయించుకోవచ్చు.

పరీక్షకు ముందు అంటే మిగిలిన పది రోజులు కనీసం 20 మాక్‌ పరీక్షలు రాయాలి. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయగలుగుతున్నారా, ఎన్ని మార్కులు సాధిస్తున్నారు గమనించాలి. రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ల్లో కనీస అర్హత మార్కులు సాధిస్తూ రెండూ కలిపి కనీసం 45 మార్కులకు తగ్గకుండా వచ్చినట్లు చూసుకుంటే ప్రధాన పరీక్షకు ఎంపికవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెనుకబడిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే రీజనింగ్, క్వాంటిటేవి్ ఆప్టిట్యూడ్‌ల్లో బాగా కష్టంగా అనిపించిన ఒకటి రెండు చాప్టర్లు మినహాయించి చదువుకోవచ్చు.

పరీక్షలో కొన్ని ప్రశ్నలకు జవాబు గుర్తించడం తెలిసినప్పటికీ అందుకు ఎక్కువ వ్యవధి అవసరం అవుతుంది. అలాంటివాటిని సమయం ఉంటే ప్రయత్నించాలి. అలాగే మరికొన్ని ప్రశ్నలు చదవడానికే ఎక్కువ వ్యవధి తీసుకుంటాయి. వీటి జోలికి ఆఖరులో సమయం ఉంటేనే వెళ్లాలి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో విజయానికి విజ్ఞానంతో పాటు ఏ ప్రశ్నలు ముందు సాధించాలి, వేటిని తర్వాత ప్రయత్నించాలో నిర్ణయించుకోగల నైపుణ్యానికీ ప్రాధాన్యం ఉంటుంది. వేటిని వదులుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు మాక్‌ పరీక్షలు మార్గదర్శిలా ఉపయోగపడతాయి.

జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్‌ ఎనాలసిస్‌ విభాగాలను ప్రాథమిక పరీక్షల అనంతరం కొంచెం ఎక్కువ సమయం వెచ్చించి చదువుకుంటే సరిపోతుంది.

ఇక రిఫరెన్స్‌ పుస్తకాల విషయానికొస్తే అభ్యర్థి ఏదో ఒక పబ్లిషర్స్‌ (చాంద్, పియర్సన్, అరిహంత్, టాటా మెక్‌గ్రాహిల్స్‌...) పుస్తకాన్ని తీసుకుని చదువుకుంటే సరిపోతుంది. అన్ని పుస్తకాలూ కలిపి అధ్యయనం చేయడం వల్ల సమయం వృథా. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయాలి.

అర్హత:
జనరలిస్ట్‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

ఐటీ: బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఎలక్టాన్రిక్స్‌ లేదా ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ వీటిలో ఏదైనా ఉత్తీర్ణత

సీఏ: బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఫైనల్‌ ఉత్తీర్ణత.

యాక్చూరియల్‌: బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు యాక్చూరీస్‌ ఇండియా గుర్తింపు

రాజభాష: హిందీ లేదా హిందీ అనువాదంలో పీజీతోపాటు యూజీలో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి లేదా ఇంగ్లిష్‌లో పీజీతోపాటు యూజీలో హిందీ చదివుండాలి. లేదా సంస్కృతంలో పీజీతోపాటు యూజీలో హిందీ, ఇంగ్లిష్‌ చదివుండాలి.

వయసు: మార్చి 1 నాటికి 21-30 ఏళ్లలోపు ఉండాలి. అంటే మార్చి 2, 1989 కంటే ముందు; మార్చి 1, 1998 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

విభాగాల వారీ ఖాళీలు ఇలా: జనరలిస్ట్‌ 350, ఐటీ 150, సీఏ 50, యాక్చూరియల్‌ 30, రాజభాష 10.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 22

ప్రవేశ పత్రాలు: ఏప్రిల్‌ 22 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

ప్రాథమిక పరీక్షలు: మే 4, 5 తేదీల్లో నిర్వహిస్తారు

ప్రధాన పరీక్షలు: జూన్‌ 28న నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.వంద; మిగిలిన అభ్యర్థులందరికీ రూ.600

పరీక్ష కేంద్రాలు: ఏపీలో... చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో... హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌.

