Preparation Plan

సీటు పట్టేద్దాం... నీట్‌గా!

ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ చేయాలనుకునే ప్రతి విద్యార్థికీ ముఖ్యమైన పరీక్ష నీట్‌. ఇది మే 6న జరుగుతుంది. ఈ ఏడాది నుంచి రెండు తెలుగు రాష్ట్రాలూ నేషనల్‌ పూల్‌లోకి వెళ్లడం వల్ల మన రాష్ట్రాల కన్వీనర్‌ కోటాలోని మెడికల్‌, డెంటల్‌ సీట్లలో 15% ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఇవ్వాలి. అలాగే ఇతర రాష్ట్రాల్లోని 15% సీట్లకు మన విద్యార్థులు పోటీ పడవచ్చు. ఈ పరిస్థితుల్లో గత సంవత్సరాలకంటే మెరుగ్గా కృషి చేయాల్సిందే!
ఇంటర్‌ పరీక్షలు పూర్తయి, పోటీపరీక్షల సన్నద్ధత వేగం పుంజుకుంటోంది. బైపీసీ విద్యార్థులు రాసే ముఖ్య పరీక్షలు నీట్‌, ఎంసెట్‌. కొంతమంది ఎయిమ్స్‌, జిప్‌మర్‌ పరీక్షలు కూడా రాస్తున్నారు. ఎయిమ్స్‌ మే 26, 27 తేదీల్లో, జిప్‌మర్‌ జూన్‌ 3న జరుగుతుంది.
కనీసం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 550 మార్కులకుపైగా వస్తేనే.. 2018లో మెడికల్‌ కళాశాలలో ఎ- కేటగిరీ సీట్లలో చేరే అవకాశం ఉంటుంది. ఈ అవగాహన ఏర్పరచుకుని సరైన ప్రణాళికతో ఈ 45 రోజులు తయారు కాగలిగితే సులభంగా సీటు సాధించుకోవచ్చు. నేషనల్‌ పూల్‌కి వెళ్లడం వల్ల ఓపెన్‌ కేటగిరీ విద్యార్థులు నష్టపోతారు కానీ రిజర్వేషన్‌ (ఎస్‌సీ, ఎస్‌టీ) విద్యార్థులకు అదనంగా కొంత మేలు జరుగుతుంది. అంటే వారు ఇతర రాష్ట్రాల్లోని సీట్లను తక్కువ మార్కులకే పొందే అవకాశముంది.
12 లక్షల మంది రాస్తున్న నీట్‌లో 550/720 మార్కులు తెచ్చుకోవాలంటే ప్రతిరోజూ ప్రతి విషయాన్నీ అవగాహన చేసుకుని వెళ్ళాల్సిందే. సబ్జెక్టువారీ ప్రణాళిక ఎలా ఉండాలో తెలుసుకుందాం!
సగభాగం బయాలజీదే!
2018లో జరగబోయే నీట్‌లో బయాలజీ నుంచి మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. బోటనీ, జువాలజీ సమంగా ఉండాల్సిన అవసరం లేదు. గత రెండేళ్లుగా బోటనీ నుంచి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి సుమారుగా 50, 40గా తీసుకోవచ్చు. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు కాబట్టి బయాలజీలో 360 మార్కులు సంపాదించుకోవచ్చు. 720 మార్కులకు జరిగే నీట్‌లో సగభాగం బయాలజీదే. దీనిలో సాధారణంగా చదివే విద్యార్థి జాగ్రత్త వహిస్తే 300కుపైగా మార్కులను సాధించుకోవచ్చు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలకు మాత్రమే పరిమితమైనా 320కుపైగా సాధించుకునే అవకాశం ఉంటుంది.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదువుతూ ముఖ్యాంశాలను పాఠ్య పుస్తకంలోనే అండర్‌లైన్‌ చేసుకోవాలి. తరువాత సీబీఎస్‌ఈ బోర్డు ప్రశ్నలను చదివితే ప్రశ్నపత్రంలో ఎలాంటి ప్రశ్నలకు ప్రాధాన్యం ఉంటుందో అవగతమవుతుంది. తెలుగు రాష్ట్ర విద్యార్థులు ఇంతవరకూ ఎంసెట్‌కు అలవాటుపడ్డారు కాబట్టి సీబీఎస్‌ఈ ప్రశ్నలను చూడటం తప్పనిసరి. అందుకే తెలుగు రాష్ట్రాల బయాలజీ పుస్తకం కంటే ఉత్తర భారతదేశ పుస్తకాలను ఎంచుకుంటే సీబీఎస్‌ఈ వారు ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నారో అర్థమవుతుంది. మన రాష్ట్రాల్లో చాలావరకు పాత ఎంసెట్‌ మెటీరియల్‌కు అట్టతీసి నీట్‌ పుస్తకంగా ప్రచురిస్తున్నారు. అలాకాకుండా నీట్‌ను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్‌ఈలో అడిగే ప్రశ్నల విధానంపై అవగాహన పెంచే పుస్తకాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి చదవాలి.
బయాలజీలో వివిధ చాప్టర్ల వెయిటేజీ గత సంవత్సరాల్లో కింది విధంగా ఉంది. ఈ ఏడాది కూడా స్వల్ప మార్పులతో అదే కొనసాగవచ్చు.

