Preparation Plan

స్థాయి పెంచుకుంటేనే నీట్‌ సీటు!

నేషనల్‌ పూల్‌లో తెలుగు రాష్ట్రాలు కలవడం వల్ల ‘నీట్‌’ ద్వారా తేలిగ్గా మెడికల్‌ సీట్లు వచ్చేస్తాయనీ, సన్నద్ధతకు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదనీ.. ఇలాంటి అపోహలు వ్యాపిస్తున్నాయి. వీటిని విశ్వసించి, అశ్రద్ధ చూపితే విద్యార్థులకు నష్టదాయకమవుతుంది. జాతీయస్థాయి పోటీని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతిభాస్థాయిని పెంచుకోవాల్సిందే. మారిన పరిస్థితుల్లో మెడికల్‌ సీటు సాధించటానికి ఏ దిశలో ‘నీట్‌’కు తయారవ్వాలో తెలిపే విశ్లేషణ ఇది!
మెడికల్‌ లేదా డెంటల్‌ కళాశాలల్లో సీటు సాధించాలనుకునే విద్యార్థులకు ఇప్పుడు మూడే పరీక్షలు మిగిలాయి. అవి నీట్‌-యూజీ, ఎయిమ్స్‌, జిప్‌మర్‌. వీటిలో అధిక సంఖ్యలో లేదా 98 శాతం వరకు విద్యార్థులు నీట్‌ రాయాలని కోరుకునేవారే ఉంటున్నారు. గత సంవత్సరం నీట్‌ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ జరిగినప్పటికీ 371 9(డి) ఆర్టికల్‌ ఉండటం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు యూనివర్సిటీల (ఉస్మానియా, ఆంధ్ర, శ్రీవేేంకటశ్వర) ప్రాతిపదికనే అడ్మిషన్లు జరిగాయి. అయితే ఈ సంవత్సరం 371 డి నుంచి మినహాయింపు కోరడం వల్ల విద్యార్థుల్లో లాభమని కొందరూ, నష్టమని కొందరూ విశ్లేషణలు చేస్తున్నారు. దీనికంటే విద్యార్థులు తయారీ విధానం పటిష్ఠం చేసుకోవటం లాభదాయకం.
మనం నేషనల్‌ పూల్‌లో కొన్ని సీట్లు ఇవ్వడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల సీట్లు కొన్ని తగ్గవచ్చు. గవర్నమెంట్‌ కళాశాలల్లోని సీట్లలో మాత్రమే 15% ఇస్తే 450 సీట్లు (1900 + 1100), కేటగిరి- ఎ సీట్లు కూడా ఇవ్వాల్సి వస్తే దాదాపు 750 నుంచి 800 వరకు సీట్లు నేషనల్‌ పూల్‌కి ఇవ్వాలి.
దేశంలో మొత్తం 458 మెడికల్‌ కళాశాలలు ఉంటే వాటిలో 201 మాత్రమే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు. వాటిలో సీట్లు 27880. వాటిలో 15 శాతం సీట్లు అంటే 4182 సీట్లు నేషనల్‌ పూల్‌లో ఉంటాయి. 2017లో తెలుగు విద్యార్థులు మొదట లక్ష ర్యాంకుల్లో 10 శాతం లోపు మాత్రమే ఉన్నారు. అది కూడా మొదటి 50,000 ర్యాంకులలో కొద్దిగా ఎక్కువ శాతం, లక్షలోపు ర్యాంకుల్లో తక్కువ శాతం ఉన్నారు. దానివల్ల నేషనల్‌ పూల్‌లో మనం సాధించుకోగల్గిన సీట్ల శాతం 8కి మించదు. 4182 సీట్లలో 8 శాతం అంటే సుమారుగా 335. వీటిలో జమ్ము-కశ్మీర్‌, అసోం, సిక్కిం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో చేరేవారు ఉండకపోవచ్చు. ఆ సంఖ్య తీసివేస్తే 250 నుంచి 300 లోపు సీట్లు వచ్చినా కచ్చితంగా అధికసంఖ్యలో సీట్లు తగ్గిపోతాయి.
అయితే ఇది తొలి సంవత్సరం కాబట్టి విద్యార్థుల అవగాహన తక్కువ ఉండటం వల్ల సక్సెస్‌ రేటు తగ్గిందని చెప్పవచ్చు. రాబోయే కాలంలో జాతీయ స్థాయిలోని లక్షలోపు ర్యాంకుల్లో 15,000 పైన తెలుగు విద్యార్థులు సాధించుకోగల్గితే సీట్ల సంఖ్య పరంగా లాభనష్టాలు ఉండవు. అయితే ఈ విధానం వల్ల విద్యార్థులు వివిధ రాష్ట్రాలలోని ఉత్తమ కళాశాలల్లో ప్రవేశానికి అర్హత సాధించిన వారవుతారు. అదేవిధంగా 50,000 లోపు జాతీయ స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థులు వెలుపలి రాష్ట్రాల్లో మంచి కళాశాలల్లో సీటు సాధించుకునే అవకాశం పెరుగుతుంది.
పోటీ బాగా పెరుగుతుంది
సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది కాబట్టి పోటీ ఇంకా బాగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి గత సంవత్సరపు కటాఫ్‌ మార్కు కంటే ప్రతి కేటగిరీలోనూ 20 మార్కుల వరకు పెంచుకోవడానికి ప్రణాళిక తయారుచేసుకోవాలి.
నీట్‌ పీజీ ప్రవేశాలకు ఇతర రాష్ట్రాల్లోని సీట్ల సంఖ్య ఎక్కువ. ఇంకా నేషనల్‌ పూల్‌కి 50 శాతం సీట్లు కేటాయింపు ఇవ్వాలి కాబట్టి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు బాగా లాభపడతారు.
బయాలజీలో అదనం
బయాలజీలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలోని వాక్యాలకు మాత్రమే పరిమితమైతే 90 ప్రశ్నల్లో 75 ప్ర¾శ్నల వరకు సమాధానాలు గుర్తించవచ్చు. మిగిలిన 15 ప్రశ్నలు కూడా బాగా రాయాలంటే అదనంగా కొంత చదవడం, పరీక్షల రూపంలో కొత్త ప్రశ్నలకు జవాబు గుర్తించడం అభ్యాసం చేసుకోవాలి.