వెబ్‌సైట్‌: https://ibpsonline.ibps.in/licaaofeb19/

ఆకర్షణీయ వేతనం...
ఎంపికైనవారికి రూ.32,795 మూలవేతనం లభిస్తుంది. కరవుభత్యం, ఇంటిఅద్దె తదితర అలవెన్సులు అన్నీ కలుపుకుని ప్రధాన నగరాల్లో విధుల్లో చేరినవాళ్లు తొలి నెల నుంచే రూ.56,000 వేతనంగా పొందవచ్చు. విధుల్లో చేరినవాళ్లు నాలుగేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఒప్పందపత్రాలు సమర్పించాలి. దీన్ని ఉల్లంఘించినవారు రూ.2 లక్షలు చెల్లించాలి. ప్రొబేషన్‌ వ్యవధి ఏడాది.



ఎల్ఐసీలో 590 ఏఏవో పోస్టులు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఏఏవో పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
పోస్టు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ (ఏఏవో)
మొత్తం ఖాళీలు: 590
విభాగాల‌వారీ ఖాళీలు: జ‌న‌ర‌లిస్ట్‌-350, ఐటీ-150, చార్ట్‌డ్ అకౌంటెంట్‌-50, యాక్చూరియ‌ల్‌-30, రాజ‌భాష‌-10.
విభాగాల‌వారీ అర్హ‌త‌లు: 1) జ‌న‌ర‌లిస్ట్ - బ్యాచిల‌ర్ డిగ్రీ
2) ఐటీ - ఇంజినీరింగ్ గ్రాడ్యుయేష‌న్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎల‌క్ట్రానిక్స్‌) లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ (కంప్యూట‌ర్ సైన్స్‌).
3) చార్డ్‌డ్ అకౌంటెంట్ - బ్యాచిల‌ర్ డిగ్రీతోపాటు సీఏ ఫైన‌ల్‌.
4) యాక్యూరియ‌ల్ - బ్యాచిల‌ర్ డిగ్రీతోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయ‌రీస్ ఆఫ్ ఇండియా నిర్వ‌హించే సీటీ1, సీటీ5 పేప‌ర్ల ఉత్తీర్ణ‌త‌.
5) రాజ‌భాష - ఇంగ్లిష్ ఒక స‌బ్జెక్టుగా బ్యాచిల‌ర్ డిగ్రీతోపాటు పీజీ (హిందీ/ హిందీ ట్రాన్స్‌లేష‌న్‌) లేదా హిందీ ఒక స‌బ్జెక్టుగా బ్యాచిల‌ర్ డిగ్రీతోపాటు పీజీ (ఇంగ్లిష్‌) లేదా ఇంగ్లిష్‌, హిందీ స‌బ్జెక్టుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీతోపాటు పీజీ (సంస్కృతం) ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌:ప‌రిమితి: 01.03.2019 నాటికి 21 నుంచి 30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌, మెయిన్ ఎగ్జామ్, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ఎగ్జామ్ ఆధారంగా.
ప్రిలిమినరీ ప‌రీక్షా కేంద్రాలు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ - చీరాల‌, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం; తెలంగాణ - హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.
మెయిన్ ప‌రీక్షా కేంద్రాలు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: గుంటూరు, క‌ర్నూలు, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం; తెలంగాణ - హైద‌రాబాద్‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.100, మిగిలిన‌వారికి రూ.600.
ముఖ్య తేదీలు....
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: మార్చి 2
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపున‌కు చివ‌రితేది: మార్చి 22
ప్రిలిమినరీ ప‌రీక్ష‌కు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: ఏప్రిల్ 22 నుంచి 30 వ‌ర‌కు.
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌: మే 4, 5
మెయిన్ ఎగ్జామ్ నిర్వ‌హ‌ణ‌: జూన్ 28

Posted on 02-03-2019

LIC AAO- Info.

  • Notification
  • Website
  • FAQs