నీట్‌ బయాలజీ పునశ్చరణలో జాగ్రత్తలు
* బొమ్మలను లేబుల్స్‌తో అర్థం చేసుకోవడం, గుర్తుంచుకోవడం.
* పరీక్షల్లో ఎక్కువగా అడిగే ప్రశ్నలను ఒక దగ్గర రాసుకోవడం.
* ఎక్కువగా మర్చిపోయే అంశాలను ఒక దగ్గర రాసుకోవడం.
* బహుళైచ్ఛిక ప్రశ్నలను వీలైనన్ని ఎక్కువగా అభ్యాసం చేయడం.
* ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు క్షుణ్ణంగా చదవడం.
సమయం తక్కువగా ఉంది. కాబట్టి సులభంగా మార్కులు సాధించే అంశాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించడం మేలు. చదివే సమయంలో కనీసం 50% కాలాన్ని బయాలజీకి ఇవ్వగలిగితే ఎక్కువ లాభం చేకూరుతుంది.
రసాయనశాస్త్రం.. ప్రశ్నల్లో తేడా
దీని మూడు విభాగాల్లో విద్యార్థి తయారీ విధానంలో స్వల్ప మార్పు ఉండాలి. అంటే భౌతిక, అకర్బన, కర్బన రసాయన శాస్త్రాలకు ఒకే పద్ధతిని పాటించడం సరి కాదు.
అకర్బన రసాయన శాస్త్రంలో సిద్ధాంతపరమైన ప్రశ్నలుంటాయి. కాబట్టి సన్నద్ధమయేటపుడు దీన్ని చివరకు మిగులుస్తారు. ఇది చాలా తప్పు. ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో గ్రూపులకు సంబంధించి టేబుల్స్‌ చేసుకుంటూ వెళితే గుర్తుంచుకోవడం సులభమవుతుంది.
భౌతిక రసాయన శాస్త్రంలో కొన్ని ఫార్ములాలు గుర్తుంచుకోవాలి. లెక్కించడం త్వరగా చేయడం అభ్యసించాలి. జవాబుల్లో అంతరం ఉంటుంది కాబట్టి మొదట లెక్కించేటప్పుడు సుమారుగా చూసుకుని దగ్గర సంఖ్యకు వెళ్లవచ్చు.
ఉదాహరణకు- 9.8 × 4 ఉంది అనుకుందాం. దానిని 10 × 4గా తీసుకుని 40 కంటే కొద్దిగా తక్కువగా ఉన్న జవాబు ఏది ఉందో గమనిస్తే.. మిగిలినవి దూరంగా ఉంటే ఆ జవాబును వెంటనే గుర్తించవచ్చు. ఇటువంటి అభ్యాసం ఇప్పటినుంచే చేయాలి. ఈ సమయంలో రాని ప్రశ్నలకు ఎక్కువ సమయాన్ని వృథా చేసుకోకుండా వచ్చినవాటిని పునశ్చరణ చేసుకుంటే తుది పరీక్షలో వాడి, కచ్చితత్వం పెరుగుతాయి.
కర్బన రసాయన శాస్త్రంలో మెకానిజం మీద ప్రశ్నలు ఇస్తున్నారు. ఎక్కువమంది విద్యార్థులు వాటిలోనే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. ఈ చర్యల్లో రియేజంట్‌ ప్రాముఖ్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే సులభంగా జవాబును గుర్తించవచ్చు.