బయాలజీలో 12 వ తరగతిలోని జెనెటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్‌, ఎకాలజీ; 11వ తరగతిలోని ప్లాంట్‌ ఫిజియాలజీ, హ్యూమన్‌ ఫిజియాలజీలకు ప్రాధాన్యం ఇచ్చి పునశ్చరణ చేసుకోవాలి. వీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చి చదివిన విద్యార్థి అదనంగా 20 మార్కులు సాధించుకునే అవకాశం ఏర్పడుతుంది.
ఫిజిక్స్‌లో నూరుశాతం
ఈ సబ్జెక్టులో ద్వితీయ సంవత్సరపు పుస్తకం నుంచే అధిక ప్రశ్నలుంటాయి. ప్రాధాన్యతా క్రమం కూడా అలాగే ఉండాలి. ద్వితీయ సంవత్సరపు సిలబస్‌లోని ఎలక్ట్రిసిటీ, ఆధునిక భౌతికశాస్త్రం (మోడర్న్‌ ఫిజిక్స్‌) బాగా చేయగల్గితే దాదాపు 50 శాతం ప్రశ్నలకు జవాబులు రాయవచ్చు. మోడర్న్‌ ఫిజిక్స్‌ చదవటం వల్ల అది కెమిస్ట్రీకి కూడా బాగా ఉపయోగం. దానిలోని ఆటమ్‌, న్యూక్లియై పాఠ్యాంశాలు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.. దేనికైనా సరిపోతాయి. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించుకునే అవకాశమూ ఏర్పడుతుంది.
భౌతిక శాస్త్రంలో విద్యార్థి కొంత ఇబ్బంది అని చెప్పేది ప్రథమ సంవత్సర సిలబస్‌లోని యాంత్రిక శాస్త్రం (మెకానిక్స్‌). అయితే వాటిలో ఫార్ములాలు కంఠస్థం చేయడం కాకుండా, విశ్లేషణతో విషయాన్ని అర్థం చేసుకోగల్గితే మిగిలిన వాటికంటే మెకానిక్స్‌లోనే ఎక్కువ మార్కులు సాధించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఫిజిక్స్‌లో ఇచ్చే 45 ప్రశ్నల్లో సాధారణ విద్యార్థి కూడా 35 ప్రశ్నలకు పైగా జవాబులు గుర్తించే విధంగానే ప్రశ్నపత్రాలు ఉంటున్నాయి. కనీసం 180 మార్కులకు జరిగే ఫిజిక్స్‌ తుది పరీక్షలో కనీసం 120 - 140 మార్కుల వరకు సాధించుకునే దిశలోనే విద్యార్థి అభ్యాసం చేయాలి. అవగాహనతో, విశ్లేషణతో తయారయ్యే ఏ విద్యార్థి అయినా భౌతిక శాస్త్రంలో నూరు శాతం మార్కులు అంటే 180కి 180 మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది.
కెమిస్ట్రీలో గరిష్ఠంగా..
రసాయన శాస్త్రంలో కూడా ద్వితీయ సంవత్సర సిలబస్‌కే ప్రాధాన్యం బాగా ఎక్కువ. దీనిలో విద్యార్థులు లెక్కలు ఎక్కువగా ఉంటున్నాయనే అపోహతో ఉంటున్నారు. మొత్తం 45 ప్రశ్నల్లో 35 నుంచి 40 ప్రశ్నల వరకు సిద్ధాంతపరమైన ప్రశ్నలు మాత్రమే ఉంటున్నాయి. కర్బన, అకర్బన, భౌతిక రసాయన శాస్త్రాల్లో కూడా ప్రశ్నలు దాదాపు సమ విభజనతో అంటే ఒక్కో విభాగం నుంచి 15 ప్రశ్నల వరకు వస్తున్నాయి.
అకర్బన రసాయన శాస్త్రంలో గుర్తుంచుకునే ప్రశ్నలే అధికం. వాటిలో పీ, డీ, ఎఫ్‌ బ్లాక్‌ మూలకాల్లో వస్తున్నాయి. కో ఆర్డినేషన్‌ కాంపౌండ్స్‌లోని ప్రశ్నలను కూడా కొంత విశ్లేషించి అర్థం చేసుకోవడం మేలు. కర్బన రసాయన శాస్త్రంలో నేమ్‌డ్‌ రియాక్షన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చి వాటిని ఒకే దగ్గర విద్యార్థి నోట్‌ తయారుచేసుకోగల్గితే తుది పరీక్షల్లో బాగా ఉపయోగపడతాయి.
మెకానిజంలో రియాక్షన్స్‌, ప్రొడక్ట్స్‌ గురించే కాకుండా కెటలిస్ట్‌ రోల్‌, ఇంటర్మీడియట్‌ కాంపౌండ్స్‌ ఏమి తయారవుతాయి అనేదానిపై విశ్లేషణ అవసరం. భౌతిక రసాయన శాస్త్రంలో ఇచ్చే ప్రాబ్లమ్స్‌లో కూడా సింపుల్‌ అప్లికేషన్స్‌ మాత్రమే ఉంటున్నాయి. దీనిలో సాలిడ్‌ స్టేట్‌, సొల్యూషన్స్‌పై కొంత ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రసాయనశాస్త్రం విశ్లేషణతో తయారైన విద్యార్థి సులభంగా 180 మార్కులకు 160 మార్కుల వరకూ సాధించుకునే అవకాశం ఉంటుంది.
పోటీ పరీక్షల పరంగా ఇంటర్మీడియట్‌ మార్కులకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఈ జనవరి, ఫిబ్రవరి నెలలు విద్యార్థి ద్వితీయ ఇంటర్‌తోపాటు ఆ సిలబస్‌లోనే పోటీ పరీక్షలకు కూడా తయారు కాగలిగితే మంచిది. మార్చి 14వ తేదీకి ఇంటర్‌ పరీక్షలు పూర్తవుతాయి కాబట్టి తర్వాత ప్రథమ సంవత్సర సిలబస్‌ పునశ్చరణ చేసుకొని నమూనా పరీక్షలు రాయవచ్చు. అవి కనీసం 10 నుంచి 12 వరకు రాయగల్గితే నీట్‌లో మెరుగైన ర్యాంకు దిశలో ముందుకు సాగుతున్నట్టే అవుతుంది!
మార్కులెన్ని? ర్యాంకు ఎంత?
గత సంవత్సరం ర్యాంకు, మార్కుల కటాఫ్‌ తెలంగాణ రాష్ట్రంలో కింది విధంగా ఉంది.

ఇది ప్రభుత్వ, ప్రయివేట్‌ కళాశాలల్లో కేటగిరీ-ఎ సీట్ల కటాఫ్‌ కాబట్టి విద్యార్థి ఈ మార్కుకి కనీసం 20 మార్కులు పెంచుకోవడం అంటే ఇప్పుడు ఓసీ విద్యార్థులకు 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో కనీసం 540 మార్కులపైన సాధించుకోవాలి. ఇప్పటినుంచి సూక్ష్మరీతిలో ప్రణాళిక వేసుకొని, ఆచరించే విద్యార్థికి మాత్రమే విజయం చేకూరే అవకాశం ఉంది.
సారాంశం ముఖ్యం
తెలుగు విద్యార్థులు ఇంతవరకు ఎంసెట్‌ టీచింగ్‌ విధానంలోనే కొనసాగుతున్నారు కాబట్టి పాఠ్యపుస్తకంలోని ప్రతి వాక్యాన్నీ వీలైనన్ని ఎక్కువసార్లు చదవాలనే అపోహతోనే ఉంటున్నారు. కానీ విద్యార్థులు వాక్యంలోని పదాలు అలాగే నేర్చుకోవాలనే విధానాన్ని వదిలిపెట్టి ఆ పేజీలోని సారాంశం ఏంటి అనేది సంపూర్ణంగా గ్రహించాలి. దాన్ని ప్రశ్నల రూపంలో తయారుచేసుకొని అభ్యాసం చేసినప్పుడే కావాల్సిన మార్కులు సాధించుకోవచ్చు.
తయారీ విధానంలో ఇప్పటివరకు భౌతిక శాస్త్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి విద్యార్థులు చదువుతున్నారు. దాంతోపాటు బయాలజీ, కెమిస్ట్రీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సీటు సాధించాలంటే 720 మార్కులకు 540 మార్కుల వరకు సాధించాలి. అది జరగాలంటే ముందుగా విద్యార్థి 360 మార్కులకు జరిగే బయాలజీలో 340 మార్కుల వరకు సాధించగల్గాలి.

- పి.వి.ఆర్‌.కె. మూర్తి, చైర్మ‌న్‌, శ్రీ గాయ‌త్రి విద్యాసంస్థ‌లు

Posted on 11-01-2018