నీట్‌ కెమిస్ట్రీ పునశ్చరణలో జాగ్రత్తలు
* గ్రూపులు, వాటి ధర్మాలకు సంబంధించి టేబుల్స్‌ తయారు చేసుకుని ప్రతిరోజూ ఒకసారి చదవాలి.
* ఆక్సిడైజింగ్‌, రెడ్యూసింగ్‌ ఏజెంట్స్‌ గురించి విడివిడిగా నోట్స్‌ తయారు చేసుకోవాలి.
* ఆర్గానిక్‌ రియాక్షన్స్‌ను వీలైనన్ని ఎక్కువసార్లు పేపర్‌ మీద సాధన చేయాలి.
* నీట్‌ సంబంధిత పుస్తకాల్లోని బహుళైచ్ఛిక ప్రశ్నలను మాత్రమే ఎక్కువగా తయారు చేసుకోవాలి.
* పరీక్షను 45 నిమిషాల వ్యవధిలో పూర్తిచేసేలా అభ్యాసం అలవరచుకోవాలి.
భౌతికశాస్త్రం... పట్టున్నవి పునశ్చరణ
భౌతికశాస్త్రంపై ఇప్పటికే పట్టు ఏర్పరచుకుని ఉండాలి. కానీ ఎక్కువ శాతం విద్యార్థులు ఈ సమయంలో భౌతికశాస్త్రానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించి చివరికి పూర్తిగా నష్టపోతున్నారు.
పోటీపరీక్షల్లో విద్యార్థి మానసిక స్థితి చాలా ప్రభావం చూపుతుంది. భౌతికశాస్త్రంపై భయంతో ఎక్కువ సమయం వెచ్చించేకొద్దీ విద్యార్థి తనపై ఆత్మవిశ్వాసం కోల్పోయి తుది పరీక్షలో అధ్వానస్థితికి పోయే ప్రమాదముంది. అందుకే ఈ తక్కువ సమయంలో ఏ అంశాలపై పట్టు ఉందో వాటికే ఎక్కువ సమయం కేటాయించాలి. వాటినే రెండు, మూడుసార్లు పునశ్చరణ చేసుకోవాలి. ఇలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఏర్పడుతుంది.
విద్యార్థికి ప్రథమ సంవత్సర సిలబస్‌పై బాగా పట్టు ఉంటే మెకానిక్స్‌కి తోడుగా మోడర్న్‌ ఫిజిక్స్‌ని.. ద్వితీయ సంవత్సర సిలబస్‌పై పట్టు బాగా ఉంటే ఎలక్ట్రిసిటీకి తోడుగా మోడర్న్‌ ఫిజిక్స్‌ని బాగా అభ్యాసం చేయాలి. దీనివల్ల 45 ప్రశ్నల్లో 30కిపైగా జవాబులను తప్పకుండా గుర్తించే వీలవుతుంది. అవగాహనతో ఈ విధంగా సిద్ధమైన ఏ విద్యార్థి అయినా సులభంగా 600/720 పైగా మార్కులు తెచ్చుకోవచ్చు!- పీవీఆర్‌కే మూర్తి, శ్రీ గాయ‌త్రి విద్యాసంస్థ‌లు

Posted on 11-01-2018